ఉన్నత పాఠశాల ముందు పూల వనం
ఆ పాఠశాల ఒక నందనవనం. రకరకాల మొక్కలు ఆ చదువుల గుడికి అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. బడి ఆవరణలో అడుగుపెడితే చాలు ఆహ్లాదకరమైన వాతారణం స్ఫురిస్తోంది. అదే మండలంలోని గోయగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల. దీనంతటికి ఉపాధ్యాయులు ప్రోత్సాహం.. విద్యార్థుల శ్రమ తోడై పూల మొక్కలు పాఠశాలకు పచ్చని పందిరి వేశాయి.
కెరమెరి : మండలంలోని గోయగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాలల ప్రాంగాణాన్ని పూలవనంలా మార్చేశారు. దీంతో ఆ పాఠశాలలు పచ్చని వాతావరణాన్ని సంతరించుకున్నాయి. జెడ్పీఎస్‌ఎస్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు 172 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 50 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
విద్యార్థుల కృషి ఫలితమే..
సిబ్బందితో పాటు విద్యార్థులకు పూల మొక్కలను పెంచాలనే ఆతృత ఎక్కువగా ఉండడంతో నేడు పాఠశాల ప్రాంగణాలు పూల వనాలుగా మారాయి. బంతి, చేమంతి తదితర పూల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఉన్నత పాఠశాలలో విద్యుత్ బోరు ఉండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులే మొక్కలకు నీళ్లు పోస్తూ వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రాథమిక పాఠశాల ప్రాంగాణంలోని చేతిపుంపు నీటని ఆ పాఠశాల చిన్నారులు పూల మొక్కలకు పోస్తూ వాటిని రక్షించుకుంటున్నారు.
టేకు, నీలగిరి చెట్లు కూడా..
ఒక్క పూల మొక్కలే కాదు నీలగిరి, టేకు, జామ, వేప చెట్లు కూడా పెంచుతున్నారు. ప్రస్తుతం ఆ చెట్లు పాఠశాలలకు శోభనిస్తున్నాయి. వేసవిలో చల్లటి గాలి వీస్తున్నప్పుడు ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిదని విద్యార్థులు చెబుతున్నారు.
సొంత ఖర్చులతో..
ప్రభుత్వం ఈ పాఠశాలలకు కంచెల నిర్మాణం చేపట్టక పోవడంతో ఉపాధ్యాయులే సొంత ఖర్చుతోనే పూలు, ఇతర మొక్కల రక్షణçకు కంచెలు ఏర్పాటు చేశారు. గతంలో ‘ఉపాధి’ అధికారులు మొక్కలకు ట్రీ గార్డులు ఇస్తారని ప్రచారం చేసినప్పటికీ పంపిణీ జరగలేదు. గతేడాది ప్రహరీలు మంజూరవుతాయని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు ఆ హామీలు కార్యరూపం దాల్చలేదు.
Comments
Please login to add a commentAdd a comment