ఫీజులు వచ్చాయోచ్
* జిల్లాకు రూ. 11.93 కోట్లు
* రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు
* వారం రోజులలో విద్యార్థుల ఖాతాలలోకి
* 30 శాతం మాత్రమే విడుదల
* మిగతావి రెండో దశలో!
ఇందూరు : పేద విద్యార్థుల చదువులకు లైన్ క్లియరైంది. తెలంగాణ విద్యార్థులకే ఫాస్ట్ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని చెప్పి ఇన్నాళ్లు స ందిగ్ధంలో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేసింది. దీంతో ఇన్ని రోజులుగా విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 15 రోజుల క్రితమే రాష్ర్టవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా నిధు లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
జిల్లాలవారీగా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సంక్షేమ శాఖలకు నిధులను కేటాయిస్తూ శనివారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ కలిపి మొత్తంగా జిల్లాకు రూ.11.93 కోట్లను మంజూరు చేశారు. అయితే, జిల్లాకు రూ. 30.50 కోట్లు అవసరం ఉం డగా మొదటి దశగా 30 శాతం నిధులను మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. మిగతావి ఒకటి లేదా రెండు దశలలో వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 1400 మంది ఎస్‌సీ విద్యార్థులకు రూ. 3 కోట్లు అవసరం ఉండగా, రూ.1. 28 కోట్లు విడుదలయ్యాయి.
7,500 మంది ఎస్‌టీ విద్యార్థులకు రూ.3.50 కోట్లు అవసరం కాగా, రూ.1.65 కోట్లు, బీసీ, ఈబీసీలలో 51వేల మంది విద్యార్థులకు రూ.24 కోట్లు అవసరం ఉండగా రూ. 9 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను జిల్లా సంక్షేమాధికారులు మొదటగా స్వీకరించి, తరువాత బిల్లులను ట్రెజరీకి అందజేస్తారు. వారు బిల్లులను పాస్ చేసి బ్యాంకులలో వేస్తారు. బ్యాంకు నుంచి విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల ఖాతాలలో జమ అవుతాయి. ఇందతా జరగడానికి వారం, పది రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.