వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకన్నగౌడ్ డిమాండ్
హుజూర్‌నగర్ : చండూరు, చివ్వెంల మండలాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి 161 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. సన్నబియ్యంతో భోజనం అందజేయాలని ఆదేశాలున్నా కొన్ని పాఠశాలల్లో నాసిరకం బియ్యాన్నే వాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపుల్లోనూ అధికారులు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. వారి నుంచి ప్రతినెలా మామూళ్లు తీసుకోవడం వల్ల వారు నాణ్యమైన భోజనం అందించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులు చొరవ చూపి చండూరు, చివ్వెంల మండలాల్లోని ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. సమావేశ ంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి కోడి మల్లయ్య యాదవ్, జిల్లా కోశాధికారి పిల్లి మరియదాసు, పట్టణ, మండల అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి, జడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల అస్వస్థతపై విచారణ చేపట్టాలి
Published Wed, Sep 30 2015 4:42 AM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM
Advertisement
Advertisement