కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న అనిల్ కుటుంబ సభ్యులు
మామిడికుదురు : 216వ నెంబర్ జాతీయ రహదారిపై స్థానిక పెట్రోల్ బంక్ ఎదురుగా ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాశర్లపూడి కైకాలపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం మండల శాఖ అధ్యక్షుడు గెడ్డం అనిల్ (22) మృతి చెందాడు. మామిడికుదురు నుంచి బుల్లెట్‌పై ఇంటికి వెళ్తున్న అనిల్ ఆటోను తప్పించబోయి అదుపు తప్పి ఎదురుగా మామిడికుదురు వైపు వస్తున్న కారును ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అనిల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. దీనిపై నగరం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె.సోమరాజు కేసు నమోదు చేశారు. రాజోలు ఎస్సై కె.లక్ష్మణరావు దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రాజోలు సీఐ ఎం.క్రిస్టోఫర్ మృతదేహాన్ని పరిశీలించారు. అనిల్ మృతితో అతని తండ్రి ఏడుకొండలు అలియాస్ శ్రీను, తల్లి నాగమణి, చెల్లి అనిత కన్నీరు మున్నీరయ్యారు. చేతికి అంది వచ్చిన కొడుకు మృత్యువాత పడ్డాడని, ఇక తమకు దిక్కెవరంటూ అతని కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులను తీవ్రంగా కలచి వేసింది. గెడ్డం అనిల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా చురుగ్గా పని చేస్తున్నాడు. అనిల్ మృతదేహాన్ని పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రైల్వే డీఎస్పీ మోకా సత్తిబాబు పార్టీ సేవాదళ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల కొండలరావు, నాయకులు గెడ్డం కృష్ణమూర్తి, నల్లమిల్లి గోవిందరెడ్డి, నెల్లి దుర్గాప్రసాద్, గెడ్డం వెంకటేశ్వరరావు, యూవీవీ సత్యనారాయణ, బొలిశెట్టి భగవాన్, కొనుకు నాగరాజు తదితరులు పరిశీలించి అతని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment