బీసీ, మైనారిటీ సబ్‌ప్లాన్‌లు: దిగ్విజయ్ | Sub plans for BC, Minority, says Digvijay singh | Sakshi
Sakshi News home page

బీసీ, మైనారిటీ సబ్‌ప్లాన్‌లు: దిగ్విజయ్

Published Sat, Mar 15 2014 3:45 AM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM

Sub plans for BC, Minority, says Digvijay singh

టీ-కాంగ్రెస్ మేనిఫెస్టోపై దిగ్విజయ్ నిర్దేశం
టీ-జేఏసీ, మేధావులను సంప్రదించండి
తెలంగాణ కోసం సలహాలు తీసుకోండి

సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ తెలంగాణకు బాటలు వేసేలా ఎన్నికల హామీల ప్రణాళికను రూపొందించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి నిర్దేశించారు. దళిత, గిరిజన ఉపప్రణాళిక మాదిరిగానే.. బీసీ, మైనారిటీ సబ్‌ప్లాన్ చట్టాన్ని తెస్తామనే అంశాన్ని కూడా ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని సూచించారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ మేనిఫెస్టో కమిటీతో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబు, సహ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క హాజరైన ఈ సమావేశంలో త్వరలో రూపొందించబోయే టీపీసీసీ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు.
 
 తెలంగాణ ఏర్పాటైనందున పునర్నిర్మాణానికి  సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని దిగ్విజయ్ పేర్కొన్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతులు, కూలీలు, పారిశ్రామికవేత్తలకు, నిరుద్యోగులకు, కుటీర పరిశ్రమలకు అనుకూలంగా మేనిఫెస్టోను రూపొందించాలని చెప్పారు.  తెలంగాణ జేఏసీ నాయకులు, మేధావులు, ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు, స్వచ్ఛంద సంస్థలతో సంప్రదించి భవిష్యత్ తెలంగాణ కోసం వారేం కోరుకుంటున్నారో అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించి దానిద్వారా అందరి సలహాలు స్వీకరించాలన్నారు. ఈ నెల 22 నాటికి మేనిఫెస్టో రూపకల్పన ప్రాథమిక కసరత్తును పూర్తి చేయాలని ఆదేశించారు.  
 
 30 మందితో ప్రచార కమిటీ...

 తెలంగాణ, సీమాంధ్ర ప్రచార కమిటీల్లో 30 మందికి చోటు కల్పించాలని దిగ్విజయ్‌సింగ్ సూచించారు. వివిధ అంశాలపై సమర్థ్ధవంతంగా, ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడేవారినే ఎంపిక చేయాలన్నారు. రాష్ట్రంపై పూర్తి అవగాహన కలిగిన జాతీయ నాయకులకు కూడా కమిటీలో చోటు కల్పించాలని చెప్పారు. ప్రచారంలో ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి? ఎక్కడెక్కడ రోడ్‌షోలు నిర్వహించాలనే దానిపైనా కసరత్తు చేయాలని సూచించారు.
 
  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీలైనంత మేరకు కమిటీలో తక్కువగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాలను కూడా విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో పొన్నాల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో పాటు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో చైర్మన్ షబ్బీర్‌అలీలు పాల్గొన్నారు. అనంతరం దిగ్విజయ్‌సింగ్ పీసీసీ ఆఫీస్ బేరర్స్‌తోనూ సమావేశమై పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
 
 మాకు గుర్తింపునివ్వండి...
 తెలంగాణ కోసం పోరాడిన తమకు పార్టీలో తగిన గుర్తింపునివ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్సీలు దిగ్విజయ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఎం.ఎస్.ప్రభాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు బి.కమలాకరరావు, ఇంద్రసేనారెడ్డి తదితరులు శుక్రవారం సాయంత్రం దిగ్విజయ్‌ను కలసిన ఈ మేరకు ఓ వినతి పత్రం అందజేశారు. తెలంగాణ కోసం పోరాడటంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేశామన్నారు. తాము పదవులు కోరుకోవటంలేదని, పార్టీలో గుర్తింపు మాత్రమే కోరుతున్నామని చెప్పారు. సానుకూలంగా స్పందించిన దిగ్విజయ్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి తగిన గుర్తింపు ఇస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement