అంతర్జాతీయ శాస్త్రవేత్తగా కూలీ కుమారుడు | Successful Story About How Became An International Scientist In Warangal | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ శాస్త్రవేత్తగా కూలీ కుమారుడు

Published Wed, Aug 14 2019 10:23 AM | Last Updated on Wed, Aug 14 2019 10:24 AM

Successful Story About How Became An International Scientist In Warangal - Sakshi

వివిధ దేశాల శాస్త్రవేత్తలతో విజయ్‌ (కుడి చివర)

సాక్షి, కొత్తగూడ(వరంగల్‌) :  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడమే నామోషీగా భావించే రోజులివి. అలాంటిది మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవడమే కాదు.. తండ్రి కన్నుమూయడం.. తల్లి కూలీ పనులు చేస్తుండడాన్ని చూస్తూ పెరిగిన ఆ విద్యార్థి నేడు అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగాడు. స్కాలర్‌షిప్‌ ద్వారా వస్తున్న డబ్బును పొదుపుగా వాడుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కొత్తగూడ మండల కేంద్రానికి వెలుసోజు విజయ్‌.. గెలుపు నేపథ్యంపై ప్రత్యేక కథనం. 

చిన్నతనంలోనే తండ్రి మృతి
కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన వెలుసోజు రాములు – సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు అనిల్, విజయ్‌తో పాటు ఓ కుమార్తె సంధ్యారాణి ఉన్నారు. వీరి చిన్నతనంలోనే తండ్రి రాములు మద్యానికి బానిపై మృత్యువాత పడ్డారు. రాములు ఉన్నంత వరకు కుల వృత్తి అయిన వడ్రంగి పని చేసేవాడు. ఆయన మృతి చెందాక ఇతర ఉపాధి మార్గాలేమీ లేక కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితి ఎదుర్కొంది. ఇక ముగ్గురు పిల్లలను పోషించాల్సిన తల్లి సుజాతకు వ్యవసాయ పనులు రాకపోగా సెంట్‌ భూమి కూడా లేదు.

దీంతో పిల్లలకు చదువు చెప్పించడం ఏమో కానీ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కూడా భారమైంది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో కూరగాయలు కోసేందుకు సాధారణ రోజువారీ కూలీ(కాంటింజెంట్‌ వర్కర్‌)గా చేరింది. డబ్బు ఎంతొచ్చినా పర్వాలేదు.. అక్కడి నుంచే అన్నం తీసుకెళ్లి పిల్లల కడుపు నింపేది. పిల్లల భవిష్యత్‌ కోసం తల్లి పడే తపన, రాత్రుళ్లు కార్చే కన్నీరు చిన్న కుమారుడు విజయ్‌లో పట్టుదలను పెంచాయి. ఎలాగైనా ఉన్నత స్థాయికి చేరాలని అప్పట్లో భావించాడు.

ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్‌గా...
ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదువుకునే స్థోమత లేదని గుర్తించి విజయ్‌.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూనే కార్పొరేట్‌ వ్యవస్థతో పోటీ పడాలనుకున్నాడు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కొత్తగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో పాఠశాల టాపర్‌గా నిలిచాడు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకుని మండల టాపర్‌గా నిలిచాడు. ఇంటర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కొత్తగూడలో కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఇక హైదరాబాద్‌లోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, ఐఐటీ మద్రాస్‌లో మాస్టర్స్‌ కెమిస్ట్రీ పూర్తి చేసి అక్కడా టాపర్‌గా నిలిచి తాను అనుకున్నది సాధించాడు. ఇవన్ని మొత్తం స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి పూర్తిచేయడం విశేషం. ఈ మేరకు విజయ్‌లోని ప్రతిభను గుర్తించిన ఆస్ట్రేలియాలోని రాయల్‌ మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ వారు పీహెచ్‌డీలో సీటు ఇచ్చి డాక్టరేట్‌ ప్రదానం చేశారు. 

మొక్కల నుంచి పెట్రోల్, డీజిల్‌ తయారీ

ఆస్ట్రేలియాలో పీహెచ్‌డీ పట్టా అందుకున్న సందర్భంలో.. 

పీహెచ్‌డీ పూర్తయ్యాక విజయ్‌ హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో రెండేళ్ల పాటు రీసెర్చ్‌ చేశారు. ఈ సమయంలో అంతర్జాతీయ సదస్సుల్లో డెమో ఇచ్చి మెప్పించారు. విజయ్‌ ప్రతిభను గుర్తించిన జర్మనీలోని లుయాబిన్జ్‌ – డాడ్‌ రీసెర్చ్‌ ఫెలో ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్యాటనిసిస్‌ రోస్టక్‌ వారు జూనియర్‌ సైంటిస్ట్‌గా చేర్చుకున్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో కార్బన్‌డైఆక్సెడ్‌ నుంచి ఇంధనం తయారీపై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో విజయ్‌ పాల్గొంటున్నారు. ఇక ఇటీవల మలేషియాలో జరిగిన 8వ ఆసియా పసిఫిక్‌ కాంగ్రెస్‌ ఆన్‌ డ్యాటనసిస్‌(ఎపీసీఏటీ–8) లో తన గళం వినిపించారు. దీంతో పాటు మరో 20 అంతర్జాతీయ సదస్సుల్లో తాను చేస్తున్న రీసెర్చ్‌ వివరాలు వినిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement