అన్నదాతకు చేయూతనందిస్తాం | supportive to the farmer said harishrao | Sakshi
Sakshi News home page

అన్నదాతకు చేయూతనందిస్తాం

Published Mon, May 11 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM

supportive to the farmer said harishrao

- 15 నుంచి రైతు చైతన్య యాత్రలు
- జిల్లాలో రూ. 80 కోట్లతో గోదాముల నిర్మాణం
- మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్:
రైతాంగానికి చేయూతనందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోదని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గణేష్ నగర్‌లో రూ.35 లక్షలతో నిర్మించనున్న వ్యవసాయ శాఖ సహాయ సంచాలక కార్యాలయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణం విస్తరిస్తున్న క్రమంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖకు సొంత భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పశుసంవర్థక శాఖ, వ్యవసాయ శాఖ ఒకే ప్రాంగణంలో ఉండడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుందన్నారు.

ఈ నెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా రైతు చైతన్య యాత్రలను నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి గ్రామంలో విస్తృతంగా చైతన్య యాత్రలను నిర్వహించి రైతులకు ప్రభుత్వం అందించే పథకాలను, సబ్సిడీలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీ అందజేస్తామన్నారు. జిల్లాలో లక్షా 20వేల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ నిల్వను అందుబాటులో పెడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గానికి సంబంధించి 35వేల మెట్రిక్ టన్నుల యూరియాను నిల్వ రూపంలో బఫర్ స్టాక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లాలో గోదాముల కొరతను అధిగమించేందుకు రూ. 80 లక్షలతో అవసరమైన చోట గోదామును నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ హుక్యానాయక్, ఏడీ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ ఎన్‌వైగిరి పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణానికి చేయూత
రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో అర్హులైన వారందరికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ తరహాలో స్వచ్ఛ సిద్దిపేట ద్వారా పట్టణంలోని ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులను కేటాయించామని, దీనిని విజయవంతం చేసి రాష్ట్రానికే సిద్దిపేట ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్రంలోనే తొలి ప్రక్రియగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లబ్ధిదారుల కోసం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను అందజేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేటలో ప్రారంభిస్తున్న పథకం తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రక్రియగా చేపట్టడం జరుగుతుందన్నారు.

రహదారులపై నిఘా పటిష్టం
పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.ఆదివారం సిద్దిపేటలో పోలీస్  కమాండ్ కాంట్రోల్ భవనానికి ఆయన శంకుస్థాన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు జాతీయ రహదారులపై నిఘాను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిద్దిపేటలో పోలీస్ కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణం కోసం రూ.2.20 కోట్లు మంజూరయ్యాయని, దీంతో జిల్లా కేంద్రం ఏర్పాటుకు నాంది పడనుందన్నారు. అదే విధంగా రూ.40 లక్షలతో సిద్దిపేటలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ సుమతి, ఏఎస్‌పీ రవీందర్‌రెడ్డి,డీఎస్‌పీ శ్రీధర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement