
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని ఉదయసముద్రం ప్రాజెక్టు నిర్మాణపనులు తుదిదశకు చేరుకున్నాయని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఏప్రిల్ 5న ఒకటి, అదే నెల 25న మరొక పంపు డ్రై రన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మిగతా పనులన్నీ జెట్ స్పీడ్‌తో చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులను శనివారం శాసనమండలిలోని మినిస్టర్స్ చాంబర్స్‌లో సమీక్షించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నదన్నారు. ప్రాజెక్టు నుంచి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్‌లోకి నీరు చేరేవిధంగా మే నెల చివరికల్లా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్ పనులు పూర్తయ్యాయని, 3.665 కిలోమీటర్ల పొడవున్న కాలువకట్ట పనుల్లో మిగిలినవాటిని రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 6.9 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు. 10.625 కిలో మీటర్ల టన్నెల్ పనుల్లో 2.22 మీట ర్లు మినహా మిగతావన్నీ పూర్తయ్యాయని తెలిపారు. మే చివరికల్లా మొత్తం టన్నెల్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. టన్నెల్ పనులు పూర్తయితేనే రిజర్వాయర్‌లో నీరు నింపేందుకు వీలవుతుందన్నారు.
ఆ లోగా పంప్‌హౌస్ పనులు మరింత వేగవంతం చేయాలని కోరారు. ఖరీఫ్‌లోగా రిజర్వాయర్ నుంచి 40 చెరువులను నింపేవిధంగా పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద మొదటి డిస్ట్రిబ్యూటరీ ద్వారా 40 చెరువులను నింపడానికి గాను ఫీడర్ చానళ్ల పనులను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి ఆదేశించారు. సమీక్షలో ఇరిగేషన్ సీఈ ఎస్.సునీల్, ఎస్‌ఈ హమీద్ ఖాన్, ఈఈ గంగం శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment