
బెజవాడలో బతుకమ్మ
బతుకమ్మ... ఓ ఇంద్రధనస్సు
‘ప్రపంచంలో మరెక్కడా కనిపించని పండుగ బతుకమ్మ.. ప్రకృతితో మమేకమై జరుపుకునే అతి పెద్ద సంబురం.. ఇంద్రధనస్సును తలపించేలా బతుకమ్మలోని పూల వర్ణాలు ఉండడం అద్భుతం’ అంటారు ఠాగూర్, గుర్రం జాషువా అవార్డు గ్రహీత కోవెల సుప్రసన్నాచార్య. కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన కవిగా, రచయితగా ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. ఈ మేరకు బతుకమ్మ పండుగ ప్రత్యేకత, తన చిన్ననాటి సంగతులను ‘సాక్షి’కి వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
కాకతీయులు చాలా గొప్ప రాజులు. పంచాయన దేవతలైన ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, మహేశ్వరులను ఆరాధించారు. ఒక్క వేయి స్తంభాల ఆలయంలోనే శివుడు, కేశవుడు, ఆదిత్యుడు ఉండడం కనిపిస్తుంది. బతుకమ్మ పండుగ కాకతీయుల కాలంలోనూ, అంతకుముందు కూడా ఉండి ఉండవచ్చు కానీ అందుకు ఆధారాలు లేవు. గణపతి నవరాత్రుల తర్వాత బొడ్డెమ్మ పండుగ, ఆ తర్వాత బతుకమ్మ పండగ జరుపుకోవడం యాదృచ్ఛికం కాదు. శ్రీ చక్ర ంలో నాలుగు దళాల మధ్య గణపతి మూలధారా చక్రంలో బీజాక్షరం దగ్గర ఉంటాడు. కుటుంబంంలో పెళ్లిళ్లు, ఇతర ఏ శుభకార్యాలు జరిగినా కూడా గారెలు చేస్తారు. అవి పితృలకు శ్రాద్ధకర్మల కోసం ప్రతి పనికి పితృదేవతలకు పూజించాలి. ఆ విధంగా పెత్రమాసతోనే బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది.
మూలపుటమ్మ..
ప్రకృతిని తల్లిగా చూస్తాం కాబట్టి భూ మాత అంటాం. కనకదుర్గ అంటాం. ఇవి దేవతా అర్చనలో కొన్ని భాగాలు. ఇన్ని పూలను కలుపుకుని అర్థించడం అనేది ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. దానికి బతుకమ్మ అని పేరు పెట్టారు. శ్రీ లక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా అంటూ లక్ష్మి, గౌరి, పార్వతి, సరస్వతి అందరి పేర్లు వస్తాయి. బతుకమ్మను ముగ్గురమ్మల మూలపుటమ్మ అంశంగా చూశారు. తొమ్మిది రోజుల పాటు అమంత్రకంగా (మంత్రాలు లేకుండా) ఉపాసన చేస్తారు. పాటలు పాడుతారు. నృత్యాలు చేస్తారు. చతుఃషష్టి ఉపచార పూజలలో కూడా సంగీతం, నృత్యం దర్శయామీ అంటారు కదా.
సూర్య చంద్రులు కలిసే ఉంటారు
సద్దుల బతుకమ్మ రోజు ఆకాశంలో సూర్యుడు చంద్రుడు కలిసే ఉంటారు. దుర్గ అమ్మవారికి చంద్ర విద్య, చంద్ర సహోదరి అని పేరు. సూర్య మండలంలో మద్రస్తురాలిగా ఉండే దేవత అని పిలుస్తారు. చల్లని తల్లిగానూ ఉగ్రకాళీగా ఉంటుంది. దుర్‌అంటే దుర్లభమైనది, వెళ్లలేనిది అని అర్థం. గ అంటే వెళ్లాల్సినది అని అర్థం. రెండు అంశలు కలిసి దుర్గ అయింది.
సామాన్యులు జరుపుకునేది..
వైదిక సంప్రదాయం హోమాలతో సంబంధం లేకుండా సామాన్యులు జరుపుకునేది బతుకమ్మ పండగ. మహిళను దేవతగా భావించి సమాజంలో భాగంగా చేశారు. ఇదే విధంగా సువాసినీ పూజ సంప్రదాయం కనిపిస్తుంది. మహిళలు తమ పుట్టింటి, మెట్టినింటి వారందరూ బాగుం డాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు. రెండు భిన్నమైన కుటుంబాల మధ్య కలిసిపోవడం కనిపిస్తుంది.
ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ
దశ మహావిద్యల్లో భగళామాత శత్రువును మాట్లాడకుండా అడ్డుకుంటుంది. అందుకే దీక్షలో ఉన్నవారు భగళాదేవికి ఇష్టమైన పసుపు బట్టలే కడుతారు. అందుకే పసుపు వర్ణంతో కూడిన తంగేడు పూలకు ప్రాధాన్యం ఉంటుంది. జీవితానికి పరిపూర్ణతను ఇస్తుంది. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జామాయే చందమామ అంటూ పాడుతారు. ఈ విధంగా ఏకోత్తర వృద్ధిలో ఒక్కొక్కటి పెంచుకుంటూ పోవడం ఆత్మసమర్పణకు ప్రతీక. ఇన్ని రంగుల పూలతో బతుకమ్మ ఇంద్రధనస్సులా అవుతుంది.
భేదాలు ఉండవు..
బతుకమ్మ పండుగ సమయంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే భేదాలు మరిచిపోతారు. సద్దుల వద్ద ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటారు. ప్రసాదాలు పంచుకుంటారు. పండుగ సమయంలో కొత్తగా పెళ్లయిన వారికి శిక్షణ ఇవ్వడం కనిపిస్తుంది.
బెజవాడలో బతుకమ్మ ఆడిన గుర్తు
1948లో జిల్లాలో దుర్లభమైన పరిస్థితి. రజాకారుల అకృత్యాలు పెరిగిపోయాయి. వందలాది కుటుంబాలు వలస వెళ్లాయి. మా కుటుంబాలు కూడా విజయవాడ, రాజమండ్రి, ఏలూరు తదితర చోట్లకు వలస వెళ్లిపోయాయి. మళ్లీ వస్తమో రామో కూడా తెలియదు. అప్పుడు బతుకమ్మ పండుగను విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో కృష్ణా నది ఒడ్డున జరుపుకున్నాం. గునుగుపువ్వు, తంగేడు పువ్వు ఎలా తెచ్చుకున్నారో తెలియదు కానీ వందలాది మంది తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగ జరుపుకుని కృష్ణానదిలో బతుకమ్మలను వదలడం ఇప్పటికి నా కళ్ల ముందు కదలాడుతోంది.
అప్పడు నా వయస్సు 12 ఏళ్లు. విజయవాడ ప్రజలు ఆశ్చర్యపోయి చూశారు. పోలీస్ చర్య తర్వాత మళ్లీ ఇక్కడకు తిరిగి వచ్చాం. వరంగల్‌లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతం వారు మాత్రం ఎన్నడూ బతుకమ్మ పండుగలో పాల్గొనడం చూడలేదు. వరంగల్‌లో ఎడ్లబండ్ల మీద భారీ బతుకమ్మలను పెట్టుకుని వెళ్లేవారు. మొదటి నుంచి ఇప్పటిలాగే వైభవంగా జరుగుతోంది.