ఆ ఇద్దరిదీ నియంతృత్వ పాలనే
మోదీ, కేసీఆర్ పాలనలపై ‘సురవరం’ ధ్వజం
డిండి (దేవరకొండ): దేశంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు నియంతృత్వ పాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా డిండి మండలం కందుకూర్‌లో ఆదివారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బొడ్డుపల్లి రామశర్మ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని మండిపడ్డారు. దేశంలో ప్రతి రోజు 35 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజా సమస్యలను విస్మరించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని సురవరం ఆరోపించారు.
సీపీఐ నుంచి ఇతర పార్టీలలోకి వలస వెళ్లిన ప్రజాప్రతినిధులకు రానున్న రోజుల్లో భవిష్యత్ ఉండదని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు,తాగు నీరు అందించే డిండి ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కలసి వచ్చే శక్తులను కలుపుకొని రానున్న రోజుల్లో పోరు బాట పట్టనున్నట్టు సురవరం చెప్పారు.