ఆరోగ్యశ్రీ.. ప్రైవేటుకు సిరి
ఐదేళ్లలో 9,03,961 శస్త్ర చికిత్సలు
రూ.2,604.15 కోట్ల ఖర్చు
{పభుత్వ ఆస్పత్రుల వెనుకబాటు
నిజామాబాద్: పేదల ఆరోగ్య సంజీవని ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రులకు కాసులవర్షం కురిపిస్తోంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని కార్పొరేట్ వసతులతో అందించాలన్న దృఢసంకల్పంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆయ న అకాల మరణం తర్వాత అభాసుపాలవుతోంది. పేద రోగులకు అండగా నిలిచి ప్రాణాలను కాపాడిన అపరసంజీవని ఆరోగ్యశ్రీ ఐదేళ్లుగా ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రులకు వరంగా, పేద రోగులకు శాపంగా మారింది. ప్రభుత్వ శాఖలు నిద్రావస్థలో ఉండటంతో ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా పేదల వాటాను దోపిడీ చేస్తున్నాయి. ఇంకోపక్క రిఫరల్ ఆస్పత్రుల్లోని ఆరోగ్యశ్రీ వార్డుల్లో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిరంతరం పర్యవేక్షించాల్సిన విజిలెన్స్ శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో పేద రోగుల శస్త్ర చికిత్సలు విఫలం కావడం, నిధులన్నీ ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రులకు ధారాదత్తం అవుతున్నాయి.
‘ప్రైవేట్’కే కాసుల వర్షం..
ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో 183 ప్రైవేట్ ఆస్పత్రులు రిఫరల్ ఆస్పత్రులుగా కొనసాగుతున్నాయి. 2011-12 నుంచి 2015-16 వర కు రాష్ట్రంలో మొత్తం 9,03,961 శస్త్త్రచ్రికిత్సలు జరుగగా మొత్తం రూ. 2,604.15 కోట్లు ఖర్చుచేశారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులతో పోలి స్తే ప్రైవేట్ ఆస్పత్రులకే కాసుల వర్షం కురిసిం ది. గడిచిన ఐదేళ్లలో ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రుల్లో 5,89,135 శస్త్ర చికిత్సలు జరగగా రూ. 1,841.91 కోట్లు వెచ్చించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3,14,826 శాస్త్ర చికిత్సలు జరగగా రూ.762.24 కోట్లు చెల్లించారు. జిల్లా పరంగా చూస్తే అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రుల్లో 1,05,528 శస్త్ర చికిత్సలు జరగగా రూ. 263.31 కోట్లు ఈ ఐదేళ్లలో ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించారు. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 35,000 శస్త్ర చికిత్సలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరగగా రూ. 92.24 కోట్లు చెల్లించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన శస్త్ర చికిత్సల పరంగా చూస్తే హైదరాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ గడిచిన ఐదేళ్లలో 58,727 శస్త్ర చికిత్సలు జరగగా రూ. 132.61 కోట్లు చెల్లించారు.
నిబంధనలు బేఖాతరు..
రాష్ట్రంలో మొత్తం 183 ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పథకం కింద పనిచేస్తున్నా యి. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 56 రిఫరల్ ఆస్పత్రులు ఉండగా.. ఆదిలాబాద్‌లో ఒక్క ఆస్పత్రి మాత్రమే ఉంది. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ఇందులో చాలా ఆస్పత్రులు డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)లు రూపొందించిన మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ పేద ప్రజలకు నామమాత్రపు సేవ ల్ని అందిస్తూ, ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోగ్య శ్రీ నిధులను ఠంచనుగా రాబడుతున్నాయి. నిబంధనల ప్రకారం ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రుల్లో 50 పడకలు తక్కువ కాకుండా ఉండాలి. కానీ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా కేంద్రాలలో గల 65 రిఫరల్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో సింహభాగం ఆస్పత్రుల్లో కనీసం 25 పడకలు కూడా లేవు. అలాగే తొమ్మిది జిల్లాల్లోని రిఫరల్ ఆస్పత్రుల పరిధిలో కొన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు, ల్యాబ్ సేవలు అందుబాటులో లేవు. కొన్ని రిఫరల్ ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్, నెఫ్రా లజీ, డెర్మటాలజీ, న్యూరాలజీ, పాలిట్రామా, గ్యాస్టోఎంట్రారాలజీ వంటి నిపుణులు అందుబాటులో ఉండటం లేదు. ప్రతి మూడు నెలలకోకసారి ప్రభుత్వానికి సమర్పించాల్సిన ఆడిట్ రిపోర్టు కొన్ని జిల్లాల్లో సరిగా అందడం లేదు. జిల్లా వైద్యాధికారులు ప్రతినెలా ఆయా ఆస్పత్రులను విధిగా తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వాటిని రిఫరల్ జాబితా నుంచి తొలగించాలి. కానీ, ఐదేళ్లుగా ఏడు జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. అలాగే ఆయా ఆస్పత్రుల్లో పడకలను బట్టి పేదలకు అందించాల్సిన వైద్యసేవలపై స్పష్టమైన రిజిస్టర్లు నిర్వహించడం లేదు.
మొక్కుబడిగా ఆరోగ్య శిబిరాలు..
ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రులు నెలకు రెండు ఆరోగ్యశ్రీ శిబిరాలు నిర్వహించాలి. 2015-16లో రాష్ట్రంలోని ఏ ప్రైవేటు ఆస్పత్రి కూడా ఆరోగ్య శిబిరాల విషయంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. హైదరాబాద్ జిల్లాలో 56 రిఫరల్ ఆస్పత్రులున్నా ఇప్పటి వరకు కేవలం 34 ఆరోగ్య శిబిరాలు మాత్రమే నిర్వహించింది. నిజామాబాద్ జిల్లాలో 9 రిఫరల్ ఆస్పత్రులు 32 శిబిరాలు, కరీంనగర్‌లో 17 రిఫరల్ ఆస్పత్రులు 34 శిబిరాలు, వరంగల్ జిల్లాలో 26 రిఫరల్ ఆస్పత్రులు కేవలం 55 ఆరోగ్యశిబిరాలు నిర్వహించడం గమనార్హం. ఆదిలాబాద్‌లో కేవలం ఒక రిఫరల్ ఆస్పత్రి ఉన్నా ఇప్పటి వరకు 70 ఆరోగ్య శిబిరాలు నిర్వహించింది.
పట్టించుకున్నవారు లేరు
కడుపులో రాళ్ల తొలగింపు ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాను. వారం రోజుల నుంచి నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. డాక్టర్లు వస్తారు..చూస్తారంటూ చెబుతున్నారే తప్ప.. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో చెప్పడం లేదు.
-భూదేవి, జాడీ గ్రామం, బోధన్ మండలం, నిజామాబాద్ జిల్లా