సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో వరుసగా జరుగుతున్న ఇన్‌స్పెక్టర్ల సస్పెన్షన్ ఘటనలు డిపార్టుమెంట్‌లో దిగువ శ్రేణి అధికారులను కలవరానికి గురిచేస్తున్నాయి. శాంతి భద్రతల విభాగంలో పోస్టింగ్ అంటే భారీ స్థాయిలో లాబీయింగ్ చేస్తే గానీ దక్కని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పోస్టు అంటేనే హడలిపోతున్నారు. హైదరాబాద్ జోన్‌లో తాజాగా ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్ల సస్పెన్షన్‌తో ఒక్కసారిగా అధికారులు యూటర్న్ తీసుకుంటున్నారు. వామ్మో.. మాకొద్దు ఈ పోస్టింగ్ అంటూ లూప్‌లైన్ కోసం ఐజీల వద్ద దరఖాస్తు చేసుకుంటున్నారు.
సిటీలో అయితే ఓకే..
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో పెద్దగా పైరవీలు అవసరం లేకుండా పనితీరుతో పోస్టింగ్ పొందవచ్చు. కానీ జిల్లాల్లో అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సు ఉంటేనే పోస్టింగ్స్ ఇస్తారు. దీంతో నాలుగేళ్లుగా చాలా మంది ఇన్‌స్పెక్టర్లు పక్క పక్క ఉన్న సర్కిళ్లలోనే పనిచేస్తూ వచ్చారు. కానీ ఆరు నెలల నుంచి హైదరాబాద్, వరంగల్ జోన్ల పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్లపై ఇంటెలిజెన్స్ బృందాలు నివేదికలు ఇస్తుండటంతో వారిలో వణుకు మొదలైంది.
ఇటీవల హుజూర్‌నగర్, తాండూర్ సీఐలను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎక్కడెక్కడ ఎంత వసూలు చేశారన్న దానిపై ఆధారాలతో చార్జ్‌మెమోలో ప్రస్తావిస్తున్నారు. దీంతో మరికొంత మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల జాతకాలు బయటపడే ప్రమాదం ఉండటంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. దీని లో భాగంగా తాము జిల్లాల్లో దీర్ఘకాలంగా పని చేస్తున్నామని, తమను డెప్యుటేషన్ విభాగాల్లోకి గానీ, హైదరాబాద్ జోన్‌లో సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేయాలని దరఖాస్తులు పెట్టు కుంటున్నారు.
దీంతో లక్షలు ఖర్చు చేసి తెచ్చుకున్న పోస్టింగ్స్ వదులుకునేందుకు 40 మంది సిద్ధంగా ఉన్నారని తెలిసింది. నార్త్‌జోన్ నుంచి 16 మంది ఇన్‌స్పెక్టర్లు తమను లూప్‌లైన్ అయినా ఇంటెలిజెన్స్, సీఐడీ, ట్రాఫిక్, సీసీఎస్ లేదా విజిలెన్స్‌లకు పంపా లని వేడుకుంటున్నారు. హైదరాబాద్ జోన్‌లోని 24 మంది ఇన్‌స్పెక్టర్లు ఏకంగా తమకు ఏదైనా కమిషనరేట్‌లో సీసీఎస్‌లకు పంపాలని కోరుతున్నారు.
గందరగోళ పరిస్థితిలో..
ఎమ్మెల్యే సిఫార్సు ద్వారా పోస్టింగ్ తెచ్చుకున్న అధికారి.. ఆయన మనుషులకు సహకరించకపోతే బదిలీ చేయిస్తాడన్న భయం, ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే ఎస్పీ /కమిషనర్ ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న ఆందోళనతో ఇద్దరి మధ్య విధులు ఎలా నిర్వర్తిం చాలో తెలియక కొంత మంది ఇన్‌స్పెక్టర్లు గందరగోళంలో పడుతున్నారు. ఇటీవల జరిగిన ఘటనల్లో ఇలాంటి వ్యవహారాలు బయటపడ్డాయి.
అయితే ఇక్కడ అధికారులు కూడా అక్రమార్కులతో చేతులు కలపడంతో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావా ల్సి వచ్చింది. మరికొంత మంది ఎమ్మెల్యేలకు సూటిగా విషయం చెప్పి ఎస్పీ/కమిషనర్ ద్వారా చెప్పించాలని సున్నితంగా తిరస్కరిస్తుండటంతో సమస్య ఏర్పడుతోంది. దీంతో మరో ఇన్‌స్పెక్టర్ కోసం సంబంధిత ఎమ్మెల్యే ప్రయత్నాలు చేయడంతో అక్కడ ఉన్న ఇన్‌స్పెక్టర్ ఏం చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment