మధిర : శ్రీ పవన్‌సాయి కోల్డ్‌స్టోరేజీ రుణాల కుంభకోణంలో బాధితర రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2013లో శ్రీ పవన్‌సాయి కోల్డ్‌స్టోరేజిలో మిర్చి బస్తాలను నిల్వ చేయనప్పటికీ, విజయవాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్‌బ్రాంచిలో రుణాలు తీసుకోకపోయినప్పటికీ బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు ఇవ్వటం, పత్రికాప్రకటనలలో జప్తు చేస్తామని ప్రకటించటంతో వారు ఆందోళన చెందుతున్నారు.
కోల్డ్ స్టోరేజిలో నిల్వ ఉంచిన మిర్చి బస్తాలపై రుణాలు ఇవ్వాలంటే ఎన్ని బస్తాలను, ఏ ఛాంబర్‌లో రైతులు నిల్వ చేశారో స్వయంగా బ్యాంకు అధికారులు తనిఖీ చేయాలి. అందుకు సంబంధించిన ధ్రువీకరణపత్రాలను తయారుచేసి రుణం తీసుకునే రైతు ఫొటోలతో పాటు అతనికి సంబంధించిన రేషన్‌కార్డు, పాస్‌పుస్తకాల జిరాక్స్‌లు తదితర పత్రాలపై రైతుల సంతకాలు తీసుకోవాలి. అనంతరం బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయాలి. అయితే కోల్డ్‌స్టోరేజిలో మిర్చి బస్తాలు నిల్వ చేయకపోయినప్పటికీ, సంబంధిత పత్రాలు అందకచేయపోయినప్పటికీ, రైతులు సంతకాలు చేయనప్పటికీ రుణాలు ఇవ్వటంలో బ్యాంక్ అధికారుల పాత్ర ఉందని చెబుతున్నారు.
2011లో శ్రీ పవన్‌సాయి కోల్డ్‌స్టోరేజిలో మిర్చి నిల్వ చేసి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించినప్పటికీ అప్పట్లో ఇచ్చిన ధృవీకరణపత్రాలను కోల్డ్‌స్టోరేజీ యాజమాన్యం తమకు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. ఖమ్మం, కృష్ణా జిల్లాల పరిధిలోని 63మంది రైతులకు ఒకే రోజు(2013, మార్చి 28న) బ్యాంకు ఖాతాలు ప్రారంభించి బినామీపేర్లతో సుమారు రూ.6కోట్లకు పైగా రుణాలు ఏ విధంగా ఇచ్చారని బాధితరైతులు బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఒక రైతుకు రుణం మంజూరు చేయాలంటే నో డ్యూస్, ఆస్తుల తాకట్టు తదితర ధృవీకరణ పత్రాలు అడగటంతోపాటు రోజుల తరుబడి బ్యాంకు చుట్టూ తిప్పుకోవటం చేసే అధికారులు ఈ విషయంలో రుణాలు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంలో వాస్తవ విషయాలు నిగ్గుతేలాలంటే బ్యాంకు ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫోర్జరీ సంతకాల్లో సూత్రధారులెవరు ?
Published Mon, Jul 21 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM
Advertisement