'స్వచ్ఛ' పుష్కరం
భద్రాచలం :
పుష్కరాల్లో పారిశుధ్య కార్మికులు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. భద్రాచలంతోపాటు ఆలయ పరిసరాలు, ఘాట్‌ల వద్ద పరిశుభ్రంగా ఉండేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో పాల్గొనడానికి భక్తులు లక్షలాదిగా భద్రాచలానికి వస్తున్నారు. భక్తులు కవర్లు, ఇతర వస్తువులతోపాటు పెద్ద ఎత్తున మంచినీటి ప్యాకెట్లను పడేస్తున్నారు. అవి అలాగే ఉండిపోతే గుట్టలుగా పేరుకుపోయి రోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది. అయితే వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ పారిశుధ్యం చెడకుండా కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. వ్యర్థాలను ఊడ్చివేయడం, వాటిని డ్రమ్ముల్లోకి ఎత్తడం, అనంతరం వాటిని ట్రాక్టర్లలోకి ఎత్తి దూరంగా తరలించడం చేస్తున్నారు. ఇక బురదమయంగా మారుతున్న ప్రాంతాల్లో నీటిని తొలగించడంతోపాటు బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు.
19 జోన్లుగా..
భద్రాద్రిలో భక్తుల రద్దీని ఊహించిన అధికారులు ముందుగానే పారిశుధ్య కార్మికులను నియమించారు. నెల్లూరు, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన 410 మంది కార్మికులను ఇక్కడకు రప్పించారు. వారికి రోజూ రూ. 300 వేతనంతోపాటు టిఫిన్, భోజన వసతులు కల్పించారు. 410 మంది కార్మికులను 19 జోన్లుగా విభజించి పారిశుధ్య పనులు అప్పగించారు. జిల్లా పరిషత్ సిబ్బంది జోన్‌లను పర్యవేక్షిస్తున్నారు. 20 ట్రాక్టర్ల ద్వారా కార్మికులు సేకరించిన చెత్తను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కార్మికుల పిల్లల కోసం..
పారిశుధ్య కార్మికుల పిల్లల సంరక్షణకు సైతం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు ప్రాంగణంలో శిబిరం ఏర్పాటుచేసి, పిల్లలకు అంగన్‌వాడీ కార్యకర్తలతో ఆటపాటలతో కూడిన విద్య అందిస్తున్నారు. వారికి అవసరమైన స్నాక్స్, ఆట వస్తువులు, ఇతర సౌకర్యాలను కల్పించారు.
కలెక్టర్ ఆదేశాలతో..
భద్రాద్రిలో పారిశుధ్య సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మికుల పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య అందిస్తున్నాం.
- ఆశాలత, డీఎల్‌పీవో