ఆ శాఖ ప్రక్షాళనకు యంత్రాంగం నిర్ణయం
మూడేళ్లుగా ఒకేచోట
పనిచేస్తున్నవారికి స్థానచలనం
ఆరోపణలు మూటగట్టుకున్నవారిపై బదిలీ వేటు
జాబితాపై అధికారుల కసరత్తు
రెవెన్యూశాఖ ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సర్కారీ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని ఇంటిదొంగలపై చర్యలతోపాటు స్థానచలనం కలిగించే దిశగా మల్లగుల్లాలు పడుతోంది. ఒకే చోట మూడు, నాలుగేళ్లుగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌ఓ), రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), మండల సర్వేయర్లను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఆక్రమణదారులతో కుమ్మక్కు కావడంతో విలువైన ప్రభుత్వ భూములు పరాధీనమవుతున్నాయని గుర్తించిన జిల్లా యంత్రాంగం... శివారు మండలాల్లో తిష్టవేసిన రెవెన్యూ ఉద్యోగులను సమూలంగా మార్చేయాలనే నిర్ణయానికి వచ్చింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : చెరువు శిఖం భూములు సహా సర్కారీ స్థలాల పరిరక్షణను పట్టించుకోకుండా.. కబ్జాదారులతో కలిసి రికార్డులు తారుమారు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారులకు ఫిర్యాదులు అందాయి. ప్రజాదర్బార్‌లోనే కాకుండా.. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వీఆర్‌ఓ, మండల సర్వేయర్ల అక్రమాల పర్వం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నట్లు గుర్తించిన 10 మంది వీఆర్‌ఓలను సస్పెండ్ చేయడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సస్పెండయిన పది మంది వీఆర్‌ఓలు శివారు మండలాల్లో పనిచేస్తున్నవారే కావడం విశేషం. ల్యాండ్ మాఫియాతో చేతులు కలిపిన మరికొంతమంది ఆర్‌ఐ, మండల సర్వేయర్ల చిట్టా కూడా జిల్లా యంత్రాంగానికి అందింది. వీరిపై కూడా అంతర్గత విచారణ ప్రారంభించిన అధికారులు చర్యలకు ఫైలును సిద్ధం చే స్తున్నారు. శామీర్‌పేట, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, సరూర్‌నగర్ తదితర మండలాల్లో వీఆర్‌ఓలు చక్రం తిప్పుతుండడం... రెవెన్యూ పాలనావ్యవస్థ వారి కనుసన్నల్లో కొన సాగుతుందనే ఆరోపణలు వచ్చాయి. భూముల క్రమబద్ధీకరణలోనూ వీరి చేతివాటం ఉంద ని తెలియడంతో మండలస్థాయిలో ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం నడుంబిగించింది.
వచ్చే నెలలో బదిలీలు!
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల జాబితా సిద్ధమవుతోంది. శివారు మండలాల్లో పనిచేస్తున్న 220 మంది వీఆర్‌ఓలను గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేయాలని, అక్కడి వారిని ఇక్కడకు మార్చాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉన్నందున.. వచ్చే నెలలో ఆంక్షలు సడలించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో అప్పటిలోగా జాబితాకు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో సస్పెండయిన వీఆర్‌ఓల్లో పలువురిని ఇప్పటివరకు తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. మరోవైపు అకారణంగా తమను అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని వీఆర్‌ఓల సంఘం ఆరోపిస్తోంది. చిన్న తప్పులకు తమను బలిపశువును చేయడం ఎంతవరకు సబబని వాపోతోంది. ఉద్యోగులకు బాసటగా నిలవాల్సిన టీఎన్జీఓ సంఘం కూడా తమకు అండగా నిలవ కపోవడంపై ఆ సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే స్తూ పత్రికాప్రకటన విడుదల చేయడం గమనార్హం.
‘స్వచ్ఛ’ రెవెన్యూ!
Published Wed, May 6 2015 11:25 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement