సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఆర్‌ఐ భర్తల వేధింపుల కేసులను వేగంగా విచారించి నిందితులకు తగిన శిక్ష పడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విమెన్‌సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఐ వివాహాల్లో సమస్యలు, మోసాల పరిష్కారానికి వివిధ శాఖల మధ్య సహకారం, సమన్వయానికి మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో గురువారం కన్వర్జెన్స్ వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. నగరంలోని ఎన్‌ఆర్‌ఐ సెల్‌తో పాటు రాష్ట్రంలోని పలు మహిళా పోలీస్ స్టేషన్లలో 586 ఎన్‌ఆర్‌ఐ వైవాహిక సంబంధిత ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. 2019 జూలై 17న హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ సెల్‌లోనే 73 ఫిర్యాదులు అందగా వీటిలో 70పై కేసులు నమోదు చేశామని, వీటిలో 41 విచారణలోనూ ఉండగా, 46 లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు.
మరో 32 కేసులు నాన్ బెయిలబుల్‌గా నమోదయ్యాయని చెప్పారు. ఈ కేసులను సమర్థంగా విచారించేందుకు దర్యాప్తు అధికారులకు వెసులుబాటు ఉండేలా ఎస్.ఓ.పీలను రూపొందించామని వివరించారు. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ విదేశీ మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమిషన్, విదేశీ ఎంబసీలతో సమన్వయం చేసేందుకు తగు చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం నమోదైన మొత్తం 586 ఎన్.ఆర్.ఐ కేసులలో అత్యధికంగా 248 కేసులు హైదరాబాద్ కమిషనరేట్లో, 99 కేసులు రాచకొండ పరిధిలో,99 సైబరాబాద్ పరిధిలో, వరంగల్‌లో 42, కరీంనగర్ లో 21, నిజామాబాద్‌లో 8 , నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఏడు కేసుల చొప్పున, మహబూబ్‌నగర్‌లో ఆరు, రామ గుండం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జగిత్యాల జిల్లాల్లో ఐదు కేసుల వంతున నమోదయ్యాయని వివరించారు.
ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వైజయంతి మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్‌శాఖ అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల సామాన్యుల్లో పోలీసులపై ఎలా నమ్మకం ఏర్పడిందో, ఎన్‌ఆర్‌ఐ సెల్ ఏర్పాటు అనంతరం ప్రవాస భారతీయులు చేసే వివాహాల సంబంధిత మోసాల్లో బాధితుల్లో అంతే భరోసా ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ.. విదేశీ భర్తల కేసుల విషయంలో ఎన్‌ఆర్‌ఐ సెల్ బాధితులు, విచారణసంస్థల మధ్య వారధిలా పనిచేస్తోందన్నారు. అనంతరం ఎన్నారై వివాహాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచే ఆడియో, కరపత్రాన్ని విడుదల చేశారు. పలు ఎన్నారై వివాహ కేసుల్లో రాజీ కుదిరి ఒక్కటైన జంటలను ఈ సందర్భంగా వేదికపై సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment