స్వైన్ ఫ్లూపై కేసీఆర్ ఆందోళన
హైదరాబాద్: స్వైన్ ఫ్లూ హైదరాబాద్ నగరాన్నిఠారెత్తిస్తుంది. స్వైన్ ఫ్లూతో మంగళవారం నలుగురు వ్యక్తులు మరణించారు. దాంతో తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్వైన్ఫ్లూపై చర్చించేందుకు సాయంత్రం కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే హైదరాబాద్ నగరంలో నెలకొన్న స్వైన్ ఫ్లూ పరిస్థితిపై కేసీఆర్... ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఫోన్ చేసి వివరించారు. వైద్య సాయం కోసం వైద్య బృందాలను పంపాలని ఆయన ఈ సందర్బంగా వారికి విజ్ఞప్తి చేశారు.
అయితే తెలంగాణలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్న ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూపై సమీక్ష జరిపి వెంటనే నివేదిక అందజేయాలని కేసీఆర్... తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో మరో 20 రోజులు చలిగాలులు ఉంటాయిని... ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. స్వైన్ ఫ్లూతో గత రెండు నెలల కాలంలో మొత్తం 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.