
కరెంటు అడిగితే లాఠీదెబ్బలా?
రామాయంపేట రైతులపై లాఠీఛార్జ్ అమానుషమని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట మండటం నార్సింగిలో రైతులపై జరిగిన లాఠీ ఛార్జిపై ఆయన స్పందించారు. కరెంట్ అడిగితే లాఠీలతో కొడతారా అంటూ నిలదీశారు. సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామాయంపేట రైతులపై లాఠీఛార్జ్ బాధాకరమని, రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. రైతులు, విద్యార్థుల వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, ఈ విషయాన్ని కేసీఆర్ విస్మరించరాదని చెప్పారు. సమస్యలపై సమీక్షించడం మానేసి పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు.
విద్యుత్ సరఫరా చేయాలంటూ ధర్నా చేస్తున్న అన్నదాతలపై లాఠీ చార్జి జరగడం దురదృష్టకరమని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు సంయమనం పాటించాలని ఆయన తెలిపారు. విద్యుత్ సరఫరాలో సమస్య ఉన్నమాట వాస్తవమేనని, థర్మల్ పవర్ స్టేషన్‌లలో వచ్చే లోపాల వల్లే సమస్యలు వస్తున్నాయని అన్నారు. విద్యుత్ కొరత రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని తెలిపారు.