సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని లాల్‌దర్వాజా మహంకాళీ ఆలయంలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో అంబారి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఖర్చుతో నిర్వహిస్తున్నామనీ, అన్ని శాఖల సమన్వయంతో బోనాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామనీ, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని తెలిపారు.
బోనాల పండగ గొప్ప సంస్కృతి..
బోనాల పండుగ తెలంగాణ ప్రజలకు లభించిన గొప్ప సంస్కృతి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఎమ్మెల్సే రాంచంద్రా రెడితో కలిసి ఆయన ఆదివారం మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ కమిటీ సభ్యులు సన్మానం చేశారు. తమ సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపదేవిదంగా తెలంగాణ ప్రజల బోనాలు జరుపుకుంటారని లక్ష్మణ్ అన్నారు. బోనాల పండగకు రాష్ట్ర పండుగ హోదా ఇచ్చినప్పటికీ మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఢిల్లీలో సైతం బోనాలు నిర్వహించాం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఢిల్లీలో సైతం బోనాలు నిర్వహించామని జనసమితి పార్టీ అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కోదండరాం అన్నారు. అప్పుడు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బయటకు రాగానే తెలంగాణ ప్రకటన వెలువడిందని గుర్తు చేశారు. ఆయన మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. బోనాలలో సొంత మొక్కులు ఏం కోరుకోనని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలాలు అందరికీ అందాలని కోరుకున్నానని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment