హైదరాబాద్ : పార్టీ మారే విషయంలో సనత్ నగర్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మారోసారి తూచ్ అన్నారు. ఇవాళో, రేపో సైకిల్ దిగి కారు ఎక్కుతారనే ఊహాగానాలకు ఆయన తెరతీశారు. తన కుమార్తె రిసెప్షన్తో పాటు దసరా పండుగకు ఆహ్వానించేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసినట్లు ఆయన తెలిపారు.
ఏదైనా ఉంటే మీడియాతో చెప్తానని తలసాని పేర్కొన్నారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ....సోమవారం చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన పార్టీ సమావేశానికి అందరికంటే ముందే హాజరయ్యారు. ఓవైపు కేసీఆర్తో సన్నిహితంగా ఉంటూ, మరోవైపు పార్టీ సమావేశానికి తలసాని హాజరు కావటం విశేషం. దాంతో పార్టీ మారే విషయంపై తలసాని తన సస్పెన్స్ను కొనసాగిస్తున్నట్లు అయ్యింది.
మరోవైపు చంద్రబాబు ఈరోజు ఉదయం సచివాలయంలో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. విద్యుత్ సమస్యలపై టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ నేతలకు సూచించారు. అలాగే ప్రజా సమస్యలపై తెలంగాణలో బస్సు యాత్ర చేపట్టాలని ఆయన సూచించారు. తొలివిడతగా 10, 11 తేదీల్లో నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. విద్యుత్, రైతుల సమస్యల గురించి తెలుసుకోవాలని చంద్రబాబు ..పార్టీ నేతలకు సూచన చేశారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబు మరోసారి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.