తమ్మినేని, చాడలతో వరవరరావు భేటీ
12న భూమిని, రైతులను కాపాడుకోవడంపై రౌండ్‌టేబుల్
హైదరాబాద్: ప్రస్తుతం ఏపీ, తెలంగాణలలో అమలవుతున్న నయా పెట్టుబడిదారీ విధానాల నేపథ్యంలో భూమిని, రైతులను కాపాడుకునేందుకు ఏమి చేయాలనే దానిపై చర్చించేందుకు ఈ నెల 12న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు విరసం నేత వరవరరావు తెలిపారు. భూమిని కాపాడుకునేందుకు, ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రమాదాలను ఎదుర్కునేందుకు రైతులు, ఆదివాసీలు, ప్రజాసంఘాలతో కలిసి ఐక్యసంఘటనగా ఏర్పడి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీనిలో భాగంగా అన్ని పార్టీల ప్రజాసంఘాలను సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాతంత్ర దేశభక్త ఉద్యమం చొరవతో భూ నిర్వాసిత వ్యతిరేక కమిటీ, తెలంగాణ ప్రజాఫ్రంట్, విరసం తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు సాక్షికి చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎంబీభవన్‌లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో, మఖ్దూంభవన్‌లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఇంకా న్యూడెమోక్రసీ నేతలతో తాను సమావేశమైన ట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భూసేకరణ బిల్లును వాయిదా వేసినా, ఈ బిల్లుకు సవరణ చేయాలనుకున్న అంశాలను దొడ్డిదారిన అమలుచేసి, దోపిడీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వాల ద్వారా చర్యలను ప్రారంభించిందన్నారు.
రైతుల భూమిని బాబు లాక్కొంటున్నారు
దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణ ముందుభాగాన సాగుతున్నాయని వరవరవరావు చెప్పారు. రాజధాని నగరం కోసం భూసేకరణ పేరిట ఏపీ సీఎం చంద్రబాబు దారుణంగా రైతుల గోళ్లు ఊడగొట్టి మరీ భూములను లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ విధంగా రైతులు బలవంతంగా తమ భూమిని కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న లక్షలాది ఎకరాల భూమిని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ భూమిని ఏదోవిధంగా కొనుగోలు చేసి మైదాన ప్రాంతం నుంచి రైతులను దూరంగా తరిమేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. అటు చంద్రబాబు ఇటు కేసీఆర్ ఇద్దరూ సింగపూర్, ఇతర దేశాల మాదిరిగా ఏపీ, తెలంగాణలను మారుస్తామంటూ రైతులు, ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు.