రాష్ట్రంలో కుటుంబ పాలన
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఎస్‌ఎస్ తాడ్వాయి: ‘ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది.. రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ సీఎం కేసీఆర్ మాటలతో గారడీ చేస్తున్నాడని, ప్రజలు బతుకు తెలంగాణ కోరుకుంటున్నారని అన్నారు.
ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ప్రజల కష్టాలు ఏసీలో కూర్చున్న కేసీఆర్‌కు ఏం తెలుస్తాయని ధ్వజమెత్తారు. ఈ పాదయాత్ర ద్వారా కేసీఆర్‌కు కనువిప్పు కలగాలని అన్నారు. కాగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు.