తాండూరు కాంగ్రెస్‌లో అయోమయం! | Tandur constituency Congress party incharge? | Sakshi
Sakshi News home page

తాండూరు కాంగ్రెస్‌లో అయోమయం!

Published Wed, Dec 24 2014 11:56 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

తాండూరు కాంగ్రెస్‌లో అయోమయం! - Sakshi

తాండూరు కాంగ్రెస్‌లో అయోమయం!

* నియోజకవర్గ కొత్త ఇన్‌చార్జిగా నారాయణరావు
* ఇన్‌ఛార్జి మార్పుతో రమేష్ అసంతృప్తి?
* సబితారెడ్డి వర్గానికి ఊరట

తాండూరు: తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మార్పు ఆ పార్టీలో అయోమయానికి దారితీసింది. రాష్ట్ర మాజీ మంత్రి ఎం.మాణిక్‌రావు తనయుడు ఎం.రమేష్ ఇన్‌చార్జిగా కొనసాగుతుండగా.. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఇన్‌చార్జి మార్పు పరిణామం పార్టీలో కొందరికి ఆశ్చర్యాన్ని.. మరికొందరికి ఊరటను కలిగించింది. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పార్టీ ఇన్‌చార్జి అని పట్టణ శాఖ ప్రకటించింది. శాసన సభ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు అడపాదడపా మినహా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఇన్‌చార్జిగా తను ఉండాలనే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ నారాయణరావు అప్పట్లో తోసిపుచ్చారు. అధిష్టానం ప్రకటించే వరకు రమేష్‌యే ఇన్‌చార్జిగా కొనసాగుతారని నారాయణరావు అప్పట్లో ప్రకటించారు. మరి ఉన్నట్టుండి నారాయణరావు ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నారాయణరావుకు పార్టీ పగ్గాలు దక్కడంతో రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి వర్గీయులు ఊరట చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీలోని కొందరు నాయకులు, రమేష్ వర్గీయులు ఆయనను బాధ్యతలను తప్పించడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందులో కుట్ర దాగి ఉందనే వాదనలూ   వినిపిస్తున్నాయి. ఇది నిజమనో.. కాదనో రమేష్ నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో ఆయన ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకొన్నారా.. లేదా? అనే సందేహాలు ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే కొంత కాలంగా రమేష్ వైఖరిని వ్యతిరేకిస్తున్న కొందరు సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రమేష్‌కు సదరు నాయకుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. రమేష్ ఇన్‌చార్జిగా కొనసాగితే పార్టీలో తమ పలుకుడి ఏమీ ఉండదని భావించిన సదరు నాయకులు పార్టీలో తమ ఆధిపత్యం కోసం నారాయణరావు ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించేలా ఒత్తిడి తీసుకువచ్చినట్టు ప్రచారం సాగుతోంది.

పార్టీని బలోపేతం చేయడంతోపాటు నాయకులందరినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళతాడనే కారణంతో అధిష్టానం నారాయణరావుకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించినట్టు పట్టణ శాఖ చెబుతోంది. పార్టీలో కొందరు నాయకులు తమ ‘పనులు’ చేయించుకోవాలనే కుట్రలో భాగంగానే అర్ధంతరంగా ఇన్‌చార్జి మార్పు పరిణామం చోటుచేసుకుందనే అభిప్రాయం రమేష్ వర్గీయుల్లో వ్యక్తమవడం గమనార్హం. ఇన్‌చార్జి మార్పుపై రమేష్ కూడా అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.  మొత్తమ్మీద తాండూరు కాంగ్రెస్‌లో తాజా పరిణామంతో అయోయమ పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement