హైదరాబాద్‌ చరిత్రలో తొలిసారి... | Tata Institute Of Social Sciences Hyderabad Declares Sine Die | Sakshi
Sakshi News home page

‘టిస్‌’ క్యాంపస్‌ మూత..!

Published Tue, Jul 16 2019 12:46 PM | Last Updated on Tue, Jul 16 2019 12:46 PM

Tata Institute Of Social Sciences Hyderabad Declares Sine Die - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ క్యాంపస్‌ (టిస్‌) యాజమాన్యానికి.. విద్యార్థులకు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. మెస్సు బిల్లుల పెంపునకు నిరసనగా గత కొద్ది రోజుల నుంచి ఆ ప్రాంగణం విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సమస్యను పరిష్కరించక పోగా హైదరాబాద్‌ క్యాంపస్‌లో అకడమిక్‌ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థులంతా సోమవారం సాయంత్రం ఐదు గంటల్లోగా క్యాంపస్‌ను ఖాళీ చేయాల్సిందిగా స్పష్టం చేస్తూ ‘సైన్‌–డై’ నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్‌ చరిత్రలో తొలిసారి...
హైదరాబాద్‌ విద్యాలయాల చరిత్రలో ఈ తరహా నోటీసులు జారీ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ క్యాంపస్‌(టిస్‌) తొలుత రాజేంద్రనగర్‌లో ఉండేది. ఇటీవల ఈ క్యాంపస్‌ను అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లికి తరలించారు. అక్కడ బీఏ, ఎంఏ, ఎంఫిల్‌ కోర్సులను బోధిస్తున్నారు. ఆయా కోర్సుల్లో  సుమారు ఐదు వందల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మెస్‌ చార్జీలతో పాటు డిపాజిట్లను భారీగా యాజమాన్యం పెంచింది. వాటిని తగ్గించాలని, మెస్‌ కాంట్రాక్ట్‌కు సంబంధించిన టెండర్లను బహిర్గతం చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. యాజమాన్యం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా.. వారిపై చర్యలకు ఉపక్రమించింది. విద్యార్థులు తమ ఆందోళనలతో ప్రాంగణ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని పేర్కొంటూ ‘సైన్‌–డై’ ఆఫ్‌ క్యాంపస్‌కు యాక్టింగ్‌ రిజిస్ట్రార్‌ ఎంపీ బాలమురగన్‌ నోటీసు జారీ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఫ్యాకల్టీ సహా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నోటీసులు పంపింది. దీంతో విద్యార్థులంతా క్యాంపస్‌ను ఖాళీ చేసి రోడ్డుపైకి వచ్చారు.

ఇక్కడ చదువుతున్న వారిలో హైదరాబాద్‌ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఉన్నారు. తీరా సాయంత్రం క్యాంపస్‌ ఖాళీ చేయించడంతో ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలోపడ్డారు. ఇదిలా ఉంటే గత ఏడాది హాస్టల్, మెస్‌ డిపాజిట్‌ రూ.15 వేలు ఉండగా, ఈ మొత్తా న్ని మూడు విడతల్లో చెల్లించేవారు. తాజాగా మెస్‌ ఛార్జీలను ఒకే విడతలో రూ.54,000 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ బిల్లు చెల్లింపులో ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు మినహాయింపు ఉండగా, ఈ విద్యా సంవత్సరం ఆ వెసులుబాటును తొలగించి ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తోందని విద్యార్థి జేఏసీ నాయకురాలు కరీష్మా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ నోటీసులను రద్దు చేయాలని లేదంటే భవిష్యత్తులో భారీ ఆందోళనలకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement