Mess bills
-
ఇది మనసున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పేద, బడుగు ప్రజల సంక్షేమం కోసం 24 గంటలు ఆలోచించే మనసున్న ప్రభుత్వం తమదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే వారికి ఆపన్న హస్తం అందించడం ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై గురువారం శాసనసభలో సుదీర్ఘంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏటా ఖర్చు చేసిన మొత్తానికి రెట్టింపు కంటే అధికంగా వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గత 18 నెలల్లో రాష్ట్రంలోని అన్ని కులాల పేద ప్రజలకు వివిధ పథకాల కింద 5.65 కోట్ల మందికి రూ.77,731.32 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏటా సగటున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.15,961.2 కోట్లు వ్యయం చేస్తే తమ ప్రభుత్వం రెట్టింపు కంటే ఎక్కువగా రూ.39,153 కోట్లు వ్యయం చేయడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా, ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు అంటూ హడావుడి చేయడం ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రాజకీయాలపైనే బాబు దృష్టి ► అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు ఎలా సాయం చేయాలన్న ఆలోచన లేకుండా కేవలం రాజకీయాలపైనే చంద్రబాబు దృష్టి సారించారు. ఇంత కీలకమైన అంశంపై చర్చ చేపట్టినప్పుడు కూడా సూచనలు, సలహాలు ఇవ్వకుండా అబద్ధాలు మాట్లాడుతూ సభను అడ్డుకోవడం ద్వారా సస్పెండ్ అవ్వడం వరకు వెళుతున్నారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల అభ్యున్నతి, బాగు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. వీటిని ఏ విధంగా ఇంకా మెరుగు పరచాలని ఆలోచిస్తున్నాం. ఈ దిశగా ప్రతిపక్షం నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకోవాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కూడా ప్రతిపక్షం తీరు మారలేదు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో – ఇప్పుడు మన పాలనలో.. ► బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు చంద్రబాబు తన హయాంలో 5 ఏళ్లకు కలిపి రూ.79,806 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వం వీరి కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.58,729 కోట్లు ఖర్చు చేసింది. చంద్రబాబుకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారు గుర్తుకు వస్తారు. అందుకే 2019 ఫిబ్రవరిలో బీసీ సబ్ ప్లాన్ తెచ్చాడు. అప్పుడే 13 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పెన్షన్లు కూడా అంతే. ► ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, అంటే అక్టోబర్ 2018 వరకు పెన్షన్లు కేవలం 44 లక్షలుంటే, ఎన్నికలు వచ్చే సరికి ఆ సంఖ్యను 51 లక్షలకు పెంచారు. అంటే 7 లక్షల మందికి పెన్షన్ లేదని తెలిసినా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం 61.90 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తోంది. రిజర్వేషన్లు రాకుండా చంద్రబాబు కుట్ర ► గతంలో 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నిలు జరిగాయి. అందులో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యాయి. ఎన్నికలు జరపాలని 2018 అక్టోబర్ 23న హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, తనకు అనుకూలంగా లేదని చంద్రబాబు ఎన్నికలు జరపలేదు. ► మనం అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు వెళితే రిజర్వేషన్లు 50 శాతమే ఉండాలి కదా? 59.85 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని కేసు వేయించారు. దీంతో 50 శాతం రిజర్వేషన్లతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. దేనిలోనూ చిత్తశుద్ధి లేదు ► ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బిల్లులు దాదాపు రూ.3 వేల కోట్లు బాబు బకాయిలు పెడితే, మనం చెల్లించాం. పెండింగు లేకుండా తల్లుల ఖాతాల్లో జమ చేసేలా వ్యవస్థను తీసుకువచ్చాం. ► చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు రూ.14,200 కోట్లకు పైగా మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఇవ్వక పోవడంతో వారిపై రూ.3,036 కోట్ల భారం పడింది. మన ప్రభుత్వం వచ్చాక సున్నా వడ్డీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నాం. ఈ పథకంలో 2019–20లో అక్షరాలా రూ.1,400 కోట్లు ఇచ్చాం. ► గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. కానీ మన ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా వ్యయంతో 45 వేల స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఆధునీకరిస్తోంది. మధ్యాహ్న భోజన పథకంలో క్వాలిటీ పెంచాం. పిల్లల్లో 85 శాతం మెదడు వికాసం ఆరేళ్లలోపే జరుగుతుంది. ఈ దృష్ట్యా పిల్లలు, తల్లులు, గర్భవతులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం బావుండాలని వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ అని అమలు చేస్తున్నాం. అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారునికే ► ప్రవేశపెట్టిన ప్రతి పథకం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ చేరాలన్నది మన ప్రభుత్వ ఆలోచన. ఇందుకని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకు వలంటీర్‌ను పెట్టాం. ఎవరైనా పథకంలో మిస్ అయితే, దరఖాస్తు తీసుకుని అర్హత ఉంటే, ఆ తర్వాత నెలలోనే ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంతో చేశాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో వారే నలుగురు ఉన్నారు. 60 శాతం మంత్రి పదవులు వారికే ఇచ్చాం. అణగారిన బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎస్సీలలో విభేదాలు రాకుండా వేర్వేరుగా మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ► రాజ్యసభకు పంపిన నలుగురిలో ఇద్దరు బీసీలు, మండలికి ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు మైనార్టీలు, ఒకరు బీసీ ఉన్నారు. కార్పొరేషన్లు, ఆలయాల చైర్మన్లు, పాలక మండళ్లు, మార్కెట్ కమిటీలలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చే విధంగా చట్టాలు చేశాం. గ్రామ సచివాలయాల్లో వారికి 82 శాతం ఉద్యోగాలు దక్కాయి. ► అక్షరాలా 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 2.61లక్షల వలంటీర్ల ఉద్యోగాలు ఆ విధంగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అక్కచెల్లెమ్మలకు ప్రతి అడుగులోనూ తోడుగా.. ► మహిళా పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులో చూపాం. ప్రతి పథకంలో లబ్ధిదారులు అక్క చెల్లెమ్మలే. వైఎస్సార్ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చేలా రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, అల్లానా, హిందుస్తాన్ యూనీ లీవర్, అమూల్ వంటి పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. రీటెయిల్ రంగంలో 77 వేల షాపులు ఏర్పాటు చేశాం. ► 4.69 లక్షల అక్క చెల్లెమ్మలకు పాడి ఆవులు, గేదెలు.. 2.49 లక్షల అక్క చెల్లెమ్మలకు మేకలు, గొర్రెల యూనిట్లు ఇస్తున్నాం. 31 లక్షల ఇళ్ల స్థలాలు నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ► మహిళల కోసం దిశ చట్టం బిల్లు తీసుకొచ్చి,, దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాం. దశలవారీ మద్య నియంత్రణ ఒక పాలసీగా అడుగులు వేశాం. 43 వేల బెల్టు షాపులు రద్దు చేశాం. వీటన్నింటి వల్ల మద్యం అమ్మకాలు తగ్గినా, ధరలు పెంచాం కాబట్టి ఆదాయం తగ్గలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి చేసిన వ్యయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే జూన్ 2019 నుంచి నవంబర్ 2020 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి 58,729 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. ఇందులో ఒక్క ఏడాదిలో వ్యయం చేసినది రూ.39,153 కోట్లు. అదే టీడీపీ ప్రభుత్వం ఏడాదికి సగటున ఆ వర్గాల సంక్షేమానికి ఖర్చు చేసింది కేవలం రూ.15,962 కోట్లే. -
హాస్టల్ మూసివేసినా మెస్ బిల్ కట్టాలట!
ఓ ప్రైవేటు కార్పొరేట్ కళాశాల కరోనా సమయంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వివిధ రకాల ఫీజులు పేరుతో వసూళ్లకు తెగబడుతోంది. నీట్ పరీక్షలు సమీపిస్తుండడంతో ఆ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు మెస్సేజ్‌లు పంపి బ్లాక్మెయిల్ చేస్తోంది. హాస్టల్ మూసివేసినా మెస్ బిల్ కట్టాలని, లేకపోతే మెటీరియల్, బట్టలు, సర్టిఫికెట్లు ఇవ్వమంటూ బెదరగొడుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ నాయకునికి చెంది జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రముఖ కార్పొరేట్ కళాశాల శాఖల్లో సుమారు 12వేల మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్నారు. కరోనా కేసుల నేపథ్యంలో మార్చి 22 నుంచి కళాశాల, వసతి గృహాలను మూసివేసి విద్యార్థులను వారి ఇళ్లకు పంపేశారు. హాస్టల్లో ఉన్న మెటీరియల్, వివిధ సర్టిఫికెట్స్, బట్టలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి పంపేశారు. కరోనా ఉధృతి తగ్గకపోవడంతో కళాశాలలు తెరుచుకోలేదు. విద్యార్థులు ఇళ్ల వద్దే ఉండిపోవడంతో కొన్ని రోజుల తరువాత ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు.ఇందుకు ప్రత్యేకంగా ఫీజులు కూడా వసూలు చేశారు. భోజనం పెట్టకపోయినా మెస్ బిల్లులు కట్టాలట! లాక్ డౌన్ నేపథ్యంతో కళాశాలలు, వసతి గృహాలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. అయినా ఆ కళాశాల యాజమాన్యం లాక్డౌన్ సమయంలో కూడా మెస్ బిల్లులు చెల్లించాలంటూ విద్యార్థుల సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపడంతో బిత్తరపోయారు. అంతేకాకుండా మెస్ బిల్లు చెల్లిస్తే తప్ప హాస్టల్లో ఉన్న మెటీరియల్, గదుల్లోని బట్టలు, సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేది లేదని మెస్సేజ్ ఇవ్వడంతో హడలిపోయారు. నీట్ పరీక్షలకు స్టడీ మెటీరియల్ కోసం కళాశాల వద్దకెళితే హాస్టల్‌కి తాళాలు వేసి లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని విద్యార్థులు లబోదిబోమంటున్నారు. నాలుగు నెలలుగా ప్రదక్షిణలు చేస్తున్నా కళాశాల యాజమాన్యం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందాన తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. మెస్ బిల్లులు చెల్లిస్తే తప్ప హాస్టల్లో ఉన్న వస్తువులు తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
లైట్లు లేవు.. ప్లేట్లు లేవు..
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ హాస్టళ్లలో లైట్లు, ప్లేట్లు ఇతర సౌకర్యాలు లేవని, నాణ్యత, రుచి లేని ఆహారానికి ( నెలకు రూ.2000 నుంచి రూ.3000 వేలు) వరకు అధిక మెస్ బిల్లు వసులు చేస్తున్నారని, తిన్నా తినకున్న మెస్ బిల్లులు వస్తున్నాయని, నిత్యం సమస్యలతో చదువులు సాగడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ రోడ్డెక్కుతున్న విద్యార్థులకు సర్దిచెప్పలేక, నిధుల కొరత కారణంగా వసతులు కల్పించలేక అధికారులు తలపట్టుకుంటున్నారు. ఓయూ క్యాంపస్ కాలేజీల విద్యార్థులతో పాటు నిజాం, కోఠి మహిళా, సికింద్రాబాద్ పీజీ, సైఫాబాద్ పీజీ కాలేజీల విద్యార్థులు నిత్యం ఆందోళనకు దిగుతున్నారు. హాస్టళ్లు నిర్వహించలేక జిల్లా పీజీ కాలేజీల హాస్టల్స్‌ను ప్రాంభించకుండానే పక్కన పెట్టారు. ఉన్నత విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే విద్యార్థులు ఓయూ హాస్టళ్లు ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసిపోవని కలగంటూ వర్సిటీలో అడుగుపెడతారు. అయితే ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కొత్తగా హాస్టల్లో చేరే విద్యార్థుల నుంచి ఎస్సీ, ఎస్టీలకు రూ.8000, బీసీలకు రూ.10 వేలు, ఓసీలకు రూ.12 వేలు డిపాజిట్ చేయిస్తున్నారు. గదుల కేటాయింపు, సౌకర్యాలు, వసతులు, ఆహారం అందించడంలో అధికారులు విఫలమయ్యారని విద్యార్థులు పేర్కొంటున్నారు. హాస్టళ్ల నిర్వహణలోమార్పు తేవాలి ఓయూ హాస్టల్స్ నిర్వహణలో మార్పు తేవాలని నవ తెలంగాణ స్టూడెంట్ యూనియన్ (ఎన్టీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షులు బైరు నాగరాజుగౌడ్ అధికారులను కోరారు. ఓయూలో అనేక మార్పులు చోటు చేసుకున్న హాస్టల్స్ సాంప్రదాయ బద్దంగా పాత పద్దతిలోనే కొనసాగిస్తున్నారన్నారు. డిపాజిట్ పేరుతో వేల రూపాయాలను వసూలు చేస్తున్న అధికారులు అందుకు తగిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. గదుల కేటాయింపు మొదలు ఆహారం వరకు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. హాస్టల్స్ నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థుల చదువుకునే వాతావరణాన్ని కల్పించాలని కోరారు. – బైరు నాగరాజుగౌడ్ ఎన్టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు -
హైదరాబాద్ చరిత్రలో తొలిసారి...
సాక్షి, హైదరాబాద్ : టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ క్యాంపస్ (టిస్) యాజమాన్యానికి.. విద్యార్థులకు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. మెస్సు బిల్లుల పెంపునకు నిరసనగా గత కొద్ది రోజుల నుంచి ఆ ప్రాంగణం విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సమస్యను పరిష్కరించక పోగా హైదరాబాద్ క్యాంపస్‌లో అకడమిక్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థులంతా సోమవారం సాయంత్రం ఐదు గంటల్లోగా క్యాంపస్‌ను ఖాళీ చేయాల్సిందిగా స్పష్టం చేస్తూ ‘సైన్–డై’ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ చరిత్రలో తొలిసారి... హైదరాబాద్ విద్యాలయాల చరిత్రలో ఈ తరహా నోటీసులు జారీ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ క్యాంపస్(టిస్) తొలుత రాజేంద్రనగర్‌లో ఉండేది. ఇటీవల ఈ క్యాంపస్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లికి తరలించారు. అక్కడ బీఏ, ఎంఏ, ఎంఫిల్ కోర్సులను బోధిస్తున్నారు. ఆయా కోర్సుల్లో సుమారు ఐదు వందల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మెస్ చార్జీలతో పాటు డిపాజిట్లను భారీగా యాజమాన్యం పెంచింది. వాటిని తగ్గించాలని, మెస్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన టెండర్లను బహిర్గతం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా.. వారిపై చర్యలకు ఉపక్రమించింది. విద్యార్థులు తమ ఆందోళనలతో ప్రాంగణ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని పేర్కొంటూ ‘సైన్–డై’ ఆఫ్ క్యాంపస్‌కు యాక్టింగ్ రిజిస్ట్రార్ ఎంపీ బాలమురగన్ నోటీసు జారీ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఫ్యాకల్టీ సహా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నోటీసులు పంపింది. దీంతో విద్యార్థులంతా క్యాంపస్‌ను ఖాళీ చేసి రోడ్డుపైకి వచ్చారు. ఇక్కడ చదువుతున్న వారిలో హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఉన్నారు. తీరా సాయంత్రం క్యాంపస్ ఖాళీ చేయించడంతో ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలోపడ్డారు. ఇదిలా ఉంటే గత ఏడాది హాస్టల్, మెస్ డిపాజిట్ రూ.15 వేలు ఉండగా, ఈ మొత్తా న్ని మూడు విడతల్లో చెల్లించేవారు. తాజాగా మెస్ ఛార్జీలను ఒకే విడతలో రూ.54,000 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ బిల్లు చెల్లింపులో ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు మినహాయింపు ఉండగా, ఈ విద్యా సంవత్సరం ఆ వెసులుబాటును తొలగించి ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తోందని విద్యార్థి జేఏసీ నాయకురాలు కరీష్మా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ నోటీసులను రద్దు చేయాలని లేదంటే భవిష్యత్తులో భారీ ఆందోళనలకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. -
మెస్ బిల్.. గుండె గుబేల్!
సాక్షి, కర్నూలు(గాయత్రీ ఎస్టేట్) : రాయలసీమ విశ్వవిద్యాలయం హాస్టళ్లలో ఇష్టారాజ్యంగా మెస్ బిల్లులు వసూలు చేస్తుండడంతో విద్యార్థులు హాస్టల్ పేరు చెబితేనే హడలిపోతున్నారు. హాస్టళ్లలో ప్రొవిజన్స్, కూరగాయలు, చికెన్, పాలు, నీటి సరఫరాకు ఎలాంటి టెండర్లు లేకుండా పర్చేజ్ కమిటీ అనామతుగా బిల్లలు చెల్లిస్తుండడంతో విద్యార్థులకు బిల్లుల భారం పెరుగుతోంది. ఏడాదికి అదనంగా రూ.15 లక్షలు అదనపు భారం పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పటి వరకు హాస్టళ్లకు సంబంధించి ప్రొవిజన్స్, కూరగాయలు, పాలు తదితర వాటికి ఎలాంటి టెండర్లు పిలవలేదు. ప్రస్తుతం మెస్ నిర్వహణ కోసం 15 రోజులకు సరిపడా వస్తువులను కొనుగోలు చేశారు. టెండర్ల ఊసే లేదు.. విశ్వవిద్యాలయంలో మూడు మెన్స్ హాస్టళ్లు, రెండు ఉమెన్స్ హాస్టళ్లున్నాయి. గతేడాది 330 మంది అబ్బాయిలు, 335 మంది అమ్మాయిలు హాస్టళ్లలో ఉన్నారు. నెలకు సరిపడా ప్రొవిజన్స్‌కు రూ.7లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రొవిజన్లకు సంబంధించి 2016 టెండర్లు పిలిచారు. అప్పుడు కూడా ఒక నెలకు మాత్రమే అని నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పుడు ఎవరైతే టెండర్లలో దక్కించుకున్నారో వారినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక కూరగాయలు, పాలు, నీటి సరఫరాకు సంబంధించి వర్సిటీ ఏర్పటి నుంచి అయిన వారికే అప్పగిస్తున్నారు. ఇందులో వర్సిటీ కీలక అధికారులకు పర్సెంటేజీలు అందుతుండటంతో టెండర్లు లేకుండానే హాస్టళ్లను నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. విద్యార్థులపై భారం.. వర్సిటీలోని ఆరు హాస్టళ్లలో 665 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి నెలకు ఒక్కొక్కరికి రూ.2000 నుంచి రూ.2500 వరకు మెస్ బిల్లు వస్తుంది. అయితే స్కాలర్షిప్ కోర్సు, కేటగిరిని బట్టి ఏడాదికి రూ.5400 నుంచి రూ. 7000 వరకు వస్తుంది. మిగతాది విద్యార్థులు చేతి నుంచి చెల్లించాల్సిందే. టెండర్ల ద్వారా ఏజెన్సీలను పిలిచి తక్కువ ధరలకు కోట్ చేసినవారికి బాధ్యతలు అప్పగిస్తే విద్యార్థులపై మెస్ బిల్లుల బారం తగ్గుతుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. నివేదిక ఇవ్వని విచారణ కమిటీ గత విద్యా సంవత్సరం హాస్టళ్ల ప్రొవిజన్స్, కూరగాయల కొనుగోలు తదితర వాటిల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని దానిపై విచారణ చేయించాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. దీంతో వర్సిటీ ఉన్నతాధికారులు ఆర్యూ ఈసీ మెంబర్ ప్రొఫెసర్ సంజీవరావు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ విశ్వనాథ«రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ సుబ్బారెడ్డితో కమిటీ నియమించారు. అయితే ఈ కమిటీ ఇప్పటికీ ఎలాంటి నివేదిక సమర్పించలేదు. త్వరలో టెండర్లు పిలుస్తాం హాస్టల్స్‌కు ప్రొవిజన్స్, కూరగాయలు సరఫరా చేయడానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేస్తాం. ఉన్నవారితోనే మార్కెట్ ధరలకు అనుగుణంగా వస్తువులను సరఫరా చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక్కడి పరిస్థితులకు భయపడి వస్తువులను సరఫరా చేయడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ సారి పర్చేజ్ కమిటీతో పాటు, విద్యార్థుల సమక్షంలోనే టెండర్లు ఓపెన్ చేస్తాం. – ప్రొఫెసర్ అమర్నాథ్, రిజిస్ట్రార్ -
హాస్టల్.. హడల్!
జేఎన్టీయూ(ఏ) పరిధిలోని పులివెందుల, కలికిరిలోని కళాశాల హాస్టళ్లలో ఉద్యోగుల జీతాలను, విద్యుత్ బిల్లులను విద్యార్థులతో సంబంధం లేకుండా చెల్లిస్తున్నారు. అయితే ఒక్క అనంతపురంలోనే విద్యార్థులపై భారం వేస్తుండటం గమనార్హం. జేఎన్టీయూ:రాయలసీమలోనే ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో సీటు దక్కితే చాలు మురిసిపోతారు. ఇలాంటి కళాశాలలో వెలుగులోకి వచ్చిన వ్యాపార ధోరణి ఆ పేరుప్రఖ్యాతలకు మచ్చ తీసుకొస్తోంది. విద్యార్థి భాగస్వామ్య హాస్టల్స్ పేరిట సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేయడం విమర్శలకు తావిస్తోంది. సాంకేతిక విద్య కావడంతో విద్యార్థులు కూడా భారమైనా భరించక తప్పని పరిస్థితి నెలకొంది. క్యాంపస్ హాస్టళ్లలో కనీస వసతుల కల్పన వర్సిటీతో పాటు అధికారుల కనీస బాధ్యత. మొత్తం 8 హాస్టళ్లలో 1,932 మంది విద్యార్థులు ఉండగా.. నిర్వహణకు 110 మంది ఉద్యోగులను నియమించారు. ఈ ఉద్యోగుల జీతభత్యాలను నేరుగా జేఎన్టీయూ(ఏ) చెల్లించాల్సి ఉండగా.. విద్యార్థి మెస్ బిల్లుల్లో కలుపుతున్నారు. ప్రతి ఉద్యోగికి నెల జీతం రూ.6,500 చొప్పున 110 మంది ఉద్యోగులకు ఏడాదికి రూ.85.80 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ భారం విద్యార్థులపై పడుతోంది. ఇదే కాదు.. ఏడాదికి వచ్చే విద్యుత్ బిల్లు రూ.33లక్షలు కూడా విద్యార్థుల నుండే వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి యేటా అదనంగా రూ.6,300 చెల్లించాల్సి వస్తోంది. అంటే విద్యార్థులు తిన్నా తినకపోయినా ఈ భారం మాత్రం మోయాల్సిందే. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు నెలకు రూ.1200, బీసీ కేటగిరీ విద్యార్థులకు నెలకు రూ.1200 చొప్పున ప్రభుత్వం ఉపకార వేతనాలను అందిస్తోంది. ఇందులో ఏడాదికి రూ.6,300 ఉపకార వేతనాల సొమ్మును ప్రతి విద్యార్థి సిబ్బంది జీతాలకు జమ చేయాల్సి వస్తోంది. ఈ దోపిడీ గత పది సంవత్సరాలుగా సాగుతోంది. ఇలా ఇప్పటి వరకు సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లుల రూపంలో విద్యార్థులు రూ.12.10 కోట్లు అర్పించుకున్నారు. బ్లాక్ గ్రాంట్ మొత్తం ఏమవుతోంది! జేఎన్టీయూ అనంతపురం విద్యార్థులను ఏ విధంగా దగా చేస్తుందో బ్లాక్‌గ్రాంట్ వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. హాస్టళ్లకు సంబంధించి 90 శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేస్తామని పదేళ్ల కిందట ప్రకటించారు. అయితే 19 మందిని మాత్రమే భర్తీ చేశారు. అయితే 90 మంది ఉద్యోగులకు చెల్లించే జీతాల మొత్తాన్ని బ్లాక్‌గ్రాంట్‌గా ప్రతి యేటా ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకుంటోంది. కానీ హాస్టల్ ఉద్యోగులకు మాత్రం ఆ మొత్తాన్ని చెల్లించని పరిస్థితి. నిధులు ఉన్నా జీతాల భారాన్ని విద్యార్థులపై మోపుతుండటం గమనార్హం. ఈ బ్లాక్‌గ్రాంట్ మొత్తాలను వర్సిటీ ఇతర అవసరాలకు వినియోగించుకోవడం విమర్శలకు తావిస్తోంది. కాషన్ డిపాజిట్ కూడా తిరిగివ్వలేదు హాస్టల్లో అడ్మిట్ అయిన వెంటనే కాషన్ డిపాజిట్‌గా రూ.3 వేలు కట్టించుకున్నారు. కోర్సు పూర్తయ్యాక వచ్చిన మెస్ బిల్లుకు ఈ మొత్తాన్ని కలపాలి. కానీ అలా చేయలేదు. మెస్ బిల్లు మొత్తం కట్టినా కాషన్ డిపాజిట్ తిరిగివ్వలేదు. మా అన్న గతేడాది బీటెక్ ఫైనలియర్ పూర్తి చేశారు. కానీ కాషన్ డిపాజిట్ వెనక్కివ్వలేదు. ఉద్యోగం వచ్చిన వారితో ముందస్తుగానే మెస్ బిల్లు కట్టించుకున్నారు. మెస్ బిల్లు పోనూ తక్కిన మొత్తం తిరిగివ్వడం లేదు.– విశాల్, బీటెక్ మూడో సంవత్సరం, జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల. విద్యార్థులపై భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం హాస్టల్స్ విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం. విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం. సోలార్ విద్యుదుత్పత్తితో కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉండటంతో ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం.– ప్రొఫెసర్ రామానాయుడు, ప్రిన్సిపాల్, చీఫ్ వార్డెన్,జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల -
పాఠశాలల్లో ఆహారానికి జీఎస్టీ మినహాయింపు
న్యూఢిల్లీ: పాఠశాలలే నేరుగా విద్యార్థులకు సరఫరా చేసే ఆహార పదార్థాలు, పానీయాలపై జీఎస్టీ విధించబోమని ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే విద్యా సంస్థల్లోని క్యాంటీన్, మెస్‌లలోని ఆహార పదార్థాలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా జీఎస్టీని 5 శాతమే వర్తింపజేస్తామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ ఒక ప్రకటనను జారీచేసింది. ‘హైయర్ సెకండరీ స్థాయి వరకు పాఠశాలలే నేరుగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తే వాటికి జీఎస్టీని మినహాయిస్తాం. విద్యా సంస్థల్లోని మెస్, క్యాంటీన్లలోని ఆహార పదార్థాలపై ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ లేకుండా పన్ను 5 శాతమే ఉంటుంది’అని అందులో పేర్కొంది. -
అప్పణంగా భోంచేశారు!
జేఎన్టీయూలో మెస్ బిల్లుల మాయాజాలం లెక్కల్లో చూపకుండా రూ.8 లక్షలు స్వాహా కలికిరి కళాశాల విద్యార్థులతో చలానాకు బదులు నగదు రూపంలో వసూలు హాస్టల్ ఖాతాకు జమ చేయకుండా దారి మళ్లించిన వైనం! సాఫ్ట్వేర్ రూపకల్పనకు అనధికారికంగా రూ.4లక్షల చెల్లింపు!! జేఎన్టీయూ(ఏ)కు కానిస్టిట్యూట్ కళాశాలగా కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ఉంది. అక్కడ ల్యాబ్ సదుపాయాలు, పర్మినెంట్ ఫ్యాకల్టీ లేకపోవడంతో ప్రయోగాలు చేసుకోవడానికి అనంతపురం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు విద్యార్థులు వస్తుంటారు. ఏడాదిలో నాలుగు పర్యాయాలకు పైగా ఇక్కడి ల్యాబ్‌లను వారు ఉపయోగించుకుంటారు. దీంతో క్యాంపస్ కళాశాల హాస్టల్లోనే వారికి వసతి ఏర్పాట్లు చేస్తుంటారు. సాధారణంగా ఏ విద్యార్థి అయినా మెస్ బిల్లు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ కలికిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల నుంచి హాస్టల్ అధికారులు నేరుగా మెస్ బిల్లులు కట్టించుకున్నారు. కానీ ఆ నగదు ఏ ఖాతాల్లోనూ చూపలేదు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల నుంచి రూ.8లక్షలకు పైగానే నగదు కట్టించుకున్నట్లు తెలుస్తోంది. ఎంత మంది విద్యార్థులు భోజనం చేస్తారో వారందరి మీద మెస్ బిల్లు సమానంగా వేస్తారు. వసూలు చేసిన రూ.8లక్షలను హాస్టల్ ఖాతాకు చేర్చకపోవడంతో ఆ భారం కాస్తా స్థానిక కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులపై పడింది. వ్యూహంతో విద్యార్థులు బలి సాధారణంగా ఎవరైనా విద్యార్థి వరుసగా మూడు రోజులు మెస్‌కు గైర్హాజరయితే సెలవులో ఉన్నట్లు గుర్తించాలి. సెలవు రోజులకు మెస్ బిల్లు వేయకూడదు. కానీ ఇందుకు భిన్నంగా నెల రోజులు సెలవులో ఉన్న విద్యార్థులకు సైతం మెస్ బిల్లు వేశారు. దీంతో మెస్‌కు నిరంతరంగా హాజరైన విద్యార్థులకు బిల్లు తక్కువగా వచ్చింది. బిల్లు తక్కువగా వచ్చిన అంశాన్ని ముమ్మర ప్రచారం చేస్తూ హాస్టల్స్‌లో అంతా సజావుగా ఉందన్న భ్రమ కల్పించేందుకు ప్రయత్నించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇండెంట్‌కు.. బిల్లులకు భారీ వ్యత్యాసం మెస్‌లో నిత్యావసర సరుకుల కొనుగోలుకు సంబంధించి ఇండెంట్లో నిర్ధారించిన ధరకు, కొనుగోలు బిల్లుకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. జనవరి 24న ఇండెంట్లో ఉల్లిగడ్డలు కిలో రూ.14, మిర్చి రూ.10గా నిర్ధారించారు. కానీ బిల్లులో మాత్రం కిలో ఉల్లిగడ్డలు రూ.20, మిర్చి రూ.13గా చూపించారు. అంటే కిలోకు ఆరు రూపాయలు అదనంగా బిల్లు వేశారు. తిరిగి జనవరి 27న ఇండెంట్లో ఉల్లిగడ్డలు రూ.13, ఆలూ రూ.10, కానీ బిల్లులో ఉల్లి రూ.20. ఆలూ రూ.25గా బిల్లు వేశారు. బిల్లులోని ప్రతి వస్తువుపైనా అదనపు ధరలతో దండుకున్నారు. సాప్ట్వేర్ రూపకల్పనకు రూ. 4లక్షలు ఖర్చు మెస్‌బిల్లు వసూలుకు సంబంధించిన సాఫ్ట్వేర్ రూపకల్పనకు రూ.4 లక్షలు వెచ్చించారు. ఇందుకు ఎలాంటి విధివిధానాలు, అనుమతులు లేకుండానే హాస్టల్ అధికారులు ఖర్చు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రోగ్రాంను రూపొందించిన కంపెనీ సైతం లోకల్‌దే చూపించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుండడంతో మెస్ బిల్లులు భారంగా పరిణమించాయని విద్యార్థులు బాహాటంగానే వాపోతున్నారు. -
విద్యార్థుల సొమ్ము.. రూ.2కోట్లు హాంఫట్
సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విద్యాశాఖమంత్రి కొత్తగూడెం: వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా రెండుకోట్ల రూపాయలను అక్రమార్కులు గుటకాయ స్వాహా చేశారు. కొత్తగూడెంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(యూసీఈ) విద్యార్థుల ఉపకార వేతనాలు, మెస్, కాస్మొటిక్ బిల్లులకు సంబంధించిన ఈ డబ్బును అక్రమార్కులు గత ఐదేళ్లలో కాజేశారు. ఈ మొత్తం దాదాపు రెండుకోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇలా బయటపడింది.. ఈ స్వాహాపర్వాన్ని ఇక్కడి విద్యార్థులే బయట పెట్టారు. విద్యార్థులకు సంబంధించిన ఉపకా ర వేతనాలు, మెస్ బిల్లులు, లైబ్రరీ ఫీజులకు సంబంధించిన నిధులు నేరుగా కళాశాల ఖాతాలోకి వెళతాయి. బ్యాంక్ ఖాతా లేని విద్యార్థుల కు సంబంధించిన ఉపకార వేతనాలను కూడా ప్రిన్సిపాల్‌కు ఉన్న ప్రత్యేకాధికారాలతో వేరే అ కౌంట్‌లో జమ చేసే అవకాశముంది. ఇలా గత ఐదేళ్లుగా వస్తున్న డబ్బును స్వాహా అవుతున్నట్టుగా విద్యార్థులకు అనుమానం వచ్చింది. దీ నిపై వారు ఏడాది క్రితం కాకతీయ యూనివర్సిటీ అధికారులకు సమాచారమిచ్చారు. వారు స్పందించి కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరి నట్టు సమాచారం. ప్రిన్సిపాల్ ఏమి చెప్పారో ఏమోగానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక లాభం లేదనుకున్న విద్యార్థులు.. గత ఆగస్టులో వారం రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. ఎస్పీ రంగనాథ్ వెంటనే స్పందించారు. ఈ కళాశాలను ఆయన సందర్శించి, పోలీసు శాఖ నుంచి ప్రాథమిక విచారణ జరిపించగా.. నిధుల స్వాహా నిజమేనని, ఈ మొత్తం దాదాపు రెండుకోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తేలినట్టుగా సమాచారం. క్లర్కులే అక్రమార్కులా...?! యూసీఈకి సంబంధించిన జమాఖర్చులను క్లర్కులే చూస్తుంటారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌తోపాటు మెస్, కాస్మోటిక్స్ బిల్లులు కూడా వస్తుంటాయి. ఈ కళాశాలలో మొత్తం అన్ని బ్రాంచిలలో కలిపి సుమారు 300మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. వీరికి సంబంధించి గత ఐదేళ్లలో వచ్చిన కొందరి ఉపకార వేతనాలు, బిల్లులు దాదాపు రెండుకోట్ల రూపాయలను క్లర్కులే డ్రా చేసుకున్నట్టు తెలిసింది. సీబీ సీఐడీ విచారణకు మంత్రి ఆదేశం ఈ స్వాహాపర్వంపై కళాశాల విద్యార్థులు ఇటీవల విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రమిచ్చారు. ఆయన స్పందించి, ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. స్వాహా నిజమేనని తెలీడంతో పూర్తిస్థాయి విచారణ కోసం సీబీసీఐడీని ఆదేశిస్తూ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. -
సారీ బువ్వ పెట్టలేం..!
ఎన్నో ఆశలతో సంక్షేమ వసతి గృహాలకు వస్తున్న విద్యార్థులకు మెస్ బిల్లులు అందక పస్తులతో గడుపుతున్నారు. విద్యార్థుల నిర్వహణలో నడుస్తున్న వీటికి బకాయిలు పేరుకున్నాయి. దీంతో స్టూడెంట్లు బువ్వకు మొహంవాస్తున్నారు. అప్పులతో వంట నడిపిస్తున్నారు. కొందరు బంధువుల ఇళ్లల్లో కాలంగడిపేస్తున్నారు. లేదా బయట తింటూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: జిల్లాలోని సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాలకు సంబంధించి మెస్‌చార్జీల బకాయిలు విడుదల కాకపోడంతో వీటిని ఆశ్రయించి చదువుకుంటున్న విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంనుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో స్టూడెంట్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీనితో సంక్షేమ శాఖ విద్యార్థి నిర్వహణ హాస్టళ్లకు భోజనం పెట్టించే విషయంలో చేతులెత్తేసింది. ఈ విషయంపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా జిల్లా ఉన్నతాధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. జిల్లాలో ప్రభుత్వ నిర్వహణలో నడిచే హాస్టళ్లకు పౌర సరఫరాల శాఖ నెల నెలా బియ్యం పంపిణీ చేయగా కూరగాయలు, ఇతర నిత్యావసరాల కొనుగోళ్లకు ప్రభుత్వం నిధులిస్తుంది. కానీ జిల్లాలో విద్యార్థులు నడుపుకొనే 21 హాస్టళ్లలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. వీటికి బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయగా కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్లకు సర్కారు నిధులివ్వదు. ప్రభుత్వం ఇచ్చే మెస్‌చార్జీలను పోగేసి ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలు కొంటారు. నిబంధనల ప్రకారం ప్రతీ విద్యార్థికి 1,050 చొప్పున మెస్ చార్జీలుగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఎస్సీ కళాశాల మేనేజ్మెంట్ హాస్టళ్లు 21 ఉండగా వీటిలో మొత్తం 1600 వందల మంది విద్యార్థులు ఉన్నారు. ఒక పూట తిని మరో పూట పస్తులుంటూ చదువులు సాగిస్తున్నారు. ఇంత మంది విద్యార్థులకు రూ.కోటి 68 లక్షలకుపైగా మెస్‌చార్జీలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అప్పులతో నడుస్తున్న అన్నం... ఈ మొత్తం ఏదో ఒక రోజు వస్తుందన్న ఆశతో అప్పులు చేసి నిర్వహిస్తునానరు. ఇలా జిల్లాలో ప్రతీ హాస్టల్లో కిరాణా బకాయిలు రూ. 3 నుంచి రూ.4 లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బకాయిలు చాంతాడంత పెరుగుపోతోందని ఇక బిల్లులు చెల్లించనిదే కిరాణా సరకులను ఇవ్వలేమని వాటి యాజమానులు తేల్చిచెబుతున్నారు. ఇంటి నుంచి ఉప్పు, పప్పు, బియ్యం తెస్తేనే భోజనం. లేకుంటే సొంత ఖర్చుతో బయట హోటళ్లలో తింటున్నారు. లేదంటే బంధువులు, స్నేహితుల ఇండ్లలో గడిపేస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు బయట హోటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. బయట తినే వారికి ఖర్చు చేయిదాటుతోంది. ఇది మరో సమస్య... ఉన్న హాస్టళ్లు అలా సతమవుతుంటే మరికొన్ని మంజూరైనా ప్రారంభానికి నోచుకోవడం లేదు. జిల్లాలో సొంతంగా నిర్వహించుకొనే హాస్టళ్లు 21 ఉన్నాయి. ఆరు హాస్టళ్లు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. నడుస్తున్న జడ్చర్ల బాలికల హాస్టల్ ఈ మధ్యనే మూతపడింది. కొల్లాపూర్‌లో 2 ( బాలుర 1, బాలిక1) షాద్‌నగర్ బాలికల, కల్వకుర్తిలో బాలికల, అచ్చంపేటలో బాలికల, బాలురలకు చెందిన హాస్టళ్లు ఇంక తెరుచుకోలేవు. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో ప్రారంభించలేదు. ప్రభుత్వ నిబందన ప్రకారం వంద మంది విద్యార్థులు ఉండాలని ఈ మేరకు తక్కువగా ఉండడంతో హాస్టల్లు ఇంకా ప్రారంభానికి నోచుకోవడం లేదని వారు చెబుతున్నారు. రెండు రోజుల్లో విడుదల చేస్తాం రెండు రోజుల్లో మెస్‌చార్జీలను చెల్లిస్తాం. ప్రభుత్వం నిధులను విడుదల చేసింది బిల్లు చేసి విడుదల చేస్తాం. స్కాలర్షిప్కు ఆధార్ కార్డు లింకు పెట్టడంతో విడుదలలో జాప్యం జరిగింది. కళాశాల మేనేజ్మెంట్ హాస్టళ్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని ప్రభుత్వం ఈ మధ్యనే డిపార్ట్మెంట్ అటాచ్మెంట్ హాస్టల్ (డీఏహెచ్) అనే నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ పద్దతిలో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఆధార్ కార్డు లింకు అవసరం లేదు. మెస్‌చార్జీలు విద్యార్థులకు అందుతాయి. జిల్లాలో ప్రస్తుతం 11 కాలేజీ హాస్టళ్లు నడుస్తున్నాయి. - వి.జయప్రకాష్, డీడీ, సాంఘీక సంక్షేమ శాఖ