రాయలసీమ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం
సాక్షి, కర్నూలు(గాయత్రీ ఎస్టేట్) : రాయలసీమ విశ్వవిద్యాలయం హాస్టళ్లలో ఇష్టారాజ్యంగా మెస్ బిల్లులు వసూలు చేస్తుండడంతో విద్యార్థులు హాస్టల్ పేరు చెబితేనే హడలిపోతున్నారు. హాస్టళ్లలో ప్రొవిజన్స్, కూరగాయలు, చికెన్, పాలు, నీటి సరఫరాకు ఎలాంటి టెండర్లు లేకుండా పర్చేజ్ కమిటీ అనామతుగా బిల్లలు చెల్లిస్తుండడంతో విద్యార్థులకు బిల్లుల భారం పెరుగుతోంది. ఏడాదికి అదనంగా రూ.15 లక్షలు అదనపు భారం పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పటి వరకు హాస్టళ్లకు సంబంధించి ప్రొవిజన్స్, కూరగాయలు, పాలు తదితర వాటికి ఎలాంటి టెండర్లు పిలవలేదు. ప్రస్తుతం మెస్ నిర్వహణ కోసం 15 రోజులకు సరిపడా వస్తువులను కొనుగోలు చేశారు.
టెండర్ల ఊసే లేదు..
విశ్వవిద్యాలయంలో మూడు మెన్స్ హాస్టళ్లు, రెండు ఉమెన్స్ హాస్టళ్లున్నాయి. గతేడాది 330 మంది అబ్బాయిలు, 335 మంది అమ్మాయిలు హాస్టళ్లలో ఉన్నారు. నెలకు సరిపడా ప్రొవిజన్స్‌కు రూ.7లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రొవిజన్లకు సంబంధించి 2016 టెండర్లు పిలిచారు. అప్పుడు కూడా ఒక నెలకు మాత్రమే అని నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పుడు ఎవరైతే టెండర్లలో దక్కించుకున్నారో వారినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక కూరగాయలు, పాలు, నీటి సరఫరాకు సంబంధించి వర్సిటీ ఏర్పటి నుంచి అయిన వారికే అప్పగిస్తున్నారు. ఇందులో వర్సిటీ కీలక అధికారులకు పర్సెంటేజీలు అందుతుండటంతో టెండర్లు లేకుండానే హాస్టళ్లను నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి.
విద్యార్థులపై భారం..
వర్సిటీలోని ఆరు హాస్టళ్లలో 665 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి నెలకు ఒక్కొక్కరికి రూ.2000 నుంచి రూ.2500 వరకు మెస్ బిల్లు వస్తుంది. అయితే స్కాలర్‌షిప్ కోర్సు, కేటగిరిని బట్టి ఏడాదికి రూ.5400 నుంచి రూ. 7000 వరకు వస్తుంది. మిగతాది విద్యార్థులు చేతి నుంచి చెల్లించాల్సిందే. టెండర్ల ద్వారా ఏజెన్సీలను పిలిచి తక్కువ ధరలకు కోట్ చేసినవారికి బాధ్యతలు అప్పగిస్తే విద్యార్థులపై మెస్ బిల్లుల బారం తగ్గుతుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
నివేదిక ఇవ్వని విచారణ కమిటీ
గత విద్యా సంవత్సరం హాస్టళ్ల ప్రొవిజన్స్, కూరగాయల కొనుగోలు తదితర వాటిల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని దానిపై విచారణ చేయించాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. దీంతో వర్సిటీ ఉన్నతాధికారులు ఆర్‌యూ ఈసీ మెంబర్ ప్రొఫెసర్ సంజీవరావు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ విశ్వనాథ«రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ సుబ్బారెడ్డితో కమిటీ నియమించారు. అయితే ఈ కమిటీ ఇప్పటికీ ఎలాంటి నివేదిక సమర్పించలేదు.
త్వరలో టెండర్లు పిలుస్తాం
హాస్టల్స్‌కు ప్రొవిజన్స్, కూరగాయలు సరఫరా చేయడానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేస్తాం. ఉన్నవారితోనే మార్కెట్ ధరలకు అనుగుణంగా వస్తువులను సరఫరా చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక్కడి పరిస్థితులకు భయపడి వస్తువులను సరఫరా చేయడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ సారి పర్చేజ్ కమిటీతో పాటు, విద్యార్థుల సమక్షంలోనే టెండర్లు ఓపెన్ చేస్తాం.
– ప్రొఫెసర్ అమర్‌నాథ్, రిజిస్ట్రార్
Comments
Please login to add a commentAdd a comment