సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్
ఓ ప్రైవేటు కార్పొరేట్ కళాశాల కరోనా సమయంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వివిధ రకాల ఫీజులు పేరుతో వసూళ్లకు తెగబడుతోంది. నీట్ పరీక్షలు సమీపిస్తుండడంతో ఆ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు మెస్సేజ్‌లు పంపి బ్లాక్‌మెయిల్ చేస్తోంది. హాస్టల్ మూసివేసినా మెస్ బిల్ కట్టాలని, లేకపోతే మెటీరియల్, బట్టలు, సర్టిఫికెట్లు ఇవ్వమంటూ బెదరగొడుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ నాయకునికి చెంది జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రముఖ కార్పొరేట్ కళాశాల శాఖల్లో సుమారు 12వేల మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్నారు. కరోనా కేసుల నేపథ్యంలో మార్చి 22 నుంచి కళాశాల, వసతి గృహాలను మూసివేసి విద్యార్థులను వారి ఇళ్లకు పంపేశారు. హాస్టల్‌లో ఉన్న మెటీరియల్, వివిధ సర్టిఫికెట్స్, బట్టలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి పంపేశారు. కరోనా ఉధృతి తగ్గకపోవడంతో కళాశాలలు తెరుచుకోలేదు. విద్యార్థులు ఇళ్ల వద్దే ఉండిపోవడంతో కొన్ని రోజుల తరువాత ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు.ఇందుకు ప్రత్యేకంగా ఫీజులు కూడా వసూలు చేశారు.
భోజనం పెట్టకపోయినా మెస్ బిల్లులు కట్టాలట!
లాక్ డౌన్ నేపథ్యంతో కళాశాలలు, వసతి గృహాలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. అయినా ఆ కళాశాల యాజమాన్యం లాక్‌డౌన్ సమయంలో కూడా మెస్ బిల్లులు చెల్లించాలంటూ విద్యార్థుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపడంతో బిత్తరపోయారు. అంతేకాకుండా మెస్ బిల్లు చెల్లిస్తే తప్ప హాస్టల్‌లో ఉన్న మెటీరియల్, గదుల్లోని బట్టలు, సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేది లేదని మెస్సేజ్ ఇవ్వడంతో హడలిపోయారు. నీట్ పరీక్షలకు స్టడీ మెటీరియల్ కోసం కళాశాల వద్దకెళితే హాస్టల్‌కి తాళాలు వేసి లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని విద్యార్థులు లబోదిబోమంటున్నారు. నాలుగు నెలలుగా ప్రదక్షిణలు చేస్తున్నా కళాశాల యాజమాన్యం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందాన తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోయారు. మెస్ బిల్లులు చెల్లిస్తే తప్ప హాస్టల్‌లో ఉన్న వస్తువులు తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment