ఎన్నో ఆశలతో సంక్షేమ వసతి గృహాలకు వస్తున్న విద్యార్థులకు మెస్ బిల్లులు అందక పస్తులతో గడుపుతున్నారు. విద్యార్థుల నిర్వహణలో నడుస్తున్న వీటికి బకాయిలు పేరుకున్నాయి. దీంతో స్టూడెంట్లు బువ్వకు మొహంవాస్తున్నారు. అప్పులతో వంట నడిపిస్తున్నారు. కొందరు బంధువుల ఇళ్లల్లో కాలంగడిపేస్తున్నారు. లేదా బయట తింటూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: జిల్లాలోని సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాలకు సంబంధించి మెస్‌చార్జీల బకాయిలు విడుదల కాకపోడంతో వీటిని ఆశ్రయించి చదువుకుంటున్న విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంనుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో స్టూడెంట్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీనితో సంక్షేమ శాఖ విద్యార్థి నిర్వహణ హాస్టళ్లకు భోజనం పెట్టించే విషయంలో చేతులెత్తేసింది. ఈ విషయంపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా జిల్లా ఉన్నతాధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు.
జిల్లాలో ప్రభుత్వ నిర్వహణలో నడిచే హాస్టళ్లకు పౌర సరఫరాల శాఖ నెల నెలా బియ్యం పంపిణీ చేయగా కూరగాయలు, ఇతర నిత్యావసరాల కొనుగోళ్లకు ప్రభుత్వం నిధులిస్తుంది. కానీ జిల్లాలో విద్యార్థులు నడుపుకొనే 21 హాస్టళ్లలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. వీటికి బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయగా కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్లకు సర్కారు నిధులివ్వదు. ప్రభుత్వం ఇచ్చే మెస్‌చార్జీలను పోగేసి ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలు కొంటారు. నిబంధనల ప్రకారం ప్రతీ విద్యార్థికి 1,050 చొప్పున మెస్ చార్జీలుగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఎస్సీ కళాశాల మేనేజ్‌మెంట్ హాస్టళ్లు 21 ఉండగా వీటిలో మొత్తం 1600 వందల మంది విద్యార్థులు ఉన్నారు. ఒక పూట తిని మరో పూట పస్తులుంటూ చదువులు సాగిస్తున్నారు. ఇంత మంది విద్యార్థులకు రూ.కోటి 68 లక్షలకుపైగా మెస్‌చార్జీలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.
అప్పులతో నడుస్తున్న అన్నం...
ఈ మొత్తం ఏదో ఒక రోజు వస్తుందన్న ఆశతో అప్పులు చేసి నిర్వహిస్తునానరు. ఇలా జిల్లాలో ప్రతీ హాస్టల్‌లో కిరాణా బకాయిలు రూ. 3 నుంచి రూ.4 లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బకాయిలు చాంతాడంత పెరుగుపోతోందని ఇక బిల్లులు చెల్లించనిదే కిరాణా సరకులను ఇవ్వలేమని వాటి యాజమానులు తేల్చిచెబుతున్నారు. ఇంటి నుంచి ఉప్పు, పప్పు, బియ్యం తెస్తేనే భోజనం. లేకుంటే సొంత ఖర్చుతో బయట హోటళ్లలో తింటున్నారు. లేదంటే బంధువులు, స్నేహితుల ఇండ్లలో గడిపేస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు బయట హోటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. బయట తినే వారికి ఖర్చు చేయిదాటుతోంది.
ఇది మరో సమస్య...
ఉన్న హాస్టళ్లు అలా సతమవుతుంటే మరికొన్ని మంజూరైనా ప్రారంభానికి నోచుకోవడం లేదు. జిల్లాలో సొంతంగా నిర్వహించుకొనే హాస్టళ్లు 21 ఉన్నాయి. ఆరు హాస్టళ్లు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. నడుస్తున్న జడ్చర్ల బాలికల హాస్టల్ ఈ మధ్యనే మూతపడింది. కొల్లాపూర్‌లో 2 ( బాలుర 1, బాలిక1) షాద్‌నగర్ బాలికల, కల్వకుర్తిలో బాలికల, అచ్చంపేటలో బాలికల, బాలురలకు చెందిన హాస్టళ్లు ఇంక తెరుచుకోలేవు. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో ప్రారంభించలేదు. ప్రభుత్వ నిబందన ప్రకారం వంద మంది విద్యార్థులు ఉండాలని ఈ మేరకు తక్కువగా ఉండడంతో హాస్టల్లు ఇంకా ప్రారంభానికి నోచుకోవడం లేదని వారు చెబుతున్నారు.
రెండు రోజుల్లో విడుదల చేస్తాం
రెండు రోజుల్లో మెస్‌చార్జీలను చెల్లిస్తాం. ప్రభుత్వం నిధులను విడుదల చేసింది బిల్లు చేసి విడుదల చేస్తాం. స్కాలర్‌షిప్‌కు ఆధార్ కార్డు లింకు పెట్టడంతో విడుదలలో జాప్యం జరిగింది. కళాశాల మేనేజ్‌మెంట్ హాస్టళ్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని ప్రభుత్వం ఈ మధ్యనే డిపార్ట్‌మెంట్ అటాచ్‌మెంట్ హాస్టల్ (డీఏహెచ్) అనే నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ పద్దతిలో స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఆధార్ కార్డు లింకు అవసరం లేదు. మెస్‌చార్జీలు విద్యార్థులకు అందుతాయి. జిల్లాలో ప్రస్తుతం 11 కాలేజీ హాస్టళ్లు నడుస్తున్నాయి.
- వి.జయప్రకాష్,
డీడీ, సాంఘీక సంక్షేమ శాఖ
సారీ బువ్వ పెట్టలేం..!
Published Sat, Jan 18 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement