భోజనంఅధ్వానం
=సక్రమంగా అమలుకాని మధ్యాహ్న భోజన పథకం
=మెనూలో మాయమవుతున్న గుడ్డు
=కూరగాయల స్థానంలో పలచని సాంబారు
బడిఈడు పిల్లల చదువుకునే హక్కు ఆకలి మంటల్లో అణగారిపోరాదన్న సంకల్పంతో మధ్యాహ్నభోజన పథకం రూపుదాల్చింది. భోజ నం తయారీ ఖర్చులు, వంటశాలల నిర్మాణం, పథకం విస్తరణ సహా వివిధ అంశాల్లో ప్రభుత్వం వైఫల్యం సుస్పష్టం. అందుకే విద్యార్థులకు నాసిరకం ఆహారం దక్కుతోంది. పోషకాహారానికి అతీగతీ లేకుండాపోతోంది. చాలా పాఠశాలల్లో నీళ్ల చారుతోనే సరిపెడుతున్నారు. నామమాత్రపు నిధుల కేటాయింపు, కంటితుడుపు పర్యవేక్షణతో ఈ పథకం అఘోరిస్తోంది.
నక్కపల్లి,న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేదు. విద్యార్థులకు పౌష్టికాహారం అందడంలేదు. కొన్ని పాఠశాలల్లో భోజనం తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తిన్నా కడుపు నిండటంలేదంటున్నారు. పర్యవేక్షణ లోపంతో వారానికి రెండుసార్లు గుడ్డు పెట్టడం లేదు. సరఫరా చేస్తున్న బియ్యంలో నాణ్యతలోపిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు, నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. భోజనం తయారీకి వంటషెడ్లులేక, సకాలంలో బిల్లులు అందక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు.
నవంబరు నుంచి వీరికి బిల్లులు చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని 4170 ప్రాథమిక,ప్రాథమికోన్నత, జెడ్పీ పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. 1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు రోజుకు రూ.4.35పైసలు,7నుంచి10 వ తరగతి విద్యార్థులకు రూ.6లు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ధరకు ఒక ఇడ్లీ కూడా రాదు. ప్రాథమిక తరగతులు విద్యార్థులకు రోజుకు 100గ్రాముల బియ్యం,5 గ్రాముల నూనె,20 గ్రాముల పప్పు,50గ్రాములు కూరగాయలు, యూపీ పాఠశాలల విద్యార్థులకు 150 గ్రాముల బియ్యం,30 గ్రాముల పప్పు,75 గ్రాముల కూరగాయలుపెట్టాలని ప్రభుత్వం పేర్కొంది. ఆమేరకు మెస్ చార్జీలు చెల్లిస్తోంది.
ఈ ప్రకారం విద్యార్థుల కడుపు నిండటం లేదు. కిలో బియ్యాన్ని పది మందికి సర్దడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారానికి రెండు సార్లు పెట్టే గుడ్డుకు ప్రభుత్వం ఎటువంటి చెల్లింపులు లేవని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రస్తుతం గుడ్డుధర నాలుగు నుంచి ఐదు రూపాయలు ఉందని, 300 పైబడి విద్యార్థులున్న పాఠశాలలో గుడ్ల కోసం అయ్యే ఖర్చంతా నిర్వాహకులే భరించాల్సి వస్తోంది. జిల్లా అంతటా ఒకే విధంగా మెనూ అమలు కావడం లేదు. నిర్వాహకులను బట్టి ఒక్కో పాఠశాలలో ఒక్కోలా ఉంటోంది. ప్రతి సోమ, గురువారాల్లో గుడ్డు పెట్టాల్సి ఉండగా కొన్ని పాఠశాలల్లో కానరావడం లేదు.
నక్కపల్లి మండలంలో కొందరు విద్యార్థులు ఇళ ్లనుంచి కూరలు, కేరేజీలు తెచ్చుకునే దుస్థితి. దోసలపాడు పాఠశాలలో గురువారం గుడ్డుపెట్టాల్సి ఉండగా సాంబారు అన్నం మాత్రమే పెట్టారు. ఈ పాఠశాలలో ప్రతి బుధవారం గుడ్డు పెడుతున్నట్టు చార్టులో పేర్కొన్నారు. క్రిస్మస్ పండగ కావడంతో బుధవారం పాఠశాలకు సెలవు. గురువారం కూడా పెట్టలేదు. పాయకరావుపేట నాగనరసింహ పాఠశాలలో కూడా గురువారం గుడ్డుపెట్టలేదు. చాలా పాఠశాలల్లో వంటషెడ్లు లేవు. తరగతి గదుల పక్కనే కట్టెల పొయ్యిలతో వండుతున్నారు.
పొగకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నక్కపల్లి జెడ్పీ బాలికల ఉన్నతపాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒకవైపు తరగతి గది, మరోవైపు కట్టెలపోయ్యి ఉంటోంది. ఎస్‌రాయవరంమండలం వమ్మవరం పాఠశాలలో వంటషెడ్‌లేక ఇంటిదగ్గర భోజనం తయారు చేసి తెస్తున్నారు. ఈ భోజనం ముద్దగా ఉంటోందని తింటే కడుపునొప్పి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. కొన్ని పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. ఇళ్ల నుంచి బాటిళ్లతో నీరు తెచ్చుకుంటున్నారు.