న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు నూతన జవసత్వాలు తీసుకొచ్చే దిశగా కసరత్తు జరుగుతోంది. గ్రూపు పరిధిలో 100 వరకు కంపెనీలుండగా, వీటిల్లో 30 మాత్రమే లిస్టయి ఉన్నాయి. వీటికి అదనంగా 1,000 వరకు సబ్సిడరీ కంపెనీలు కూడా ఉన్నాయి. భారీ సంఖ్యలో కంపెనీలు ఉండటంతో ఏవో కొన్ని మినహాయిస్తే మిగిలినవి అంతగా రాణించడం లేదు. దీంతో చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో గ్రూపు కంపెనీలను 10 వెర్టికల్స్‌గా వర్గీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఒకే తరహా వ్యాపారాల్లో ఉన్న వాటిని ఓ విభాగం కిందకు తీసుకురావాలని, తద్వారా వాటి మధ్య మంచి సమన్వయం కల్పించడం ద్వారా ఖర్చులను ఆదా చేసుకోవడంతో పాటు సమర్థతను పెంచొచ్చని యాజమాన్యం భావిస్తోంది.
హోల్డింగ్ కంపెనీల ప్రతినిధులు ఆయా వెర్టికల్స్‌గా అధిపతిగా వ్యవహరిస్తారు. తద్వారా కంపెనీల మధ్య సమన్వయం పెరిగేలా, కార్యకలాపాలు సాఫీగా నడిచేలా చూస్తారు. టాటా మోటార్స్ ఇటీవలే జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు సంబంధించి రూ.3.1 బిలియన్ డాలర్లను నష్టం కింద ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్యను చురుకైన, శక్తిమంతమైన ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసి, వేగవంతమైన వృద్ధిని అందుకునేందుకు చేపట్టినదిగా చంద్రశేఖరన్ ఆ సందర్భంలో పేర్కొన్నారు. ప్రతీ వెర్టికల్‌కు హెడ్‌గా వ్యవహరించే వ్యక్తి ఆ విభాగంలోని కంపెనీల మధ్య సమన్వయ కర్త పాత్రను పోషించనున్నారు. ఈ వ్యక్తి టాటా సన్స్ బోర్డు సభ్యుడై ఉండనక్కర్లేదని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.
ఫలితమిచ్చేనా..?
‘‘వెర్టికల్‌గా వర్గీకరించడం అనేది సమర్థతలను తీసుకొస్తుంది. ఒకే తరహా వ్యాపారాల మధ్య సహకారం, సమన్వయానికి వీలు కల్పిస్తుంది. దీంతో నిర్వహణ మెరుగవుతుంది. అయితే, ఈ స్థిరీకరణ అనేది విడిగా కంపెనీలకున్న నిర్వహణ పరమైన స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదు’’ అని బిర్లా సన్‌లైఫ్ అస్సెట్ మేనేజ్‌మెంట్ సీఈవో ఎ.బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ పునర్నిర్మాణ పై కసరత్తు జరుగుతున్నట్లు టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ ఒకరు ధ్రువీకరించారు. ఈ అంశాలు వేగంగా పరిష్కారమయ్యేవి కావని, కొన్నింటి పరిష్కారానికి కొన్ని నెలలు లేదా ఏడాది పట్టొచ్చన్నారు.
‘‘కొన్ని వ్యాపార సులభతరం కోసం దృష్టి పెట్టినవి. మరికొన్ని వాటి పరిధి విస్తరణ కోసం. 2018లో రుణ భారం తగ్గించుకునేందుకు, టాటా కంపెనీల పునర్నిర్మాణానికి, ఒక కంపెనీల్లో మరో కంపెనీకి ఉన్న వాటాల స్థిరీకరణకు, కీలక ఆస్తుల కొనుగోలుకు రూ.70,000 కోట్లు ఖర్చు చేశాం’’ అని టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. నూతన నిర్మాణం కీలక వ్యాపారాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు సాయపడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment