జిల్లాకు నేడు కాంగ్రెస్ అగ్రనేతలు
ఉత్తమ్, జానా, భట్టి, పొన్నాల..
మరో 20 మంది కీలక నేతలూ..
నాలుగు నియోజక వర్గాల్లో సమావేశాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక పోరు మొదలవుతోంది. అన్ని పార్టీలు అంతర్గతంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ విషయంలో ఒకడుగు ముందుకు వేసింది. వరంగల్ లోక్‌సభ, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ మొదలుపెట్టింది. కాంగ్రెస్ రాష్ట్రస్థాయి కీలక నేతలు గురువారం లాంఛనంగా ప్రచారం ప్రారంభిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం లక్ష్యంగా గురువారం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాన్ని సంయుక్తంగా కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో సమావేశం జరగనుంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ వరంగల్ ఎన్నికలో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు సాధించడం లక్ష్యంగా ఇందులో చర్చించనున్నారు. పీసీసీ ముఖ్యనేతలు.. ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలను కాంగ్రెస్ శ్రేణులకు అప్పగించే అవకాశం ఉంది.
వర్ధన్నపేట, పరకాలలోనూ..
గ్రేటర్ వరంగల్‌లో భాగంగా ఉన్న వర్ధన్నపేట, పరకాల అసెంబ్లీ సెగ్మెంట్ల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు గురువారమే ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జరుగనున్నాయి. వర్ధన్నపేటలోని లక్ష్మీ గార్డెన్స్‌లో ఈ నియోజకవర్గ కార్యకర్తల విసృతస్థాయి సమావేశం జరుగుతుంది. పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఈ సమావేశానికి ముఖ్యఅతి థిగా హాజరవుతున్నారు. సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు భారీ మెజారిటీ వచ్చిన ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టే అకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చ జరగనుందని తెలుస్తోంది. పరకాల అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఈ నియోజకవర్గ కేంద్రంలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్స్‌లో జరుగనుంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ నియోజకవర్గ స మావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. లక్ష్మయ్యకు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో మిశ్రమ అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత ఏజెండాల ప్రస్తావన లేకుండా.. కాంగ్రెస్ బలోపేతం లక్ష్యంగా చర్చ జరగాలని నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
రెండు డౌటే..
పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు సం బంధించి కార్యకర్తల సమావేశాలు నిర్వహణ సందేహంగా మారింది. ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కీలక నేతల్లో విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగానే రెండు నియోజకవర్గాల సమావేశాలను వాయిదా వేశారు. ఎప్పుడు నిర్వహించే తేదీలను ప్రకటించలేదు. భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరగనుంది. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ తరుఫున ఆ పార్టీ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. నియోజకవర్గంలో పార్టీకి పూర్వవైభవం లక్ష్యంగా సమావేశంలో జానారెడ్డి కార్యకర్తలకు ఉద్భోదించనున్నారు. జానారెడ్డి గురువారమే జిల్లాకు వస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి గురువారం సాయంత్రం హన్మకొండలోని నందన గార్డెన్స్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. జానారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పీసీసీ ముఖ్యనేతలు కూడా ఈ ఇఫ్తార్‌కు హాజరవుతారు.
నియోజకవర్గాలవారీగా పీసీసీ బృందాలు
వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ : ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, జి.వివేక్, పి.బలరాంనాయక్, పి.సుధాకర్‌రెడ్డి, జి.నాగయ్య.
వర్ధన్నపేట : మల్లు భట్టి విక్రమార్క, ఎం.అంజన్‌కుమార్‌యాదవ్, సురేష్ షట్కర్, ఎం.ఎ.ఖాన్, ఎం.రంగారెడ్డి, జె.కుసుమకుమార్.
భూపాలపల్లి : కె.జానారెడ్డి, వి.హనుమంతరావు, నంది ఎల్లయ్య, జె.గీతారెడ్డి, ఫరూక్‌హుస్సేన్, పి.నర్సింహారెడ్డి.
పరకాల : పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, డి.కె.అరుణ, పొన్నం ప్రభాకర్, ఆకుల లలిత, సిజె.శ్రీనివాసరావు.
ఉప ఎన్నిక పోరు షురూ..
Published Thu, Jun 25 2015 9:33 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement