సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బీజేపీ-టీడీపీ పొత్తులపై ఢిల్లీలో కొనసాగుతున్న చర్చలు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తుంటే, జిల్లాలో మాత్రం టీడీపీ ఏకపక్షంగా వెళ్తోంది. పొత్తు ఖరారు కాకుండానే, జిల్లాలో ఏ సీటు ఎవరికో తేలకుండానే టీడీపీ నాయకుడు రాథోడ్ రమేష్ ఏకంగా
నామినేషన్ల పర్వానికి తెర లేపడంపై బీజేపీ శ్రేణులు రగులుతున్నాయి. సీట్లు ఖరారు కాకుండానే ఇలా టీడీపీ నామినేషన్లు వేయడం ఏంటని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు పార్టీల పొత్తు ఆదిలోనే వివాదానికి దారి తీస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. తొలిరోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి టీడీపీ ఎంపీ రాథోడ్ రమేష్ తన నామినేషన్ పత్రాలను ఆయన భార్య సుమన్ రాథోడ్‌తో దాఖలు చేయించారు. ఆయన కుమారుడు రితేష్‌తో కూడా ఈ స్థానానికి నామినేషన్ వేయించారు. మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే స్థానానికి కూడా ఆయనతోపాటు, కొడుకు రితేష్‌తో నామినేషన్ వేయించారు. ఆసిఫాబాద్ స్థానానికి కూడా రాథోడ్ రమేష్ నామినేషన్ వేయడం గమనార్హం. ఇలా రాథోడ్, తన కుమారుడు కలిపి జిల్లాలో మూడు స్థానాలకు నామినేషన్లు వేశారు. ఈ మూడింటిలో ఆదిలాబాద్ ఎంపీ, ఖానాపూర్ ఎమ్మెల్యే టీడీపీ సిట్టింగ్ స్థానాలు. వీటితోపాటు ఆసిఫాబాద్ స్థానానికి కూడా నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ల వ్యవహారంపై ఈ మూడు నియోజకవర్గాల నుంచి బీజేపీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న నాయకులు, వారి అనుచరులు రగిలిపోతున్నారు.
ఈ విషయమై వారు బీజేపీ జిల్లా ముఖ్య నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకవైపు పొత్తుపై పార్టీ ముఖ్యనేతలు చర్చలు కొలిక్కి వస్తున్న తరుణంలో రాథోడ్ ఒంటెత్తు పోకడలకు వెళ్లడం ఏంటని కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిరోజు చూసుకుని ఆయా స్థానాల్లో టీడీపీకి ధీటుగా నామినేషన్లు వేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. రాథోడ్ రమేష్ వ్యవహార శైలి ఏమాత్రం సహించేదిగా లేదని బీజేపీ జాతీయ నాయకుడు, జిల్లా ఇన్‌చార్జి మురళీధర్‌గౌడ్ ‘సాక్షి ప్రతినిధి’తో పేర్కొన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమని భావించే రాథోడ్ మొదటి నుంచి పొత్తు మంత్రాలు జపించారని విమర్శించారు. ఇప్పుడు ఇలా వ్యవహరించడాన్ని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. అవసరమైతే టీడీపీతో పొత్తు నుంచి జిల్లాను మినహాయించాలని అధిష్టానం దృష్టికి తీసుకెళతానన్నారు. పొత్తుల చర్చలు కొనసాగుతుండగానే రాథోడ్ రమేష్ నామినేషన్లు వేసిన వ్యవహరాన్ని మా పార్టీ ముఖ్య నాయకులకు ఫిర్యాదు చేస్తాం. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ మాట్లాడాను.
అనధికారికంగా వేశాం : రాథోడ్ రమేష్, ఎంపీ అభ్యర్థి
నామినేషన్లు వేసేందుకు నేను వెళ్లలేదు. మంచి రోజు ఉందనే ఉద్దేశంతోనే బుధవారం నామినేషన్లు వేయించాను. బీజేపీతో పొత్తు ఖరారయ్యాక అధికారికంగా మళ్లీ నామినేషన్లు వేస్తాం. ఇందులో తప్పేమీలేదు.
ఆదిలోనే వివాదం
Published Thu, Apr 3 2014 2:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM
Advertisement
Advertisement