టీడీపీ-బీజేపీ సెపరూట్
- ఎవరి దారి వారిదే!
- {శేణుల మధ్య సఖ్యత కరువు
- పరస్పరం సహాయ నిరాకరణ
- పలుచోట్ల అభ్యర్థుల ఎదురీత
- {పచారంలో అంటీముట్టని క్యాడర్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ- తెలుగుదేశం మధ్య పొత్తు చిత్తవుతోంది. మిత్రపక్షాలుగా కలిసి పనిచేయాల్సిన ఇరు పార్టీల మధ్య రోజు రోజుకూ మరింత అగాథం ఏర్పడుతోంది. ఇప్పటికే ఎడముఖం.. పెడముఖంగా ఉన్న ఇరు పార్టీల నేతలు పరస్పరం సహాయ నిరాకరణతో ప్రచారపర్వంలో ఎదురీదుతున్నారు. ముఖ్యనేతలు, కార్యకర్తలు కలిసి రాకపోవడంతో అభ్యర్థుల ప్రచారం గల్లీలు దాటడం లేదు.
ఈ పరిస్థితి అభ్యర్థులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. పొత్తు మేరకు కలిసికట్టుగా సార్వత్రిక సంగ్రామంలో దూకాల్సిన ఇరు పార్టీలు.. క్షేత్రస్థాయిలో తలోదారి పట్టాయి. బీజేపీ అభ్యర్థుల పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలు డుమ్మా కొడుతున్నారు. టీడీపీ బరిలో ఉన్న సనత్‌నగర్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో బీజేపీ శ్రేణుల జాడ కనిపించట్లేదు. తమకు సీటు దక్కని స్థానంలో మరొకరికి తరపున ప్రచారం చేయడానికి ఇరు పార్టీల్లోని ముఖ్య నేతలు ముఖం చాటేస్తున్నారు.
ఒకరి ఓటమికి మరొకరు అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. ఒకటీ అరా చోట్ల టీడీపీ, బీజేపీ ముఖ్యనేతలు ప్రచారం, పాదయాత్రల్లో పైకి సఖ్యత ప్రదర్శిస్తున్నా.. వాటికి తమ అనుచరులు, క్యాడర్‌ను మాత్రం రానివ్వట్లేదు. ఖైరతాబాద్, గోషామహల్, ముషీరాబాద్, మలక్‌పేట, ఉప్పల్ స్థానాల్లో బీజేపీ పాగావేస్తే భవిష్యత్‌లో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న భావనతో అక్కడి టీడీపీ నేతలు కావాలనే దూరంగా ఉంటున్నారని సమాచారం.
కీలక స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులను ఓడిస్తే ఆ పార్టీకి ఇక్కడ బలం లేదని తేలిపోతుంది.. ఫలితంగా భవిష్యత్‌లో ఇక్కడ తమకు ఢోకా ఉండదనే ఆశతో పలువురు నేతలు అంటీముట్టనట్లు ఉంటున్నారు. ఉమ్మడి స్థానాల్లో అభ్యర్థులను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో కొందరు నేతలు ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేయాలంటూ అంతర్గత ప్రచారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎక్కడా పొసగని పొత్తు
సికింద్రాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ ఇప్పటికే సికింద్రాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ శ్రేణులు ఎక్కడా ఆయన వెంట నడవలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయరామారావు (టీడీపీ) అనుచరవర్గంలోని ఒక్కరూ దత్తాత్రేయ పర్యటనలో పాల్గొనలేదు. తన అనుచరుల్ని విజయరామారావు కావాలనే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పంపిస్తున్నట్టు ఆ పార్గీ నాయకులే చెబుతున్నారు. ఇక, చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్-బీజేపీ) వెంట వెళ్లేందుకు టీడీపీ క్యాడర్ ఆసక్తిచూపడం లేదు
అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి (బీజేపీ) ప్రచార కార్యక్రమానికి టీడీపీ నాయకుడు కృష్ణయాదవ్ హాజరైనా, ఆయన అనుచరులు, కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు
కార్వాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డి.. మిత్రపక్షమైన టీడీపీ సహాయ నిరాకరణతో ఒంటరిపోరు చేస్తున్నారు
గోషామహల్‌లో రెబల్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ బీజేపీకి గుబులు పుట్టిస్తున్నారు. ఇక్కడి టీడీపీ నేత ప్రేమ్‌కుమార్ దూత్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయన అనుచరవర్గమంతా అటువైపు వెళ్లింది. టీడీపీ మద్దతు కనీస స్థాయిలోనూ లేక రాజాసింగ్ (బీజేపీ) ఎదురీదుతున్నారు
ముషీరాబాద్ నియోజకవర్గంలో పట్టున్న ముఠా గోపాల్ టీఆర్‌ఎస్‌లో చేరికతో టీడీపీ క్యాడర్ ఖాళీ అయింది. ఇక్కడ మిగిలిన టీడీపీ నేత ఎమ్మెన్ శ్రీనివాస్ అంతంతగానే సహకరిస్తుండటం బీజేపీని ఇరుకున పడేస్తోంది
ఉప్పల్, మల్కాజిగిరి, యాకుత్‌పుర తదితర నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.