అరికెల, అరవింద్‌కుమార్ గౌడ్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. గురువారం మధ్యాహ్నం 3గంటల వరకే నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు కాగా, పార్టీ నేతలు, బీజేపీ నేతలతో చర్చల అనంతరం ఒంటి గంటకు నరేందర్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు.
2.30 గంటలకు శాసనసభా కార్యదర్శి, ఎన్నికల అధికారి రాజా సదారాంకు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని ఖరారు చేయడంతో టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. పార్టీని నమ్ముకొని ఉన్న తనకు అన్యాయం జరిగిందని సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అరవింద్‌కుమార్ గౌడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా పార్టీకి గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం.
మేమే గెలుస్తం: ‘టీడీపీ, బీజేపీకి ఉన్న సీట్లు 20. మావోళ్లు నలుగురు టీఆర్‌ఎస్‌లో చేరినా 16 సీట్లు మాయే. ఎమ్మెల్సీ గెలవాలంటే ఇంకో ఇద్దరే కావాలి. అవసరమైతే వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం సభ్యుల మద్దతు కోరతాం. అదే టీఆర్‌ఎస్ ఐదో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే కనీసం 8 మంది కావాలి. అవకాశాలు మాకే ఎక్కువ’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.
టీడీపీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి
Published Fri, May 22 2015 3:41 AM | Last Updated on Wed, Oct 3 2018 7:34 PM
Advertisement
Advertisement