
జడ్చర్లలో సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు (ఇన్‌సెట్‌లో) ఉం.చంద్రశేఖర్
జడ్చర్ల టౌన్/మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : తెలుగుదేశం పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు అధికార పార్టీపై పదునైన విమర్శలు చేస్తుండడంతో ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి దక్కిందని చెబుతున్నారు. జిల్లాలో ముదిరాజ్‌ల ఓటు బ్యాంకు గణనీయంగా ఉండడం కూడా ఇదే కులానికి చెందిన చంద్రశేఖర్‌కు కలిసొచ్చినట్లయింది.
ఎంపీపీగా తొలి అడుగులు
చిన్నచింత కుంట ఎంపీపీగా 1995కు ముందు చంద్రశేఖర్ వ్యవహరించారు. జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న ఎర్ర సత్యం(ఎం.సత్యనారాయణ) 1995 ఆగస్టు 12 హత్యకు గురికాగా 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆయన ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2009లో మరో రెండు సార్లు భారీ మెజార్టీతోనే ఎమెల్యేగా విజయం సాధించిన ఆయన.. 2014 మినహా అన్నిసార్లు ప్రత్యర్థికి గట్టి పోటి ఇచ్చారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ఘనత చంద్రశేఖర్‌కు ఉంది.
పార్టీకి పూర్వవైభవం తెస్తా ..
అ«ధిష్టానం తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన శుక్రవారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. అధికారపార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికపుడు ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
మూడు పార్టీల అధ్యక్షులు జడ్చర్ల నుంచే..
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్, వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు మరియమ్మ జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన వారే. ఇప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి సైతం జడ్చర్ల నియోజకవర్గానికే చెందిన చంద్రశేఖర్‌కే దక్కడం విశేషం. కాగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎం.చంద్రశేఖర్ నియామకం ఖరారు కావడంతో శుక్రవారం రాత్రి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీడీపీ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు కరాటే శ్రీను, నాయకులు మనోహర్, పర్శవేది, మురళి, వాజిద్, ఆంజనేయులు, రాజు, అనీల్, కేశవులు, నరేంద్ర, సునీల్, జావెద్, కిషన్ పాల్గొన్నారు.