రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పాలమూరు ప్రాంతాన్ని వలసలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చిన కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లు అడిగే హక్కే లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. 60 ఏళ్లు పరిపాలించిన ఈ రెండు పార్టీలు జిల్లా అభివృద్ధి విషయంలో కనీస ఆలోచన చేసిన దాఖలాలు లేవన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ.. వారి స్వలాభం కోసం రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. ఈ మేరకు ప్రజలు కర్రుకాల్చి ఆ రెండు పార్టీలకు వాత పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని తెలిపారు. అంతేకాదు మహాకూటమిగా ముసుగు వేసుకుని వస్తున్న మాయాకూటమి విఫలమైందన్నారు. సీట్ల పంపిణీ చేసుకోవడం చేతకాని వారు పరిపాలన ఎట్లా చేస్తారని లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లలో పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి చూపించిన టీఆర్‌ఎస్ జెండా మళ్లీ రెపరెపలాడడం ఖాయమన్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలను క్లీన్‌స్వీప్ చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి లక్ష్మారెడ్డి పలు అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
బ్రహ్మాండంగా ఎన్నికల ప్రచారం :
ఎన్నికల ప్రచారం చాలా బ్రహ్మండంగా సాగుతోంది. ఇప్పటికే రెండున్నర నెలలుగా ప్రచారంలో నిమగ్నమయ్యాం. ప్రతీ అభ్యర్థి కూడా నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. చాలా చోట్ల పార్టీకి మంచి స్పందన వస్తుంది. టీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించుకోవాలనే కసి ప్రజల్లో కనిపిస్తోంది. మరోసారి సీఎంగా కేసీఆర్‌ను నిలబెట్టుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. ప్రచార అంశాల విషయానికొస్తే పాలమూరు ప్రాంతం అంటే కరువు, కాటకాలతో సతమతమయ్యేదనే ముద్ర పడింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వెనకబడిన ప్రాంతాల్లో పాలమూరు ఒకటి. ఇలా కావడానికి పాలకులే కారణం. ఎందుకంటే పాలమూరులో కూడా పుష్కలమైన వనరులు ఉన్నాయి. తలాఫున కృష్ణమ్మ పారుతున్నా సాగు, తాగునీరు అందించలేని అసమర్థ నాయకత్వం కారణంగా రైతులు, ప్రజలకు మేలు జరగలేదు. 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని అభివృద్ధిని మేము కేవలం నాలుగున్నర ఏళ్ల చేసి చూపించాం. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం.
వారి ధ్యాస రాజకీయాలపైనే..:
విపక్షనేతలకు ఎంతసేపు రాజకీయం చేయాలనే ధ్యాసే తప్ప.. అభివృద్ధిలో పాలు పంచుకోవాలనే ఆలోచన లేదు. టీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ 90శాతం నెరవేర్చింది. అంతేకాదు చెప్పని వాటిని కూడా సంక్షేమం రూపంలో తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందాం. రైతుబంధు, రైతు భీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో చేరువయ్యాయి. కేవలం ఒక్క డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకమే అనుకున్నమేర సాధించలేకపోయాం. రానున్న రోజుల్లో దానిని కూడా విజయవంతం చేస్తాం. ఇక పాలమూరు ప్రాంతం విషయానికొస్తే ఎవరూ చేయలేని అభివృద్ధి చేసి చూపించాం.
చిక్కులు సృష్టిస్తున్నా.. చాకచక్యంగా వెళ్తున్నాం :
కాంగ్రెస్ నేతలకు తప్పుడు మాటలు చెప్పడం మరేం చేతకాదు. ప్రాజెక్టులను వాళ్లు 90శాతం పూర్తి చేసినట్లయితే మిగిలిన పది శాతం పనులే అడ్డంకయ్యాయా? 60 ఏళ్లుగా వాళ్లు ఇలాంటి మోసపూరిత మాటలతోనే ప్రజలను మభ్యపెట్టారు. పాలమూరులో తీవ్ర వర్షాభావం వల్ల సాగయ్యే ప్రాంతం ఆశించినంతగా ఉండడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు పాలమూరు–రంగారెడ్డిని ప్రారంభించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు వస్తే ఏం చేయాలి? రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పనులు త్వరగా పూర్తయ్యేలా సహకరించాలి. కానీ వీళ్లేం చేశారు? ప్రతీ చిన్న విషయానికి కోర్టులకు వెళ్లి కేసులు వేశారు. ఫలితంగా మూడు, నాలుగేళ్లలో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు పనులు నెమ్మదించాయి. అయితే, వారు ఎన్ని చిక్కులు సృష్టిస్తున్నా... సీఎం కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తున్నారు.
కాంగ్రెస్‌కు నూకలు చెల్లినట్లే.. :
ఒక్క విషయం చెప్పాలంటే... పాలమూరులో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి. ఆ పార్టీ అభ్యర్థులకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే. మొత్తం 14 అసెంబ్లీ సీట్లలో విపక్షాలు ఒకటి, రెండు స్థానాలు గెలిచే అవకాశం కూడా లేదు. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. మొత్తం 14 స్థానాలు గెలవడం దాదాపు ఖాయమైంది.
ఏం పొత్తులో అర్థం కావడం లేదు :
ప్రస్తుతం పోటీ చేస్తున్నది మహాకూటమి కాదు.. విఫల కూటమి. పొత్తులో భాగంగా సీట్ల పంపిణీ చేసుకోవడం కూడా చేతకాని వారు పరిపాలన చేస్తారా? మహబూబ్‌నగర్‌లో కూటమిలోని రెండు పార్టీలు బరిలో నిలుస్తాయంట. ఇవేం పొత్తులో ఎవరికీ అర్థం కావడం లేదు. విపక్షాల బాధ అంతా.. టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకపోవడమే. దీంతోనే వారందరూ ఒక్కటవుతున్నారు. వారికి జెండా లేదు.. అజెండా లేదు.వారు చేస్తున్న ప్రయత్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. విపక్షాలన్నీ వంద మందితో కలిసి వచ్చినా... టీఆర్‌ఎస్ సింహం సింగిల్‌గానే ఎదుర్కొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment