టీడీపీ.. కాంగ్రెస్‌తో ఎప్పుడో కలిసింది | TDP has Already connected with Congress | Sakshi
Sakshi News home page

టీడీపీ.. కాంగ్రెస్‌తో ఎప్పుడో కలిసింది

Published Tue, Oct 31 2017 1:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TDP has Already connected with Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కాంగ్రెస్‌తో కలిసింది. ఎర్రన్నాయుడు, వేణుగోపాలాచారి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్ర మంత్రులుగా పనిచేసినప్పుడు ఉన్న యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి నాడు  కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. ఇప్పుడు నేను కాంగ్రెస్‌తో కలిస్తే తప్పేంటి? తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో నేను కాంగ్రెస్‌తో కలుస్తున్నా’’అని టీడీపీకి, కొడంగల్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణను గడీల పాలన నుంచి, కేసీఆర్‌ కబంధ హస్తాల నుంచి విముక్తి చేసేందుకు తెలంగాణ సమాజం తుది దశ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందుకే తెలంగాణ ప్రజల కోసం పునరంకితం అవుతున్నానని, 130 ఏళ్ల చరిత్ర ఉన్న, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ‘ఆత్మీయులు... మాట–ముచ్చట’పేరుతో రేవంత్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలు జిల్లాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న సమయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లురవి సభాప్రాంగణానికి వచ్చి కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా రేవంత్‌ను ఆహ్వానించారు.

కేసీఆర్‌ వేల కోట్లకు పడగలెత్తారు...
ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 500 ఎకరాల్లో ఫాంహౌస్, 10 ఎకరాల్లో గడీ ఏర్పాటు చేసుకొని వేల కోట్లకు పడగలెత్తారని, బాత్రూమ్‌కు కూడా బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దాలు పెట్టుకున్నారని ఆరోపించారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను తన కుటుంబ సభ్యులైన నలుగురి విలాస జీవితం కోసం పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన 14 ఏళ్లలో చెప్పిందేమిటి, 40 నెలల పాలనలో చేసిందేమిటని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి బర్రెలు, గొర్రెలు, చేపలు, బతుకమ్మ చీరలు ఇస్తున్నారని, వీటి కోసమా 1,200 మంది బలిదానం చేసుకున్నదని నిలదీశారు. 14 ఏళ్లలో ఎన్నడూ ప్రాజెక్టుల రీ డిజైనింగ్, కొత్త సచివాలయం, ఎమ్మెల్యేల కొనుగోళ్లు, వాటర్‌గ్రిడ్, 10 ఎకరాల్లో గడీ వంటి వాటి గురించి చెప్పకుండా ఇప్పుడు బరితెగించి దుర్మార్గాలకు పాల్పడుతూ గొప్పులు పోతున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఓయూ విద్యార్థులను నక్షత్రాలన్న కేసీఆర్‌...ఇప్పుడేమో చిల్లర పోరగాళ్లంటున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రజల కోసం తాను పునరంకితం కావాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు.

130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌లో చేరుతున్నా...
రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఐదు రాజకీయ పార్టీల్లో ఎంఐఎం ప్రత్యక్షంగా, టీడీపీ పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నాయని రేవంత్‌ పేర్కొన్నారు. బీజేపీ కూడా టీఆర్‌ఎస్‌కు నష్టం వస్తుందనే ఆలోచనతోనే టీడీపీతో పొత్తు వద్దంటోందన్నారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ ప్రత్యక్షంగా ఉంటే టీఆర్‌ఎస్‌ పరోక్షంగా ఉందని బీజేపీలోని ఓ పెద్ద నేత తనతో అన్నారని రేవంత్‌ చెప్పుకొచ్చారు. అందుకే తెలంగాణ సమాజం ఓ రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఆ నలుగురు ఒక దిక్కు... నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఒక దిక్కు ఉండాలని, బరిగీసి కలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నాలుగు పార్టీలు, నాలుగు జెండాలు ఉండడానికి వీల్లేదన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్‌తో కలబడేందుకు సిద్ధమైందని, అందుకే 130 ఏళ్ల చరిత్ర ఉన్న, 125 కోట్ల మంది భారతీయుల కోసం పనిచేస్తున్న రాహుల్‌ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నానంటూ ‘జై హింద్‌.. జై కాంగ్రెస్‌.. రాహుల్, సోనియాల నాయకత్వం వర్ధిల్లాలి’అని రేవంత్‌ ప్రసంగాన్ని ముగించారు.

అందరూ కాంగ్రెస్‌తో చేతులు కలపండి: ఉత్తమ్, మల్లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేన్నరేళ్లు అయ్యాక తాము దగా పడ్డామనే భావనకు అన్ని వర్గాల ప్రజలు వచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన... దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా కేసీఆర్‌ కుటుంబం అవినీతితో రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, తెలంగాణకు మేలు జరగాలంటే అందరూ కాంగ్రెస్‌తో చేతులు కలపాలని కోరారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను తరిమికొట్టేందుకు తెలంగాణ ఇచ్చిన పార్టీగా అందరూ కాంగ్రెస్‌లో చేరాలని విజ్ఞప్తి చేశారు. సోనియా ధృడ సంకల్పం, మాట నిలబెట్టుకునే తత్వంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఉత్తమ్‌ గుర్తుచేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి మాట్లాడుతూ తమ పార్టీ దెబ్బతిన్నా... ప్రజాస్వామ్యం బతకాలనే ఆలోచనతోనే నాడు సోనియా తెలంగాణను ఇచ్చారన్నారు. కానీ కేసీఆర్‌ మాత్రం ప్రజాస్వామ్య పునాదులపై దాడి చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాచరిక, నియంతృత్వ పాలనను ఎదిరించేందుకు రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement