'ప్రజలు రద్దు చేసిన పార్టీ.. టీడీపీ'
- ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ని రద్దు చేయాలని టీడీపీ నాయకులు రాష్ట్రపతిని కలిశారని, కానీ, తెలంగాణ ప్రజలు టీడీపీని ఎప్పుడో రద్దు చేశారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. నిత్యం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమే పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ను రద్దు చేయమన్న మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన పార్టీ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలు ఏ రాష్ట్రానికి చెందుతారో, అసలు మీరు ఏ పార్టీకి చెందినవారో ప్రజలు పూర్తిగా మరిచిపోయారని వ్యాఖ్యానించారు.
సర్పంచులపై టీడీపీ నేతలకు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందని, గతంలో రోడ్లపైకి వచ్చిన సర్పంచులను, ఇందిరాపార్కు వద్ద ధర్నా చే స్తున్న సర్పంచులను కొట్టించిన చరిత్ర వీళ్లదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో విజ్ఞతతో, విచక్షణతో పనిచేసిన దేవీప్రసాద్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయ న కోరారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన డాక్టర్ శాడగొండ కరుణాకర్‌రెడ్డి పక్కకు తప్పుకుని తమ పార్టీ అభ్యర్థులిద్దరికీ మద్దతు తెలుపుతున్నారని పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.