సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు త్వరలోనే గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వారికి ప్రభుత్వపరంగా ఎటువంటి అవకాశాలు లభిస్తాయనే దానిపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ.. కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో సత్తుపల్లిలో తమ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను బరిలో నిలిపింది.
ఆయన సుమారు 19వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా.. అశ్వారావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు 10వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు స్థానాల్లో విజయం సాధించడం.. వారిని టీఆర్‌ఎస్ గూటికి చేరిస్తే.. అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిధ్యమే ఉండ దన్న రాజకీయ వ్యూహంతో టీఆర్‌ఎస్ ప్రయ త్నిస్తోందని జిల్లాలో ప్రచారం హోరెత్తుతోంది. టీఆర్‌ఎస్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరే అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా సమావేశమై.. చర్చించినట్లు తెలుస్తోం ది.
ఉమ్మడి జిల్లాలో అసలే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీలోని ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారి తే జిల్లాలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆ పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. జిల్లా నుంచి కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో మూడు స్థానాల్లో పోటీ చేసి, రెండు స్థానాలను గెలుచుకోవడంతో పార్టీకి నూతన జవసత్వాలు వస్తాయని భావించిన కొద్దిరోజులకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ పార్టీ జిల్లా నేతల్లోనూ.. ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ నెలకొంది. ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకటవీరయ్య, మూడుసా ర్లు సత్తుపల్లిలో టీడీపీ నుంచి విజయం సాధించడంతో ఆయన ‘కారెక్కితే’ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్ నేతలు భరోసా ఇచ్చారని, అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
బాబును కలిసిన మెచ్చా..
ఈ నేపథ్యంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జిల్లాలోని రాజకీయ పరిణామా లు, టీఆర్‌ఎస్ నుంచి అంది న ఆహ్వానం తదితర అంశాలను శనివారం అమరావతిలో చంద్ర బాబును కలిసి వివరించినట్లు తెలుస్తోంది. గతంలోనూ టీడీపీ ఎమ్మె ల్యేగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారుతారని పలుమార్లు ప్రచా రం జరిగింది. అయితే జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, ప్రభుత్వపరంగా అవకాశాలు అందిపు చ్చుకునే పరిస్థితి ఉందనే రాజకీయ వ్యూహం తో పార్టీ మారే అంశంపై టీడీపీ నేత లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాములునాయక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఆ పార్టీలో చేరడం వల్ల కలిగే రాజకీయ అవకాశాలపై స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాలని టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేల ను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఇది జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నెలాఖరులోపు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్నా.. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం నర్మగర్భంగానే వ్యవహరిస్తుండడం విశేషం. ఇక పార్టీ మారే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తల తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని పార్టీ శ్రేణులకు వారు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment