సభలో దుమారం | TDP MLAs suspended from Telangana Assembly | Sakshi
Sakshi News home page

సభలో దుమారం

Published Fri, Nov 14 2014 12:31 AM | Last Updated on Sat, Aug 11 2018 6:44 PM

TDP MLAs suspended from Telangana Assembly

* రేవంత్ వ్యాఖ్యలపై మళ్లీ అట్టుడికిన తెలంగాణ అసెంబ్లీ  
* పది మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
* రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ అధికారపక్షం పట్టు
* బడ్జెట్‌పై చర్చలో పాల్గొనకుండా అడ్డుకున్న టీఆర్‌ఎస్ సభ్యులు
* పోడియంలోకి వెళ్లి నిరసన తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు
* సభలో మూడు గంటలపాటు నిలిచిపోయిన కార్యకలాపాలు
* సస్పెన్షన్‌కు మంత్రి హరీశ్ ప్రతిపాదన, ఆమోదించిన స్పీకర్
* పునరాలోచించాలని సూచించిన ఇతర పక్షాలు
* అసెంబ్లీ వెలుపల టీడీపీ నేతల ధర్నా, అరెస్ట్
* కావాలనే బడ్జెట్‌పై తమను మాట్లాడనివ్వడం లేదన్న రేవంత్
* బండారం బయటపడుతుందనే అడ్డుకుంటున్నారని మండిపాటు
* సభాహక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ స్పీకర్‌కు లేఖ

సాక్షి, హైదరాబాద్: ఎంపీ కవితపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వరుసగా రెండో రోజూ అసెంబ్లీని కుదిపేశాయి. గురువారం ఇదే అంశంపై దాదాపు మూడు గంటలపాటు శాసనసభ పూర్తిగా స్తంభించిపోయింది. ఇది చివరకు పది మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌కు దారితీసింది. అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేల ధర్నా, అరెస్టులతో అసెంబ్లీ ప్రాంగణం దద్దరిల్లింది. బడ్జెట్‌పై చర్చలో భాగంగా స్పీకర్ అనుమతితో రేవంత్‌రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

ఉదయం జీరో అవర్ అనంతరం శాసనసభలో మధ్యాహ్నం 12.30 గంటలకు బడ్జెట్‌పై చర్చ మొదలైంది. ఆ వెంటనే ప్రారంభమైన గందరగోళం 3.30 గంటల దాకా కొనసాగింది. సమగ్ర సర్వేలో భాగంగా నిజామాబాద్ ఎంపీ కవిత తన వివరాలను రెండు చోట్ల నమోదు చేయించుకున్నారంటూ రేవంత్ బుధవారం శాసనసభలో వ్యాఖ్యానిం చిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేదని, ఆయన క్షమాపణ చెప్పిన తర్వాతే బడ్జెట్‌పై చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. రేవంత్ మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ అడ్డుకున్నారు. దీంతో తాను బడ్జెట్‌పై మాట్లాడటం మొదలుపెడితే అందులోని లుకలుకలు బయటకు వస్తాయనే మాట్లాడనీయడం లేదని రేవంత్ ఆరోపించారు.

దీంతో మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ.. ‘ప్రభుత్వం ఎవరికీ భయపడదు. బడ్జెట్ మీద ఎంతసేపైనా చర్చకు మేం సిద్ధం. నోటికొచ్చినట్టు మాట్లాడతానంటే ఎలా? సర్వేలో భాగంగా ఎంపీ కవిత హైదరాబాద్‌లో వివరాలు నమోదు చేసుకోలేదని ఆర్‌డీవో ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ఉంది. ఓ మహిళా ఎంపీని అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్‌ను తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీల సభ్యులు చెప్పినా మొండిగా వ్యవహరించడం బాధ్యతారహిత్యం’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ దశలో టీడీపీ సభ్యులు పోడియంలోకి వెళ్లగా, టీఆర్‌ఎస్ సభ్యులు తమ స్థానాల్లో లేచి నిలబడి నినాదాలు చేశారు. దీంతో మధ్యాహ్నం 12.45 గంటలకు సభను స్పీకర్ వాయిదా వేశారు.

రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే..
సభ వాయిదా పడిన అనంతరం అఖిలపక్ష నేతలతో సభాపతి సమావేశమయ్యారు. సభను సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ కవితపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను రేవంత్‌రెడ్డి అన్ని పక్షాల నేతలకు అందజేశారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటలకు సభ తిరిగి ప్రారంభంకాగానే సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘నూటికి నూరు శాతం రేవంత్ తప్పు చేశారు. సభను తప్పుదోవ పట్టించినందుకు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే’నని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటిని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగం కరెంటు సమస్యతో ఇబ్బందులు పడుతుంటే, ఈ విషయంలో ప్రభుత్వం న్యాయపోరాటానికి ముందుకుపోతుంటే.. రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగా సభను తప్పుదోవ పట్టిస్తారా అంటూ టీడీపీ సభ్యులనుద్దేశించి అన్నారు. సభలో అప్పుడప్పుడు మాటలు దొర్లుతుంటాయని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీలాంటి మహా నేతలు కూడా ఒక సందర్భంలో సభకు క్షమాపణ చెప్పారని కేసీఆర్ గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ‘దొర బూట్లు నాక్కో’ అని అనొచ్చా అంటూ సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ కుటుంబ బడ్జెట్ అంటూ వ్యాఖ్య లు కూడా చేశారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు లేచి మాట్లాడబోతుండగా స్పీకర్ అవకాశమివ్వలేదు. బడ్జెట్‌పై చర్చలో పాల్గొనాలని టీఆర్‌ఎస్ సభ్యుడు ఏనుగు రవీందర్‌రెడ్డికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. దీనికి నిరసనగా టీడీపీ సభ్యులు పోడియంలోకి వెళ్లి నినాదాలు చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ సభ్యులను సస్పెం డ్ చేయాలని కోరుతూ సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు 3.15 గంటలకు తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ దీన్ని ఆమోదిస్తూ టీడీపీకి చెందిన పది మంది శాసనసభ్యులను వారం రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించా రు. సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే లు పోడియం ముందు బైఠాయించి నిరసన తె లపడంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. సస్పెండైనవారిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు,రేవంత్‌రెడ్డి, జి.సాయన్న, అరికెపూడి గాంధీ, ఎస్.వెంకటవీరయ్య, మంచి రెడ్డి కిషన్‌రెడ్డి, వజీర్ ప్రకాష్‌గౌడ్, వివేకానంద, ఎం. రాజేందర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్ ఉన్నారు.

తీవ్రంగా స్పందించిన జానారెడ్డి
టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ను ఇతర పక్షాలు తప్పుబట్టాయి. తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా అధికారపక్షం సంయమనంతో వ్యవహరించాలని, సభ్యుల సస్పెన్షన్‌పై పునరాలోచించాలని కాంగ్రెస్, బీజేపీలు సూచించాయి. అలాంటి వ్యాఖ్యలు చేసిన సభ్యుడి విజ్ఞతకే ఈ అంశాన్ని వదిలేయాలని, భవిష్యత్తులో అలా వ్యవహరించొద్దంటూ సభకు గట్టిగా సూచిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కాగా, దీనిపై సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్రంగా స్పందించారు.

‘స్పీకర్ ఒక పక్షం వైపే చూస్తూ, అటువైపే స్పంది స్తుండటం సరికాదు. సస్పెన్షన్ తీర్మానం కంటే ముందు నేను పలుమార్లు పిలిచినా, స్పీకర్‌గానీ, కార్యదర్శిగానీ, అధికారపార్టీ సభ్యులుగానీ నన్ను పట్టించుకోలేదు. కొత్త రాష్ట్రంలో నూతన ఒరవడి అవసరం. అభ్యంతర కరంగా వ్యవహరించిన సభ్యులు ఆత్మవిమర్శ చేసుకుని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే హుం దాగా ఉంటుంది. వివాదానికి కారణమైన విష యం కూడా తీవ్రమైందేమీ కాదు. సర్వేలో నిజామాబాద్ ఎంపీ రెండు చోట్ల పేర్లు నమోదు చేసుకున్నా పెద్ద తప్పేం కాదు. ఒకచోట వివరాలు తొలగించొచ్చు.  ఒకచోట వివరాలు నమోదు చేసుకున్న విషయాన్ని సభ ముందుంచితే ఆ సభ్యుడి వ్యాఖ్యలు తప్పని తేల్చిచెప్పినట్టే అవుతుంది కదా. దీన్ని వారంపాటు సస్పెన్షన్ వరకు తేవడం సరికాదు’ అని జానారెడ్డి ఆవేశంగా వ్యాఖ్యానించారు. సభను సజావుగా సాగించాలని, వాస్తవాలను సభ ముందుంచి, వ్యాఖ్యల ఉపసంహరణ సభ్యుడి విజ్ఞతకు వదిలి సభను కొనసాగించాలని బీజేపీ సభ్యుడు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ సూచించారు.

గాంధీ విగ్రహం వద్ద ధర్నా, అరెస్ట్
సస్పెన్షన్‌కు గురైన టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం అక్కడి గాంధీ విగ్రహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీ సులు అడ్డుకున్నారు. దాంతో అసెంబ్లీ బయటకు వచ్చి రోడ్డు పై ధర్నా నిర్వహించారు. పేదల పెన్షన్ల గురించి ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? రైతుల ఆత్మహత్యలను ప్రశ్నించవద్దా? సీఎం కుమార్తె గురించి ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అంటూ అరగంట సేపు నినాదాలు చేశారు. అనంతరం రవీంద్రభారతి వైపు వెళ్లే రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.

నా హక్కులను కాపాడండి: రేవంత్
‘నేను బడ్జెట్‌పై ప్రసంగించకుండా, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపనీయకుండా, నిరాశ, నిస్పృహలకులోనై ఎదురుదాడికి దిగడం శోచనీయం. నా హక్కులను కాపాడాలని అభిప్రాయపడుతున్నాను..’ అని స్పీకర్ మధుసూదనాచారికి రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన ప్రశ్నపై తాను మాట్లాడుతూ సర్వేలో జరిగిన పొరపాట్లను ఎత్తి చూపానని, ఆరోపణలు చేయలేదని, వ్యక్తిగతంగా ఎవరి పేరునుగానీ, వారిపై ఆరోపణలుగానీ చేయలేదని వివరించారు.

కానీ, మంత్రి హరీశ్‌రావు నిబంధనలను ప్రస్తావించి, తనను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారని, చివరకు అన్ని పక్షాల నాయకులను స్పీకర్ చాంబర్‌కు పిలిపించి అభిప్రాయాలు తీసుకుని.. తాను క్షమాపణ చెబితేనే సభ ముందుకు సాగుతుందని చెప్పించారని లేఖలో గుర్తుచేశారు.ప్రతిపక్ష సభ్యుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. సభ్యుల హక్కులను సమానంగా కాపాడాల్సిన బాధ్యత తమరిపై ఉందని విన్నవించవలసిన అవసరం లేదు’ అని లేఖలో పేర్కొన్నారు. సర్వే సందర్భంగా సీఎం ప్రసంగం, వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగుల సీడీని కూడా జత చేస్తున్నట్లు తెలిపారు.

నేడు గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
అసెంబ్లీలో ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. తమపై అధికారపక్షం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలవనున్నారు. మరోవైపు జిల్లాల్లో కూడా పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా స్థానిక నేతలకు అధినాయకత్వం సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement