
ఉపాధ్యాయుడి దాష్టీకం
పరిగి: ఓ ఉపాధ్యాయుడు డౌట్ అడిగిన విద్యార్థి చెవిపై బూటుకాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా తరగతి గదిలో చితకబాదాడు. ఈ సంఘటన పరిగి విద్యారణ్యపురిలోని గురుకుల పాఠశాలలో ఆలస్యంగా సోమవారం వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత విద్యార్థి కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం డివిజన్ యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన ప్రశాంత్(14) పరిగి విద్యారణ్యపురి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు గత శనివారం లీజర్ పీరియడ్ ఉండడంతో కాంట్రాక్ట్ హిందీ అధ్యాపకుడు సత్యనారాయణ 9వ తరగతిలోకి వెళ్లాడు.
తమకు ఇష్టమైన సబ్జెక్ట్ పుస్తకాలు చదువుకోవచ్చని ఆయన చెప్పాడు. దీంతో ప్రశాంత్ జీవశాస్త్రం చదువుకుటుండగా అతడికి ఓ సందేహం వచ్చింది. దీంతో అతడు వెళ్లి సత్యనారాయణను అడిగాడు. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన టీచర్ ‘సైన్స్ సబ్జెక్ట్‌కు సంబంధించిన డౌట్ హిందీ టీచర్‌ను అయిన నన్ను అడుగుతావా..?’ అంటూ విద్యార్థి చెవిపై బూటుకాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా క్లాస్‌రూంలో చితకబాదాడు. ప్రశాంత్ ఏడుస్తూ వరండాలోకి వెళ్లగా.. మరోమారు కొట్టాడు.
విద్యార్థి విషయం ప్రిన్సిపాల్ సాయినాథ్‌కు చెప్పడంతో ఆయన గుట్టుగా హిందీ టీచర్ సత్యనారాయణను ఇంటికి పంపారు. అదే రోజు పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించుకున్నా చెవి వినిపించడం లేదని ప్రశాంత్ తెలిపాడు. సోమవారం ఇంచార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ వివరణ కోరగా.. విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స చేయించామన్నారు. హిందీ టీచర్ సత్యనారాయణను ఇంటికి పంపినట్లు తెలిపారు.. కాగా ఇదే సమయంలో విద్యార్థి ప్రశాంత్ చురుకైన, మంచి విద్యార్థి అని ఇంచార్జి ప్రిన్సిపాల్ తెలిపారు.
విద్యార్థి సంఘాల ఆందోళన..
విద్యార్థిపై దాడి విషయం బయటకు పొక్కడంతో సోమవారం విద్యార్థి జేఏసీ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాల నాయకులు గురుకుల పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ విచక్షణ మరిచిపోయి విద్యార్థిపై బూటుకాలుతో తన్నడం హేయమని మండిపడ్డారు. హిందీ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.
ఇదే సమయంలో పాఠశాలలో సమస్యలు ఉన్నాయని విద్యార్థులు విద్యార్థి నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, నీటి సమస్య ఉందని, మరుగుదొడ్డు ఉన్నా ప్రయోజనం లేదని వాపోయారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ రవికుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీర్ మహ్మద్, పీడీఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం తదితరులున్నారు.