పెద్దగోల్కొండ (శంషాబాద్ రూరల్): విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు అదుపుతప్పాడు. ఆదర్శంగా నిలవాల్సిన ఆయన మద్యం మత్తులో తూలుతూ పాఠశాలకు రావడం పరిపాటిగా మారింది. బుధవారం మద్యం తాగి వచ్చిన మాష్టారుకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఉన్నతాధికారులు ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేశారు. శంషాబాద్ మండలం పెద్దగోల్కొండలో ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో జి.శ్రీధర్ లెక్కల మాస్టారుగా పనిచేస్తున్నాడు.
బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన మద్యం మత్తులో స్కూల్‌కు వచ్చాడు. అరగంటపాటు అటూఇటూ తిరిగి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. బస్టాప్ సమీపంలో నిలబడి ఉన్న ఆయనను స్థానికులు గమనించారు. మద్యం తాగి వస్తున్న విషయమై ఉపాధ్యాయుడు శ్రీధర్‌ను నిలదీశారు. ఈక్రమంలో ఆయన స్థానికులతో గొడవపడ్డాడు. దీంతో వారు శ్రీధర్‌పై దాడి చేశారు. ఆయన 100 నంబరుకు ఫోన్ చేయడంతో మొబైల్ పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. తాను సెలవులో ఉండి, నాగారం గ్రామం వెళ్లడానికి ఇక్కడికి వస్తే స్థానికులు దాడి చేశారని ఆయన పోలీసులకు చెప్పాడు. అనంతరం ఇన్‌చార్జి ఎంఈఓ నర్సింహారావు పాఠశాలకు చేరుకొని ఘటపై వివరాలు సేకరించారు. ఉదయం పాఠశాలకు వచ్చిన శ్రీధర్ రిజిస్టర్‌లో సంతకం చేయకపోవడంతోపాటు హెచ్‌ఎంకు చెప్పకుండానే వెళ్లిపోయినట్లు గుర్తించారు.
గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ వ్యవహారశైలి సరిగాలేదని, నిత్యం తాగి పాఠశాలకు వస్తున్నాడన్నారు. ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ఎంఈఓకు విన్నవించారు. ఎంఈఎఓ నివేధిక మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయుడు శ్రీధర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, తనపై గ్రామస్తులు దాడి చేశారని శ్రీధర్ శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ సారు.. మాకొద్దు!
Published Wed, Mar 4 2015 11:38 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement