టీఆర్‌టీ అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తున్న జాయింట్ కలెక్టర్ నిఖిల, డీఈఓ విజయలక్ష్మి తదితరులు
సాక్షి, జిన్నారం(పటాన్‌చెరు): ఎట్టకేలకు కొన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 192 మంది ఉపాధ్యాయుల నియామకం పూర్తయింది. నియామక పత్రాలను జిల్లా ఉన్నతాధికారులు ఉపాధ్యాయులకు అందించారు. దీంతో నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంతోపాటు వారికి అన్ని రకాల విద్యాబుద్ధులు చెబుతామని నూతన ఉపాధ్యాయులు అంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 1,285 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా వీరిలో 876మంది ఎస్జీటీలు ఉన్నారు. ఎస్టీజీ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ కోర్టులో ఉన్నందున వారి నియామకాలను ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టడం లేదు. దీంతో ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, లాంగ్వేజ్ పండిట్ల పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్, వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి 263 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
263 పోస్టుల్లో 55 పోస్టులు వివిధ కారణాలతో నిలిపేశారు. ప్రస్తుతం 208 పోస్టులను జిల్లా వ్యాప్తంగా అధికారులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల 12న సంగారెడ్డిలోని జెడ్పీ హాలులో డీఈఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలించారు. 192 మంది ఉపాధ్యాయులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 192మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందించారు. జేసీ నిఖిల, డీఈఓ విజయలక్ష్మిల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, మనూర్, మునిపల్లి, ఝరాసంఘం, రేగోడ్, టేక్మాల్, కంగ్టి, న్యాల్‌కల్, హత్నూర, చిలప్‌చెడ్, కోహిర్, రాయికోడ్, సదాశివపేట, కౌడిపల్లి, అల్లాదుర్గం, వెల్దుర్తి, వట్‌పల్లి తదితర మండలాల్లో ఎక్కువ పోస్టుల ఖాళీలను అధికారులు చూపించారు.
ఈ ప్రాంతాల్లో గత పదేళ్ల నుంచి సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో వీటిని భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏదిఏమైనా నూతన ఉపాధ్యాయులు నేటి నుంచి ప్రభుత్వ బడుల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్ల నుంచి వారు కన్న కలలు సాకారం అవుతుండడంతో నూతన ఉపాధ్యాయుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
చాలా సంతోషంగా ఉంది
నేను టీఆర్‌టీలో ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. నాన్న, మామలు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడంతో నేను కూడా ఉపాధ్యాయురాలిని కావాలనే లక్ష్యంతో చదివాను. నేటి నుంచి నా కల నెరవేరబోతోంది. ఇది చాలా సంతోషం కలిగిస్తోంది. చదువు విషయంలో నా కుటుంబ సభ్యులు చాలా సహకరించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు నా వంతు కృషి చేస్తా.
– స్వప్న, జిన్నారం, లాంగ్వేజి పండిట్, తెలుగు
లక్ష్యం నెరవేరింది
ఉపాధ్యాయురాలిని కావాలనే నా లక్ష్యం నెరవేరింది. టీఆర్‌టీలో సెలక్ట్ కావ డంతో చాలా సంతోషంగా ఉంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారిని ప్రయోజకులుగా చేసేలా ముందుకెళ్తా. కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరి సహకారంతోనే నా కల నెరవేరింది.
– శశికళ, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment