సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి ఫలితాలు ఉపాధ్యాయులకు పెద్ద పరీక్షగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేందుకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఆయా సబ్జెక్టుల టీచర్ల నుంచి ‘అండర్ టేకింగ్’ లెటర్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఫెయిలైతే ఆ సబ్జెక్టు టీచరే బాధ్యత వహించేలా వారి నుంచి లెటర్ తీసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ, ఉపాధ్యాయుల్లో బాధ్యత పెంచేందుకు..మెరుగైన ఫలితాలు సాధించడానికి ఒకింత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కాగా ఇప్పటికే పూర్తయిన సిలబస్‌లను మరోసారి పునశ్ఛరణ చేయడంతో పాటు వీకెండ్ పరీక్షలతో విద్యార్థులను సన్నద్ధులను చేస్తున్నారు. చదువుకునే విద్యార్థులపైనే కాదు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులపైనా ఒత్తిడి పెంచుతున్నారు.
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో మొత్తం 75 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరిలో 7200 మంది వరకూ సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలున్నారు. రంగారెడ్డి జిల్లాలోమొత్తం 49 వేల మంది విద్యార్థులు ఉండగా, వీరిలో 17 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 40 వేలకుపైగా విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, వీరిలో పది వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో పోలిస్తే ఉత్తీర్ణత శాతంలో గత కొన్నేళ్లుగా హైదరాబాద్ జిల్లా వెనకబడుతూ వస్తుంది. ఈ సారి ఎలాగైనా ఉత్తీర్ణత శాతం పెంచి జిల్లా పరువు నిలబెట్టాలని భావించిన జిల్లా విద్యాశాఖ ఆ మేరకు ఉపాధ్యాయుల పట్ల కొంత కఠినంగా వ్యవహరిస్తుంది.
అధ్యాపకులపై అనధికారిక ఆంక్షలు
నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ)తో పరీక్షల తీరు మారింది. పిల్లల్లో సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించిన సిలబస్‌పై పలు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పట్టు సాధించలేక పోయారు. ఫలితంగా మ్యాథ్స్, సైన్స్‌ల్లో మూడేళ్లుగా విద్యార్థుల ఉత్తీర్ణత తగ్గుతూ వస్తోంది. గత ఏడాది ఫలితాలు కొంత మెరుగుపడినప్పటికీ...ర్యాంకుల సాధనలో ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ 31వ స్థానంలో నిలిచింది. 20 పాఠశాలల్లో 40 శాతం లోపే ఫలితాలు వచ్చాయి. కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే 10/10 జీపీఏ సాధించారు. ఏ రకంగా చూసిన హైదరాబాద్ జిల్లా ఫలితాలు నిరాశజనకంగా మారాయి. ఈ పరిస్థితి నుంచి జిల్లాను గట్టెక్కించాలనే విద్యాశాఖ ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతుంది. ఉత్తీర్ణతలో వెనుకబడిన పలు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల నుంచి సబ్జెక్టుల వారిగా అండర్ టేకింగ్ లెటర్లను సేకరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. విద్యార్థి ఫెయిలైతే..సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుడే బాధ్యత వహించాల్సి ఉంది. అయితే అండర్ టేకింగ్ లెటర్ల విషయంలో ఖచ్చితమైన నిబంధనలంటూ ఏమీ లేవని, మెరుగైన ఫలితాల సాధన కోసం ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు, బాధ్యతలను గుర్తు చేసేందుకే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని జిల్లా విద్యాశాఖ ప్రకటించింది.
కొంత కఠినంగా వ్యవహరిస్తున్నాం
డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా రూపొందించిన ప్రశ్నపత్రాలతో అభ్యాస పరీక్షలు నిర్వహిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఆ మేరకు వారికి సబ్జెక్టుల వారీగా ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. మరో గంట అదనంగా వారితో సాధన చేయిస్తున్నాం. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయుల పట్ల కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నాం. ఉపాధ్యాయులతో పాటు ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై శ్రద్ధ చూపించాలి. వేళకు ఆహారం అందివ్వడంతో పాటు వేళకు నిద్రపుచ్చడం, తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేపి చదివించడం, చదువుకునే సమయంలో సాధ్యమైనంత వరకు టీవీ, సెల్‌ఫోన్ వంటివాటిని దూరంగా ఉంచాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఎటువంటి వాదులాటకు దిగకూడదు. పిల్లల భావోద్వేగాలపై ప్రభావం చూపే అంశాలను చర్చించరాదు. ప్రతికూల వాతావరణం పిల్లల జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది.
– బి.వెంకటనర్సమ్మ,జిల్లా విద్యాశాఖాధికారి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment