సంబరాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన ఎన్బీటీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే మెరుగుపడింది. 2017–18 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి 6,693 మంది పరీక్ష రాయగా 4,752 మంది (71.0శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2018–19 విద్యా సంవత్సరంలో 7,013 మంది పరీక్ష రాయగా 5,816 మంది (82.93 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2017–18లో ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 62,693 మంది పరీక్ష రాయగా 47,966 మంది (76.51శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక 2018–19లో 63,311 మంది పరీక్షకు హాజరు కాగా, 52,598 మంది(83.08శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం విశేషం.
ఇద్దరికి 10 జీపీఏ
హైదరాబాద్ జిల్లా పరిధిలోని లాలాపేట ప్రభుత్వ బాలికల హై స్కూల్‌కు చెందిన టి.లక్ష్మి స్థితప్రజ్ఞ (రోల్‌నెంబర్ః1922168514), ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన మాదాసు శ్రావ్య (రోల్‌నెంబర్ః 1922172268)లు 10 జీపీఏ సాధించారు. మాదన్నపేట ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థి ఎం.భరద్వాజ్ సహా మలక్‌పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కుప్పల విష్ణువర్థన్‌తో పాటు ఉప్పునూతల అనిల్, కుల్సుపుర ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నిఖిల్ ఖడ్గేకర్, కాచిగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జి.సింధూజ, హైదర్‌గూడలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్ విద్యార్థిని అంజలిగుప్తా, హిమాయత్‌నగర్‌లోని ప్రభుత్వ బీహెచ్‌ఎస్ స్కూలు విద్యార్థి ఎన్.అవినాశ్, హిల్‌స్ట్రీట్ ప్రభుత్వ బోయ్స్ హైస్కూల్ విద్యార్థి సీహెచ్ పవన్‌కుమార్‌లు 9.8 జీపీఏ సాధించారు. మరో 21 మంది 9.7 జీపీఏ సాధించగా, 29 మంది 9.5 జీపీఏ, 36 మంది 9.3 జీపీఏ, 41 మంది 9.2 జీపీఏ, 71 మంది 9.0 జీపీఏ సాధించారు.
అమీర్‌పేట్ ఫస్ట్..సికింద్రాబాద్ లాస్ట్
ప్రభుత్వ పాఠశాలల్లో మండలాల వారిగా ఫలితాల సరళిని పరిశీలిస్తే...అత్యధిక ఉత్తీర్ణత అమీర్‌పేట మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రథమ స్థానంలో నిలువగా, సికింద్రాబాద్ మండల పరిధిలోని పాఠశాలలు చివరిస్థానంలో నిలిచాయి. జిల్లాలో మొత్తం 7013 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 5816 మంది ఉత్తీర్ణత సాధించారు. అమీర్‌పేట్ మండల పరిధిలో 186 మంది విద్యార్థులకు 165 మంది(88.71 శాతం), బహుదుర్‌పురాలో 764 మందికి 632 మంది(82.72 శాతం), బండ్లగూడలో 551 మందికి 468 మంది(84.94 శాతం), చార్మినార్‌లో 433 మందికి 327 మంది (75.52శాతం), గొల్కొండలో 1252 మందికి 930 మంది(74.28శాతం), హిమాయత్‌నగర్‌లో 456 మందికి 409 మంది(89.69 శాతం), ఖైరతాబాద్‌లో 1061 మందికి 906 మంది(85.39 శాతం), మారేడ్ పల్లిలో 661 మందికి 571 మంది (86.38శాతం), ముషీరాబాద్‌లో 320 మందికి 284 మంది(88.75శాతం), నాంపల్లిలో 419 మందికి 322 మంది 76.85 శాతం), సైదాబాద్‌లో 420 మందికి 376 మంది(89.52శాతం), సికింద్రాబాద్‌లో 490 మందికి 426 మంది ఉత్తీర్ణత సాధించారు
మౌనిక పేరెంట్స్ హ్యాపీ
బంజారాహిల్స్: పట్టుదల... ఏకాగ్రత.. క్రమశిక్షణ.. ఆత్మవిశ్వాసం అన్ని కలగలిపితే ఫిలింనగర్ రౌండ్‌టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని వి. మౌనిక అవుతుంది. ఒక స్వీపర్ కూతురు ఇంగ్లీష్‌మీడియంలో చదివి ఆ స్కూల్‌కే టాపర్‌గా నిలిచి వన్నె తీసుకొచ్చింది. సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ పాఠశాలకు చెందిన మౌనిక 9.5 జీపీఏతో స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఫిలింనగర్‌లోని బద్దం బాల్‌రెడ్డి నగర్‌లో నివసించే మౌనిక తండ్రి శంకరయ్య దినసరి కూలీకాగా తల్లి హంసమ్మ బంజారాహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ స్వీపర్‌గా పని చేస్తున్నది. కష్టపడి కూతురిని చదివించినందుకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చింది.
100 % పాస్
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు మీడియంలో 30 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అంతా ఉత్తీర్ణులయ్యారు. అత్యధిక గ్రేడింగ్ 9.2 నమోదైంది. అలాగే ఇంగ్లీష్ మీడియంలో 24 మంది పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. 9.5 గ్రేడింగ్‌తో ఇంగ్లీష్ మీడియంకు చెందిన రాజేష్ అనే విద్యార్థి టాపర్‌గా నిలిచాడు. తెలుగు మీడియంలో 9.2 జీపీఏతో గోపి టాపర్‌గా నిలిచాడు. గతేడాది 86శాతం ఉత్తీర్ణులు కాగా ఈ సారి వందశాతం సాధించి రికార్డు సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment