బడి బంద్‌! | Teachers Shortage In 2500 Government Schools In Telangana | Sakshi
Sakshi News home page

బడి బంద్‌!

Published Fri, Jul 20 2018 1:10 AM | Last Updated on Fri, Jul 20 2018 8:56 AM

Teachers Shortage In 2500 Government Schools In Telangana - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్‌ : ఉపాధ్యాయ బదిలీల్లో విద్యా శాఖాధికారులు హేతుబద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని ఏకంగా 1,870 స్కూల్లో టీచర్లు లేకుండా పోయారు. మరో 900 స్కూళ్లు టీచర్లున్నా విద్యార్థుల్లేక మూతపడ్డాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో దాదాపుగా ఏ గ్రామంలోనూ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు గత 15 రోజులుగా తెరుచుకోలేదు. ఈ స్కూళ్లకు బదిలీపై వచ్చిన టీచర్లే అతి తక్కువ మంది అంటే వారిలోనూ అత్యధికులు దీర్ఘకాల సెలవుపై వెళ్లడమే ఇందుకు కారణం.

పిల్లలున్నా టీచర్లు లేకపోవడం, టీచర్లున్నా పిల్లల్లేకపోవడం వంటివి పక్కన పెడితే, రాష్ట్రంలో 500, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులున్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో కూడా కనీసం సబ్జక్టు టీచర్లు లేని పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 జెడ్పీహెచ్‌ఎస్‌ల్లో నాలుగింటిలో, గ్రామీణ స్కూళ్లలో పదికి ఆరింట సబ్జక్ట్‌ టీచర్ల కొరత ఉంది. మరెన్నో స్కూళ్లలో అరకొర టీచర్లే బండి నెట్టుకొస్తున్నారు.

మా స్కూళ్లు తెరిపించండి మహాప్రభో!
టీచర్ల బదిలీల తర్వాత మూతపడ్డ స్కూళ్లను తెరిపించాలంటూ కలెక్టర్లకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా దామరగిద్ద మండలం దేశాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులున్నారు. టీచర్లు లేక స్కూలు మూతపడింది. దాంతో తమ పిల్లలు చదువులు లేక ఇళ్ల వద్దే ఉంటున్నారని గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. తక్షణమే స్కూలును తెరిపించాలని అభ్యర్థించారు. ఆదిలాబాద్, కుమ్రం భీం, నిర్మల్‌ జిల్లాల్లోనూ 180కి పైగా స్కూళ్లు టీచర్లు లేక మూతబడ్డాయి. వాటిని తెరిపించాలని స్థానికులు కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. నల్లగొండ జిల్లా డిండి, చందంపేట మండలాల్లోనైతే స్కూళ్లు తెరిపించాలంటూ విద్యార్థి సంఘాలు స్థానిక గిరిజనులతో కలిసి ఏకంగా ఆందోళనలకు దిగాయి.

ప్రైవేట్‌ స్కూళ్లు అందుబాటులో లేని చోట్ల ఇలా సర్కారీ బళ్లు మూతపడటంతో విద్యార్థులు పొలం బాట పడుతున్నారు. దాంతో దాదాపు 900 స్కూళ్లలో విద్యార్థులే లేని పరిస్థితి ఏర్పడింది. వీటిలో పలు స్కూళ్లలో పట్టుమని పది మంది పిల్లలు కూడా లేరు. విచిత్రమేమిటంటే నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని దోరెపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులు 60కి మించలేదు! చందంపేట మండలం చిత్రియాల జెడ్పీహెచ్‌ఎస్‌లో గతేడాది 85 మంది విద్యార్థులుండగా ఈసారి 65కు తగ్గారు. ఉన్న ఒక్క టీచర్‌ బదిలీపై విద్యార్థులే టీచర్లుగా మారారు!
ఇక 100, అంతకంటే తక్కువ మంది విద్యార్థులున్న జెడ్పీహెచ్‌ఎస్‌లు రాష్ట్రంలో 1,000కి పైనే ఉన్నాయి!!

సిలబస్‌ కష్టాలు
స్కూళ్లు మొదలయ్యాక టీచర్ల బదిలీలు చేపట్టడంతో ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంకా సిలబస్‌ కూడా మొదలవలేదు. ఎలాగూ బదిలీ అవుతాం కదా అనే ఉద్దేశంతో టీచర్లు పట్టించుకోలేదు. బదిలీలయ్యాక రావాల్సిన టీచర్లు చాలాచోట్ల విధుల్లో చేరలేదు. ‘సిలబస్‌ విషయంలో ఇబ్బందులు ఉన్నమాట నిజమేనని విద్యా శాఖ సీనియర్‌ అధికారి ఒకరు అంగీకరించారు. అయితే, ‘‘హైస్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు సెలవుల్లో కూడా ప్రత్యేక తరగతులు పెట్టే ఆలోచన ఉంది. దసరా సెలవుల నాటికి నిర్దేశిత సిలబస్‌ పూర్తయ్యేలా చూడాలని జిల్లా విద్యాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశాం’’అని ఆయన వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement