ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీచేసే అవకాశముంది. ఈనెల 14వ తేదీలోగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను పూర్తిచేసి.. ఆ తర్వాత బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.పాఠశాలల హేతుబద్ధీకరణను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో...
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను మాత్రమే చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈనెల 14వ తేదీ నుంచి చేపట్టేలా తాత్కాలిక షెడ్యూల్‌ను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ రెండింటిని మరోసారి సీఎం కేసీఆర్‌కు వివరించి.. ఆయన ఆమోదం తీసుకోనుంది. మొత్తానికి బదిలీలకు సంబంధించి కేటగిరీల వారీగా, యాజమాన్యాల వారీగా ఖాళీల వివరాలను ఈనెల 14న ప్రకటించే అవకాశం ఉంది.
ఇక ఉపాధ్యాయులు బదిలీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. వాటిల్లో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు, ఇతరత్రా పనులను 26వ తేదీ నాటికి పూర్తిచేసే అవకాశం ఉంది. 27వ తేదీ నుంచి బదిలీలు, పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రారంభించి వచ్చే నెల 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. కేటగిరీల వారీగా ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి ఒక రోజు, రెండు రోజుల చొప్పున సమయం కేటాయించి బదిలీలు పదోన్నతులు చేపట్టనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీల కౌన్సెలింగ్‌ను చివరి నాలుగు రోజుల్లో చేపట్టే అవకాశం ఉంది.
టీచర్ల బదిలీలకు తాత్కాలిక షెడ్యూల్!
Published Tue, Jun 9 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
Advertisement