సాక్షి, హైదరాబాద్: ఈనెల 31వ తేదీ వరకు రాష్ట్రం లాక్ డౌన్ నేపథ్యంలో ఇకపై టీచర్లు కూడా ఇంటికే పరిమితం కానున్నారు. కోవిడ్ కారణంగా రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు ఇటీవల సెలవులిచ్చిన విద్యాశాఖ.. టీచర్లు మాత్రం పాఠశాలలకు వెళ్లి పెండింగ్ పనులను చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీచర్లు స్కూళ్లకు వెళ్తున్నారు. అయితే బడుల్లో పదుల సంఖ్యలో టీచర్లు ఒకేచోట ఉండటం ప్రమాదకరమని, తమకు కూడా సెలవులివ్వాలని గత మూడ్రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయినా దీనిపై విద్యాశాఖ పెద్దగా స్పందించలేదు. అయితే రోజురోజుకూ కోవిడ్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం లాక్‌డౌన్ ప్రకటించింది. ఇందులో భాగంగా నిత్యావసరాలు, సేవలకు సంబంధించిన రంగాలు, ప్రభుత్వ ఉద్యోగులు రొటేషన్ పద్ధతిలో 20 శాతమే పని చేయాలని పేర్కొంది.
బడులకు సెలవులిచ్చిన నేపథ్యంలో ఇక టీచర్లు బడికి వెళ్లేది లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షల మూల్యాంకనం వాయిదా వేయాలని జూనియర్ కాలేజీల లెక్చరర్లు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. గత రెండ్రోజులుగా ఆందోళన చేశారు. వందల మంది ఒకే చోట ఉండి మూల్యాంకనం చేయడం వల్ల ఎవరికైనా కోవిడ్ సమస్య ఉంటే అది అందరికీ వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో విద్యాశాఖ మాత్రం మూల్యాంకనాన్ని యథావిధిగా కొనసాగించింది. ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఒక్కరోజు మూల్యాంకనాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం నుంచి మూల్యాంకనం కొనసాగుతుందని శనివారమే ప్రకటించింది. అయితే ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇంటర్మీడియట్ మూల్యాంకనం కూడా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించడంతో లెక్చరర్లకు ఊరట లభించింది.
నేటి ఇంటర్ పరీక్షలు వాయిదా..
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించాల్సిన పరీక్షలను బోర్డు వాయిదా వేసింది. జియోగ్రఫీ–2, తెలుగు పేపర్–2, ఉర్దూ పేపర్–2, హిందీ పేపర్–2లను వాయిదా వేస్తున్నామని, ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు.
టీచర్లకు సెలవులే..
Published Mon, Mar 23 2020 1:50 AM | Last Updated on Mon, Mar 23 2020 1:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment