
అవినీతి పాఠాలే..
శిశువుకుతొలిసారిగా సమాజాన్ని.. పరిసరాలను పరిచయం చేసేది పాఠశాల. తరగతి గదిలో ఉపాధ్యాయుడే విద్యార్థికి నాయకుడు.
- ఉపాధ్యాయుల బది‘లీలలు’ నిజమే
- 52 మంది అక్రమంగా బదిలీ
- నిర్ధారించిన విద్యాశాఖ అధికారులు
- చర్యలు శూన్యం..
- గత తప్పిదాలే పునరావృతం
- ఉపాధ్యాయ సంఘాల ఆరోపణ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: శిశువుకుతొలిసారిగా సమాజాన్ని.. పరిసరాలను పరిచయం చేసేది పాఠశాల. తరగతి గదిలో ఉపాధ్యాయుడే విద్యార్థికి నాయకుడు. ఉపాధ్యాయుడు ఏమి చేస్తే విద్యార్థి దాన్ని ఆచరిస్తాడు. విద్యతో పాటు విలువలు ధర్మం, నీతి, న్యాయం బోధించాల్సిన పాఠశాలలో ‘అక్రమాల’ ప్రాక్టికల్స్ సాగుతున్నాయి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. అక్రమాలకు బాధ్యుణ్ని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీఈవో రాజేశ్వర్‌రావును సస్పెండ్ చేసింది. (ఇటీవల మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు). కానీ అక్రమ పోస్టులు ఏవో... ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారో ఇప్పటి వరకు గుర్తించకపోవటం, వారికి ఎలాంటి శాఖాపరమైన చర్యలు లేకపోవడంపై ఉపాధ్యాయ సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాత డీఈవో చేసిన తప్పదాలు కప్పిపెట్టే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జూన్‌లో ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ చేపట్టింది. అర్హత ఉన్న మొత్త 4,394 మంది ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకోగా వారిలో 1,200 మంది సాధారణ ఉపాధ్యాయులు, 375 ప్రధానోపాధ్యాయులను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ విచారణ చేపట్టి అక్రమాలు నిజమే అని నిర్ధారించింది. 52 మంది ఉపాధ్యాయులు అక్రమంగా బదిలీ అయ్యారని ప్రాథమికంగా నిర్ధారించింది. మరింత శోధన చేస్తే మరి కొంతమంది అక్రమార్కులు కూడా బయటికి వస్తారని సూచించింది. కానీ అక్రమాలకు పా ల్పడిన టీచర్లపై ఇప్పటి వరకు ఎలాంటి శాఖాపరమైన చర్యలు లేకపోవడం గమనార్హం.
ఫోకల్ పోస్టుకు రూ. 50 వేలు....
పదోన్నతులు ప్రారంభమయ్యే నాటికే రేషనలైజేషన్ (హేతుబద్దీరణ) ప్రక్రియ పూర్తిచేసి ఆ సమాచారం ఉపాధ్యాయులందరికీ అందుబాటులో ఉంచాలి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ వివరాలను రోజుల తరబడి ఆన్‌లైన్లో పెట్టకుండా తాత్సారం చేయడంతోనే అక్రమాలకు బీజం పడిందని అధికారులు నిర్ధారించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయు పోస్టులు, ఖాళీలు, హేతుబద్దీరణలో సర్‌ప్లెస్ అయిన పోస్టులను, అలాట్ అయిన పోస్టుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూపించాల్సి ఉండగా.. విద్యాశాఖ అధికారులు వాటి వివరాలను గోప్యంగా ఉంచి కొన్ని ఖాళీలను ఆన్‌లైన్‌లో బ్లాక్ చేసి పెట్టారు. తరువాత ఆ పోస్టులను తమ అనుకూలమైన వారికి అమ్ముకున్నారు. ప్రధానంగా 30 శాతం హెచ్‌ఆర్‌ఏ అదనంగా ఉండి, హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం, సంగారెడ్డి, నర్సాపూర్ మండలాల్లోని పాఠశాలల్లో పోస్టింగులకు కోసం ఉపాధ్యాయులు ఎగబడ్డారు. ఎవరికి తోచిన విధంగా ఉత్తరం, దక్షిణాలతో పైరవీలు చేసుకున్నారు. ఫోకల్ స్థాయిని బట్టి ఒక్కొక్క అక్రమ బదిలీకి రూ. 25 వేల నుంచి రూ. 50 వరకు ముట్టజెప్పినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.
తప్పుడు ధ్రువీకరణ పత్రాలు
ఉపాధ్యాయ బదిలీల్లో ప్రిఫరెన్షియల్ కోటా ఉంది. వితంతువులు, దంపతుల్లో అనారోగ్యం ఉన్నవారు ఈ విభాగం పరిధిలోకి వస్తారు. ప్రిఫరెన్సియల్ కోటా కింద 77 మంది ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. కోటాలో 15 మంది ఉపాధ్యాయులు తప్పుడు ధ్రువపత్రాలను సవృర్పించి అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ‘స్పౌ’ కేసుల్లో కూడా భారీగా అక్రమాలు జరిగినట్లు తేలింది. ఐదేళ్లకు ఒకసారి వినియోగించుకోవాల్సిన ఈ వెసులుబాటును కొంతమంది ఉపాధ్యాయులు ఏడాది తిరగక ముందే మరోసారి వినియోగించుకున్నట్లు తేలింది.
కొంతమందైతే భార్యాభర్తలు కాకుండానే భార్యభర్తలుగా తప్పుడు పత్రాలు చూపించి పోస్టింగ్ తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. విద్యాశాఖ అధికారులు గుర్తించిన 52 మందిపై చర్యలు తీసుకొని అర్హులకు అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికిపై డీఈవో నజీమొద్దీన్ వివరణ కోరగా అక్రమ బదిలీల వ్యవహారంపై ఆర్‌జేడీ అధికారి ఆధ్వరంలో విచారణ కొనసాగుతోందని, దీనిపై తానేమి చెప్పలేనన్నారు.