ఎన్నాళ్లో వేచిన ఉదయం | Telagana formation day | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లో వేచిన ఉదయం

Published Sun, Jun 1 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

ఎన్నాళ్లో వేచిన ఉదయం

ఎన్నాళ్లో వేచిన ఉదయం

  •      తెలంగాణ అవతరణ వేళ..
  •      నగరం గులాబీమయం
  •      అంబరమంటే సంబురాలకు ఏర్పాట్లు
  •      సర్వత్రా ‘ఆవిర్భావ’ సందడి
  •      సకల జనులూ అదే ధ్యాసలో..
  •  దశాబ్దాల ఎదురుచూపులు ఫలించే తరుణం.. ఏళ్ల తరబడి సాగిన సుదీర్ఘ పోరాటానికి చరమగీతం పాడే సమయం.. కోట్లాదిమంది స్వప్నం సాకారమయ్యే క్షణం.. తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరిస్తున్న వేళ.. అంబరమంటే సంబురానికి తెర లేవనుంది.. ఆ అపురూప దృశ్యాన్ని ‘నభూతో.. నభవిష్యతి’ అన్న రీతిలో జరుపుకోవడానికి నగరం   సంసిద్ధమవుతోంది. ఎక్కడ చూసినా విద్యుల్లతలు.. వెలుగుజిలుగులు.. భారీ హోర్డింగులు.. ఎత్తై కటౌట్లు.. రంగుల హంగులు.. నింగికెగసే బెలూన్లు.. ఉత్సవ వేదికలు.. డీజేలు.. బాజాలు.. వెరసి పండగ వాతావరణం ప్రతిబింబించేలా సిటీని తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ర్యాలీలు, ధూంధాంలు.. ఉత్సవాలు, జెండా ఆవిష్కరణలు  చేపట్టేందుకు వివిధ సంఘాలు సిద్ధమవుతుండగా.. అవతరణ దినోత్సవాన్ని మధురస్మృతిగా పదిల పరుచుకునేందుకు వివాహాల వంటి శుభకార్యాలు ఆ రోజే చేసుకునే హడావుడిలో  పలువురు తలమునకలై ఉన్నారు. వెరసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ స్థాయిలో కసరత్తు జరుగుతోంది.
     
    సాక్షి, సిటీబ్యూరో : ‘గ్రేటర్’లో పార్టీలకతీతంగా తెలంగాణప్రాంత వాసులంతా తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ ఉత్సవాల్లో భాగస్వాములవుతుండగా, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) సైతం ఉత్సవ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాలుపంచుకుంటోంది. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా, గన్‌పార్కు, పరేడ్ గ్రౌండ్.. ఇలా ఉత్సవాలకు వేదికలు కానున్న పలు ప్రాంతాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది.

    వివిధ మార్గాల్లో రహదారులను తీర్చిదిద్దడంతోపాటు, పచ్చదనం పెంపు, డివైడర్లకు రంగులు తదితర కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఆదివారం రాత్రి నుంచి వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనుంది. పలు ప్రాంతాలు విద్యుద్దీప కాంతులతో వెలుగుపూలు విరజిమ్మనున్నాయి. జీహెచ్‌ఎంసీలోని సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ మహిళలు సైతం ఈ వేడుకల్లో భాగస్వాములవుతున్నారు.

    జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల అధికారులకు ఆయా  బాధ్యతలు అప్పగించారు. వీరు రహదారులు, పారిశుధ్యం, పచ్చదనం, వీధిదీపాలు, వేదికల ఏర్పాటు తదితర కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆహారపొట్లాలు, మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలకూ ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో అవతరణ ఉత్సవాలు నిర్వహించనున్నారు.

    తెలుగుతల్లి జంక్షన్, అబిడ్స్ జీపీఓ, రాజ్‌భవన్ రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం, బంజారాహిల్స్ చెక్‌పోస్టు, ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ క్లాక్‌టవర్, శిల్పారామం, చార్మినార్, అసెంబ్లీ, సచివాలయం, పరేడ్‌గ్రౌండ్ ఇంకా.. ఇంకా పలు ప్రాంతాలు విద్యుల్లతలతో వెలుగులు పంచనున్నాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సీనియర్ అధికారులతో కలిసి శనివారం రాత్రి నందినగర్, బంజారాహిల్స్, గన్‌పార్క్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ తదితర ప్రాంతాల్లో రహదారులు.. వీధిదీపాల ఏర్పాట్లు తదితర పనుల్ని తనిఖీ చేశారు. సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు.
     
    వివిధ జేఏసీల ఆధ్వర్యంలోనూ...

    వివిధ జేఏసీల ఆధ్వర్యంలోనూ గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి  గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు, ధూంధాంలు, బతుకమ్మలు, గాల్లోకి బెలూన్లు, బాణసంచా వెలుగులు ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

    ఫైర్‌డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్‌ప్లాజాలో కనీవినీ ఎరుగని రీతిలో వెలుగుపూల బాణసంచా కాల్చనున్నారు. సోమవారం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక నగరంలోని దాదాపు 50 ప్రాంతాల్లోనూ బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు. కూకట్‌పల్లిలో బతుకమ్మలు, బెలూన్లు.. బాణసంచా తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరదల నుంచి ఎందరినో కాపాడిన ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు వద్ద సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
     
     మధురస్మృతిగా మల్చుకునే ప్రయత్నంలో..

    ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాన్ని మరపురాని మధురస్మృతిగా మిగుల్చుకునేందుకు కొందరు నిశ్చితార్ధాలు చేసుకుంటుండగా, మరికొందరు పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. ప్రసవ సమయం దగ్గర పడిన మహిళలు కొందరు జూన్ రెండో తేదీన శిశువులకు జన్మనిచ్చేందుకు ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. ఇలా అన్ని వర్గాలవారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉత్సవాన్ని మరచిపోని జ్ఞాపకంగా పదిల పరచుకునేందుకు, ఘనంగా నిర్వహించుకునేందుకు సంసిద్ధులై ఉన్నారు. ఆనంద ఘడియల్ని ఆస్వాదించేందుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement